గర్భవతి అయినా వెనక్కి తగ్గని దీపికా పదుకొణె!
దీపిక గర్భవతిగా ఉన్న సమయంలో కూడా వెనుకాడకుండా అత్యంత కఠినమైన యాక్షన్ సన్నివేశాల్లో నటించి ఆశ్చర్యపరిచారు.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె నటన పట్ల తనకున్న నిబద్ధతను మరోసారి నిరూపించుకున్నారు. అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతోన్న ప్రతిష్టాత్మక చిత్రం 'రాకా' షూటింగ్‌లో దీపిక పాల్గొన్న తీరు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. దీపిక గర్భవతిగా ఉన్న సమయంలో కూడా వెనుకాడకుండా అత్యంత కఠినమైన యాక్షన్ సన్నివేశాల్లో నటించి ఆశ్చర్యపరిచారు. సాధారణంగా నటీమణులు గర్భధారణ సమయంలో సినిమాలకు దూరంగా ఉండాలని భావిస్తుంటారు. కానీ దీపికా పదుకొణె మాత్రం 'రాకా' చిత్రంలోని కీలకమైన యాక్షన్ సీక్వెన్స్‌లను పూర్తి చేయడం ద్వారా వృత్తిపై ఉన్న గౌరవాన్ని చాటుకున్నారు.
సెట్స్‌లో దీపిక చూపిన ధైర్యం .. క్రమశిక్షణ చిత్రబృందానికి సైతం స్ఫూర్తినిచ్చాయి. దీపిక భద్రత దృష్ట్యా సెట్స్‌లో అన్ని జాగ్రత్తలు తీసుకున్నా? దీపికా మాత్రం నటనలో ఏమాత్రం రాజీ పడలేదు. కొన్ని సన్నివేశాల్లో రిస్క్ వద్దని స్టంట్ మాస్టర్లు సూచించినా? సీన్ పర్పెక్షన్ కోసం తానెక్కడా తగ్గలేదని చిత్ర వర్గాల ద్వారా తెలిసింది. గర్భవతిగా ఉన్నా కష్టమైన సన్నివేశాలను డూప్ లేకుండానే ఆమె చేయడానికి ప్రయత్నించడం దీపిక అంకితభావానికి నిదర్శనమని చిత్ర యూనిట్ కొనియాడుతోంది. బాధ్యతాయుతమైన పాత్రలను ఎంచుకోవడమే కాకుండా? వాటిని పూర్తి చేయడానికి తాను ఎంచుకున్న మార్గం పట్ల దీపిక ఎంతో స్పష్టతతో ఉన్నారని అర్దమవుతుంది.
దీంతో చిత్ర షూటింగ్ కూడా అనుకున్న సమయానికి పూర్తయ్యే అవకాశం ఉంది. దీపిక ధైర్యానికి అల్లు అర్జున్ సైతం ఫిదా అయ్యారు. రెస్ట్ తీసుకోవాల్సిన సమయంలో సెట్స్ కే హాజరవ్వడం ఎక్కువ అనుకుంటే? దీపిక ఏకంగా యాక్షన్ సన్నివేశాల్లో పాల్గొనడం చూసి షాక్ అయినట్లు తెలిపారు. గతంలో అలియాభట్ కూడా ఓ హాలీవుడ్ సినిమా కోసం ఇలాగే శ్రమించింది. అప్పటికే రెండు నెలల గర్భం దాల్చిన అలియాభట్ యాక్షన్ సన్నివేశాలు చేయడం కీలకం కావడంతో? అమెరికా షూట్ లో పాల్గొంది. అవి ఎంతో కఠినమైన యాక్షన్ సన్నివేశాలు. కొన్నింటిలో ఏకంగా రోప్ ను చేతులతో పట్టుకుని నడవాల్సిన సన్నివేశాలను సైతం అలియా సునాయాసంగా చేసింది.
అవి చూసి హాలీవుడ్ మేకర్స్ సైతం షాక్ అయ్యారు. తాజాగా 'రాకా' సినిమాకు పనిచేస్తోన్న విదేశీ టెక్నిషీయన్లు కూడా దీపిక లో మాస్ యాంగిల్ చూసి అంతే స్టన్ అవుతున్నారు. మొత్తంగా వ్యక్తిగత జీవితం - వృత్తిపరమైన జీవితం మధ్య సమతుల్యతను పాటిస్తూ దీపికా పదుకొణె కెరీర్‌ను ముందుకు తీసుకెళ్తున్న తీరు అభినందనీయం. గర్భవతిగా ఉండి కూడా యాక్షన్ చిత్రంలో కీలక పాత్ర పోషించడం అనేది సామాన్యమైన విషయం కాదు. దీపికా పదుకొణే తెగువ ఆమెను స్టార్‌డమ్ దాటి గొప్ప కళాకారిణిగా నిలబెడుతోందనడంలో సందేహం లేదు.