నేటిత‌రం సీత సాయిప‌ల్ల‌వికి అల‌నాటి సీత విసిరిన స‌వాల్

సాయి పల్లవి నటనపై ప్రశంసలు కురిపిస్తూనే.. సీతాదేవి రూపం విషయంలో సీనియ‌ర్ న‌టి దీపికా చిక్లియా తన అభిప్రాయాన్ని నిర్మొహ‌మాటంగా షేర్ చేసారు.

Update: 2026-07-24 05:30 GMT

ర‌ణ‌బీర్ క‌పూర్ ప్ర‌ధాన పాత్ర‌లో నితేష్ తివారీ దర్శకత్వంలో అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం 'రామాయణం'. ఈ చిత్రంలో ర‌ణ‌బీర్ శ్రీ‌రాముడిగా న‌టించ‌గా, సీతాదేవి పాత్రలో సౌత్ న‌టి సాయి పల్లవి న‌టిస్తున్నారు. రావణాసురుడిగా కన్నడ స్టార్ యష్ నటిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ విడుదల కానున్న నేపథ్యంలో 1980ల నాటి రామానంద్ సాగర్ ఐకానిక్ టీవీ సీరియల్ 'రామాయణ్'లో సీతాదేవిగా నటించి కోట్లాది మంది అభిమానాన్ని పొందిన సీనియర్ నటి దీపికా చిక్లియా సాయి పల్లవి కాస్టింగ్‌పైనా .. ఈ భారీ సినిమాపైనా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

సాయి పల్లవి నటనపై ప్రశంసలు కురిపిస్తూనే.. సీతాదేవి రూపం విషయంలో సీనియ‌ర్ న‌టి దీపికా చిక్లియా తన అభిప్రాయాన్ని నిర్మొహ‌మాటంగా షేర్ చేసారు. సాయి పల్లవి చాలా అద్భుతమైన నటి అని.. త‌న‌ నటనను ఇప్ప‌టికే తాను చూశానని చెప్పారు. అయితే సీతాదేవి పాత్రలో ఎలా కనిపిస్తుందో ఇప్పటికైతే తాను ఊహించలేకపోతున్నానని తెలిపారు. తులసీదాస్ రామాయణంలో సీతాదేవి రూపాన్ని వర్ణిస్తూ బాదం ఆకారపు కళ్లు, నిర్దిష్టమైన ఎత్తు, చర్మ ఛాయ .. మంచి జుట్టు ఉంటాయని రాశారని గుర్తుచేశారు. రామానంద్ సాగర్ కూడా అలాంటి రూపం కోసమే వెతికి తనను ఎంపిక చేశారని.. అయితే రామాయణంలో ఎక్కడా జుట్టు ముంగురులు తిరిగిన (కర్లీ హెయిర్) సీతాదేవి ప్రస్తావన లేదని వ్యాఖ్యానించారు. తెరపై చూసినప్పుడే సాయి పల్లవి ఆ పాత్రకు ఎంతవరకు సెట్ అయిందో తెలుస్తుందన్నారు.

రామానంద్ సాగర్ క్లాసిక్ టీవీ సీరియల్ ప్రభావం ప్రేక్షకుల మనస్సుల్లో ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉందని దీపికా అభిప్రాయపడ్డారు. కరోనా లాక్‌డౌన్ సమయంలో కూడా దూరదర్శన్‌లో ఈ షోను కొత్త తరం విశేషంగా ఆదరించిందని... కాబట్టి ఆ జ్ఞాపకాలను చెరిపివేసి ఈ కొత్త సినిమాను ప్రేక్షకులు ఎలా స్వీకరిస్తారనేది ఆసక్తికరంగా మారిందన్నారు. పాత సీరియల్‌లో రాముడిగా నటించిన అరుణ్ గోవిల్ ఇప్పుడు ఈ కొత్త చిత్రంలో దశరథుడి పాత్ర పోషిస్తున్నారని... తమకు 'రామాయణ్' ఇచ్చిన గుర్తింపు ఎప్పటికీ చెరిగిపోదని చెప్పారు. ఈ కొత్త సినిమాలో రావణుడిగా నటిస్తున్న యష్ డైనమిక్ నటుడని.. ఈ చిత్రాన్ని అందరూ చూడాలనుకుంటారని భావిస్తూ చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.

ఇదే సమయంలో సీతాదేవి పాత్ర చేసిన తర్వాత తాను ఎదుర్కొన్న వ్యక్తిగత సవాళ్లను కూడా దీపికా గుర్తుచేసుకున్నారు. ఆ పాత్ర వల్ల తనను ఇండస్ట్రీలో పూర్తిగా టైప్‌కాస్ట్ చేశారని.. దానివల్ల తనకు వేరే కొత్త త‌ర‌హా న‌ట‌న‌కు అవకాశాలు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికీ తాను అవకాశాల కోసం అడుగుతుంటానని.. కానీ ఇప్పటి తరం నటులకు ఆ పరిస్థితి లేదని అన్నారు. ఉదాహరణకు రణ్‌బీర్ కపూర్ బర్ఫీ, సంజు, యానిమ‌ల్ లాంటి వైవిధ్యమైన సినిమాలు చేసి ఇప్పుడు రాముడి పాత్ర చేస్తున్నాడని.. నేటి నటులకు లభిస్తున్న స్వేచ్ఛను మేటి టీవీ న‌టి దీపికా కొనియాడారు.

ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్ - మాన్‌స్ట‌ర్‌ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ అంతర్జాతీయ స్థాయి చిత్రానికి ఆస్కార్ విజేతలు హన్స్ జిమ్మర్, ఎ.ఆర్. రెహమాన్ తొలిసారి కలిసి సంగీతం అందిస్తున్నారు. రాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, రావణుడిగా యష్‌తో పాటు హనుమంతుడిగా సన్నీ డియోల్, లక్ష్మణుడిగా రవి దూబే నటిస్తున్నారు. అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో రెండు భాగాలుగా రూపొందుతున్న‌ ఈ చిత్రంలో మొదటి భాగం 'రామాయణం: పార్ట్ 1' దీపావళి 2026 కానుకగా.. రెండవ భాగం 'పార్ట్ 2' దీపావళి 2027 కానుక‌గా విడుద‌ల కానున్నాయి.

Tags:    

Similar News