దీపిక ప‌దుకొనేను స‌మ‌ర్థించిన ఆ న‌లుగురు

భార‌త‌దేశంలో అత్యధిక పారితోషికం అందుకునే నటీమణులలో ఒకరైన దీపికా పదుకొనే ఇటీవ‌ల ఊహించ‌ని రీతిలో బ్యాక్ టు బ్యాక్ అవ‌కాశాల‌ను కోల్పోవ‌డంపై చాలా చ‌ర్చ సాగింది.;

Update: 2025-10-27 04:01 GMT

భార‌త‌దేశంలో అత్యధిక పారితోషికం అందుకునే నటీమణులలో ఒకరైన దీపికా పదుకొనే ఇటీవ‌ల ఊహించ‌ని రీతిలో బ్యాక్ టు బ్యాక్ అవ‌కాశాల‌ను కోల్పోవ‌డంపై చాలా చ‌ర్చ సాగింది. దీనికి కార‌ణం దీపికలో పెచ్చు మీరిన `ఫెమినిజం` అని క‌థ‌నాలొచ్చాయి. తాను ఏం కోరుకుంటుందో అది మాత్ర‌మే చేస్తుంది. దానికి ద‌ర్శ‌క‌నిర్మాతలు అంగీక‌రించాలి. కానీ దీపిక అనుకున్న‌ది ఒక‌టి..అయిన‌ది ఇంకొక‌టి..! కార‌ణం ఏదైనా స్పిరిట్, క‌ల్కి 2898 ఏడి వంటి భారీ చిత్రాల నుంచి మేక‌ర్స్ దీపిక‌ను మ‌రో ఆలోచ‌న లేకుండా త‌ప్పించారు.

దీపిక తాను 6 గం.లు మాత్ర‌మే ప‌ని చేస్తాన‌ని, బిడ్డ త‌ల్లిగా త‌న‌కు ఈ సౌల‌భ్యం కావాల‌ని కోరిన‌ట్టు క‌థ‌నాలొచ్చాయి. లాభాల్లో వాటాలు కావాలి. దీనికి తోడు త‌న సిబ్బందికి ప్యాకేజీల విష‌యంలో ప‌ట్టుబ‌ట్టిన‌ట్టు క‌థ‌నాలొచ్చాయి. అయితే స‌హ‌జంగానే భారీ చిత్రాల్లో న‌టించే తార‌ల‌కు ప‌ని గంట‌ల నియ‌మం ఇబ్బందిక‌రం. ఒక్కోసారి అద‌న‌పు స‌మ‌యం కూడా కేటాయించాల్సి ఉంటుంది. బిడ్డ త‌ల్లుల కండిష‌న్ ఇలాంటి ప‌రిస్థితుల‌కు సహ‌క‌రించ‌ని నేప‌థ్యంలో మేకర్స్ ఆ రెండు సినిమాల నుంచి త‌ప్పించారు.

దీపిక ప‌దుకొనే నిస్సందేహంగా 6 నుంచి 8గంట‌లు ప‌ని దినాన్ని కోరుకుంది. అంత‌కుమించి సెట్లో వేచి ఉండ‌లేన‌ని తెగేసి త‌న ద‌ర్శ‌క‌నిర్మాత‌ల‌కు చెప్పేయ‌డంతోనే స‌మ‌స్య వ‌చ్చి ప‌డింది. అయితే దీపిక నియ‌మాన్ని కొంద‌రు బాలీవుడ్ తార‌లు స‌మ‌ర్థించ‌గా, చాలా మంది విమ‌ర్శించారు.

దీపిక నిర్ణ‌యానికి బ‌ల‌మైన మ‌ద్ధ‌తునిచ్చిన వారిలో కొంకణ సేన్ శర్మ ఒక‌రు. న‌టి కొంకణ సేన్ శర్మ ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ.. దీపిక లాంటి మ‌గువ‌లు ఇంకా చాలా మంది అవసరం అని అన్నారు. దీపిక ప్ర‌క‌టించిన‌ నియ‌మాల‌ను కొనియాడారు ఈ సీనియ‌ర్ న‌టి. మేం 14-15 గంటలు పని చేయలేము.. మాకు 12 గంటల టర్నరౌండ్ ఉండాలి అని కూడా కొంక‌ణా సేన్ శర్మ అభిప్రాయపడ్డారు. వారంలో ఒక రోజు సెలవు కావాలని కూడా ఆమె వాదించారు. మ‌గ ఆర్టిస్టులు ఆలస్యంగా వచ్చి ఇత‌రుల‌ను ఇబ్బంది పెట్ట‌కూడదు.. మహిళలు తమ పిల్లలను వదిలి ఎక్కువ గంటలు పనిచేస్తున్నట్లుగా ఉండకూడదు అని సేన్ అన్నారు.

దీపిక ప‌దుకొనే నిర్ణ‌యం చాలా ధైర్యంతో కూడుకున్న‌ద‌ని ర‌ష్మిక మంద‌న్న స‌మ‌ర్థించారు. ఇలాంటి విష‌యాల‌ను మాట్లాడేందుకు మ‌హిళా తార‌లు వెన‌కాడ‌తార‌ని, దూరంగా ఉంటార‌ని కూడా ర‌ష్మిక అన్నారు. అయితే సీనియ‌ర్ న‌టి రాణి ముఖ‌ర్జీ ఈ విష‌యంలో త‌ట‌స్థంగా ఉన్నారు. ఎవరూ ఎవరిపైనా నియమాలను బలవంతంగా రుద్ద‌లేరు. కానీ వ్యవస్థ న్యాయంగా ఉంటే దీపికా కోరేది సాధ్యమవుతుంద‌ని రాణీజీ అన్నారు.

ప‌నిగంట‌ల విష‌యంలో తాను సౌకర్యానికి ప్రాధాన్యతనిస్తాన‌ని చెప్పిన న‌వాజుద్దీన్ సిద్ధిఖి.. ఏది సాధ్యమైనంత సౌకర్యంగా ఉందో అది అందరికీ అమ‌ల్లో ఉండాల‌ని అన్నారు. న‌టుల‌ను అలసిపోకుండా ఉంచే విధంగా షెడ్యూల్ ఉండాలి.. మీ పనిని సులభంగా పూర్తి చేయడానికి చూడాల‌ని అన్నారు.

పంజాబీ గాయ‌కుడు, న‌టుడు దిల్జిత్ దోసాంజ్ కూడా దీపిక‌కు మద్దతు ఇస్తూ.. చాలా మంది మేల్ స్టార్స్ 8గంట‌ల షిఫ్ట్ లో ప‌ని చేసినా వారికి అనుకూలంగా ప‌ని చేస్తారు.. అది ఎప్పుడూ వార్తల్లోకి రాలేదు! అని అన్నారు. యువ‌న‌టుడు ఇషాన్ ఖట్టర్ మాట్లాడుతూ.. బాలీవుడ్ షెడ్యూల్‌లలో క్రమశిక్షణ లేకపోవడాన్ని త‌ప్పుగా ఎత్తి చూపారు. ఈ సరిహద్దులపై చర్చించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అన్నారు. కాల్షీట్‌లో సమయం ప్రోటోకాల్ దుర్వినియోగం కాకూడ‌ద‌ని అన్నారు. న‌టీన‌టులు ఇతరుల సమయం గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంద‌ని వ్యాఖ్యానించాడు.

గంద‌ర‌గోళ షెడ్యూళ్లతో ప్ర‌యాణాల‌తో ఆర్టిస్టు జీవితం ఇబ్బందిగా ఉంటుంద‌ని, నిద్ర చెడిపోతే మంచిది కాద‌ని ద‌ర్శ‌క‌నిర్మాత హ‌న్స‌ల్ మెహ‌తా అన్నారు. 12-15 గంటల పనిని స‌మ‌ర్థించ‌డాన్ని ఆయన విమర్శించారు. జీవితాన్ని వ‌ర్క్ లైఫ్ ని బ్యాలెన్స్ చేయాల‌నే వాద‌న‌ను చాలా మంది స‌మ‌ర్థించారు.

Tags:    

Similar News