8గం.ల పనిదినం కోసం పోరాడతానన్న దీపిక
ప్రభాస్ సరసన స్పిరిట్ తో పాటు కల్కి సీక్వెల్ `కల్కి 2898 ఏడి` నుంచి కూడా దీపికను తొలగించారు.;
''8 గంటల పనిదినం మాత్రమే కావాలి.. ఓవర్ టైమ్ నా వల్ల కాదు!`` అంటూ నిర్మొహమాటంగా చెప్పేయడంతోనే దీపిక పదుకొనేను సందీప్ వంగా `స్పిరిట్` నుంచి తొలగించారా? ఇటీవలి కాలంలో దీపికకు మద్ధతు పలుకుతున్నవారంతా చెబుతున్న పాయింట్ ఇది. అయితే ఒక బిడ్డ తల్లిగా దీపిక ఇలా కోరితే అది సమంజసమే కానీ, ఇంకా బయటకు తెలియని కొన్ని ఇతర విషయాలు కూడా ఈ త్రో - ఔట్ సీన్ కి కారణమయ్యాయని తెలుస్తోంది.
ప్రభాస్ సరసన స్పిరిట్ తో పాటు కల్కి సీక్వెల్ `కల్కి 2898 ఏడి` నుంచి కూడా దీపికను తొలగించారు. ఈ రెండు సినిమాలను కోల్పోయినా కానీ, దీపిక బాణీ ఎక్కడా మారలేదు. తాను 8గంటల పనిదినానికి కట్టుబడి ఉన్నానని దీపిక పదే పదే ప్రకటిస్తోంది. తాను మాత్రమే కాదు.. ఇకపై తల్లులు ఎవరైనా సెట్స్ లో ఉంటే వారు 8గం.లు మాత్రమే పని చేసేలా తాను ఏదో ఒకటి చేస్తానని కూడా ప్రకటించేసింది దీపిక. దీని అర్థం బిడ్డ తల్లుల కోసం ఒక అసోసియేషన్ ని ప్రారంభిస్తుందా? అనే సందేహం సోషల్ మీడియాలో వ్యక్తమవుతోంది. ఇదంతా ఏమో తెలీదు కానీ, ఇకపై అనవసరమైన మానసిక, శారీరక ఒత్తిడిని బిడ్డ తల్లులైన ఆర్టిస్టులు ఎవరూ భరించాల్సిన అవసరం లేదు.
సరిగా పని చేయాలంటే మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలని నేను నమ్ముతాని చెప్పింది దీపిక. ఓవర్ వర్క్ ఒత్తిళ్లు, సినిమా సెట్లలో బ్యాలెన్స్ డ్ షెడ్యూల్‌ల ఆవశ్యకతపై దీపిక మాట్లాడింది. ఓవర్ టైమ్ డ్యూటీని కూడా జనరలైజ్ చేయకూడదు. రోజుకు ఎనిమిది గంటల పని మనిషి శారీరక, మానసిక శ్రేయస్సుకు సరిపోతుంది.. అని తెలిపింది. మనం ఆరోగ్యంగా ఉంటేనే ది బెస్ట్ ఇవ్వగలం. బాగా ఒత్తిడితో కాలిపోయిన వ్యక్తిని తిరిగి వ్యవస్థలోకి తీసుకురావడం ఎవరికీ సహాయపడదు. నా సొంత ఆఫీసులో సోమవారం నుండి శుక్రవారం వరకు రోజుకు ఎనిమిది గంటలు పని చేస్తాము. మాకు ప్రసూతికి సంబంధించి, అలాగే పితృత్వానికి సంబంధించిన విధానాలు కొన్ని ఉన్నాయి. తల్లి అయ్యాక పని ప్రాధాన్యతలు మారతాయి. అలాగే పిల్లలను ఆఫీస్ కి కూడా తీసుకు రావాలని దీపిక సూచించింది. నాకు విజయం అంటే శారీరక - మానసిక శ్రేయస్సు. టైమ్ మన గొప్ప కరెన్సీ.. నేను ఎలా గడపాలో నిర్ణయించుకునే స్వేచ్ఛను కలిగి ఉన్నాను.. అదే నాకు విజయం!! అని దీపిక అన్నారు.
న్యాయబద్ధమైన పనిగంటల కోసం వాదించడానికి తాను సిద్ధమేనని దీపిక అన్నారు. ఉద్యోగుల మానసిక ఆరోగ్యం మెరుగుదలను తాను సమర్థిస్తానని అన్నారు. భారతదేశపు మొట్టమొదటి మానసిక ఆరోగ్య రాయబారిగా, ఉద్యోగుల సంరక్షణ పద్ధతులపై అవగాహన పెంచుతోంది. తగినంత మంది కౌన్సెలర్లు, మానసిక నిపుణులు మనకు లేరు. అందుకే నేను సహాయం చేయాలనుకుంటున్నాను! అని దీపిక వివరించారు. దీపిక టాలీవుడ్ లో రెండు భారీ ప్రాజెక్టులను కోల్పోయినా కానీ, తదుపరి షారూఖ్ కింగ్ లో నటిస్తోంది. సిద్దార్థ్ ఆనంద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అల్లు అర్జున్- అట్లీ క్రేజీ ప్రాజెక్టులోను దీపిక ప్రధాన పాత్రలో నటిస్తోంది.