మనోజ్ కంబ్యాక్ మూవీకి 'స్పెషల్' టచ్
రాకింగ్ స్టార్ మంచు మనోజ్ హీరోగా రూపొందుతున్న పీరియాడికల్ యాక్షన్ మూవీ డేవిడ్ రెడ్డిపై తాజాగా ఆసక్తికరమైన వార్త వెలుగులోకి వచ్చింది.;
రాకింగ్ స్టార్ మంచు మనోజ్ హీరోగా రూపొందుతున్న పీరియాడికల్ యాక్షన్ మూవీ డేవిడ్ రెడ్డిపై తాజాగా ఆసక్తికరమైన వార్త వెలుగులోకి వచ్చింది. హనుమరెడ్డి యక్కంటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి ఓ స్పెషల్ సాంగ్ ను ప్లాన్ చేస్తున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఈ పాటలో మనోజ్‌తో కలిసి డాన్స్ చేయడానికి స్టార్ హీరోయిన్ రాశీ ఖన్నాను తీసుకోబోతున్నారని తెలుస్తోంది. దీంతో ఈ వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
స్టార్ హీరోయిన్లతో స్పెషల్ సాంగ్స్
గత కొన్నేళ్లుగా టాలీవుడ్‌లో ఐటెమ్ సాంగ్స్ ట్రెండ్ బాగా మారిపోయింది. ఒకప్పుడు ప్రత్యేకంగా ఐటెమ్ గర్ల్స్‌తో చేసే పాటలను ఇప్పుడు స్టార్ హీరోయిన్లతో చేయించడం మేకర్స్‌కు కొత్త స్ట్రాటజీగా మారింది. ఈ పాటలను ఐటెమ్ సాంగ్స్ అని కాకుండా స్పెషల్ సాంగ్స్‌గా పిలుస్తూ వాటికి ప్రత్యేక హైప్ తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. స్టార్ హీరోయిన్లు ఈ పాటల్లో కనిపిస్తే సినిమాపై ఆసక్తి పెరగడమే కాకుండా ప్రమోషన్స్‌కూ అదనపు ఆకర్షణ లభిస్తుందని నిర్మాతలు భావిస్తున్నారు. అదే ట్రెండ్‌ను ఇప్పుడు డేవిడ్ రెడ్డి టీమ్ కూడా ఫాలో అవుతున్నట్టు తెలుస్తోంది.
వరుస సినిమాలతో బిజీగా రాశీ
ఓ వైపు నటిగా వరుస సినిమాలతో బిజీగా ఉన్న రాశీ ఖన్నా స్పెషల్ సాంగ్స్ తో కూడా ఆడియన్స్ ను ఆకట్టుకోవాలని చూస్తున్నారు. అందులో భాగంగానే రాశీ ఈ సినిమాను ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. ఆమె గ్లామర్‌తో పాటూ డాన్స్ లో మంచి స్కిల్స్ ఉన్నాయి. అందుకే డేవిడ్ రెడ్డిలో ప్లాన్ చేస్తున్న ఈ స్పెషల్ సాంగ్‌కు ఆమెను ఎంపిక చేయాలనే ఆలోచన మేకర్స్ చేస్తున్నట్టు సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన మాత్రం ఇంకా రావాల్సి ఉంది.
రీఎంట్రీకి రెడీ అవుతున్న మనోజ్
మరోవైపు ఈ సినిమా మనోజ్ కెరీర్‌లో కీలకంగా భావిస్తున్నారు. కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఆయన మళ్లీ పూర్తి స్థాయిలో రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. అందుకే డేవిడ్ రెడ్డి మూవీని మాస్, యాక్షన్ ఎలిమెంట్స్‌తో పాటు కమర్షియల్ అంశాలు కూడా ఉండేలా తీర్చిదిద్దుతున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఒక హై ఎనర్జీ స్పెషల్ సాంగ్ సినిమాకు మరింత మాస్ అప్పీల్ ను తీసుకురావచ్చని టీమ్ భావిస్తున్నట్టు సమాచారం.
ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే, డేవిడ్ రెడ్డి స్వాతంత్రానికి పూర్వం బ్రిటిష్ పాలన నేపథ్యంలో సాగిన కథగా తెరకెక్కుతోంది. బ్రిటిష్ వారిపై పోరాడిన ధైర్యవంతుడైన యోధుడు డేవిడ్ రెడ్డి జీవిత కథ ఆధారంగా ఈ సినిమా రూపొందుతున్నట్టు తెలుస్తోంది. మూవీలో యాక్షన్ ఎపిసోడ్స్‌తో పాటు పీరియాడిక్ సెటప్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఈ మూవీలో మనోజ్ సరసన కోలీవుడ్ హీరోయిన్ మరియా నటిస్తున్నారు. మొత్తానికి డేవిడ్ రెడ్డి మూవీ ప్రత్యేక అంశాలతో ఆడియన్స్ ను ఆకట్టుకుంటూ వార్తల్లో నిలుస్తూనే ఉంది.