చిరు 'MSG'కి 'లీగల్' షీల్డ్.. టాలీవుడ్ చరిత్రలో ఫస్ట్ టైమ్

మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ గారు సినిమా విషయంలో తప్పుడు రివ్యూలు, బాట్‌ బేస్డ్ రేటింగ్‌ లపై కోర్టు మద్దతుతో చర్యలు తీసుకోవడం ఇప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌ గా మారింది.;

Update: 2026-01-10 11:41 GMT

టాలీవుడ్‌ లో తొలిసారిగా డిజిటల్ మిస్ యూజ్ కు అడ్డుకట్ట వేసే దిశగా కీలక అడుగు పడింది. మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ గారు సినిమా విషయంలో తప్పుడు రివ్యూలు, బాట్‌ బేస్డ్ రేటింగ్‌ లపై కోర్టు మద్దతుతో చర్యలు తీసుకోవడం ఇప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌ గా మారింది. ఇప్పటి వరకు అలాంటి చర్యలు చేపట్టడం ఇదే తొలిసారి.

అయితే ఏదైనా మూవీ రిలీజ్ కు ముందే లేదా విడుదలైన వెంటనే, కొంతమంది కావాలనే నెగటివ్ రివ్యూలు పోస్టు చేయడం, ఆటోమేటెడ్ బాట్ల ద్వారా రేటింగ్‌ లను తగ్గించడం ఇటీవలి కాలంలో టాలీవుడ్ లో పెద్ద సమస్యగా మారింది. దీని వల్ల ప్రేక్షకుల్లో తప్పుదోవ పట్టించే అభిప్రాయాలు ఏర్పడుతున్నాయని ఎప్పటికప్పుడు పలువురు నిర్మాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

దీంతో ఇప్పుడు మన శంకర వరప్రసాద్ గారు మూవీ మేకర్స్ న్యాయస్థానాన్ని ఇటీవల ఆశ్రయించారు. డిజిటల్ ప్లాట్‌ ఫారమ్‌ లలో కావాలనే జరుగుతున్న రివ్యూ బాంబింగ్, ఫేక్ అకౌంట్లు, బాట్ డ్రైవన్ నెగిటివ్ క్యాంపెయిన్స్‌ పై చర్యలు తీసుకోవాలంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసును విచారించిన న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది.

సరైన ఆధారాలు లేని, ఉద్దేశపూర్వకంగా సినిమాకు నష్టం కలిగించే రివ్యూలను పరిమితం చేయాలని కోర్టు ఆదేశించింది. అలాగే బాట్ల ద్వారా రేటింగ్లు తగ్గించే ప్రయత్నాలను నియంత్రించాలని సంబంధిత డిజిటల్ ప్లాట్‌ ఫారమ్‌ లకు సూచించింది. ఇది టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ చరిత్రలోనే మొదటిసారి కోర్టు మద్దతుతో తీసుకున్న డిజిటల్ లీగల్ షీల్డ్ గా చెప్పాలి.

అయితే ఆ నిర్ణయం వల్ల ఇకపై సినిమాలపై తప్పుడు ప్రచారానికి కొంత మేర అడ్డుకట్ట పడే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటివరకు సినిమాల హిట్ లేదా ఫ్లాప్ కేవలం ప్రేక్షకుల స్పందనకే పరిమితమయ్యేది. కానీ సోషల్ మీడియా యూజ్ పెరిగిన తర్వాత కొంతమంది కావాలనే ట్రోలింగ్, నెగటివ్ రివ్యూ క్యాంపెయిన్స్ ద్వారా మూవీపై తప్పుడు ప్రభావం చూపుతున్నారనే విమర్శలు ఉన్నాయి.

దీంతో సినిమాల విషయంలో నిర్మాతలు, దర్శకులు, నటులు ఆర్థికంగా కూడా నష్టపోతున్న పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో చిరంజీవి కొత్త సినిమా విషయంలో తీసుకున్న నిర్ణయం, భవిష్యత్తులో మరిన్ని చిత్రాలకు గైడ్ లైన్స్ గా నిలుస్తుందనే చెప్పాలి. సినిమాకు న్యాయపరమైన రక్షణ ఉండడం వల్ల నిజమైన ప్రేక్షకుల అభిప్రాయం మాత్రమే బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. మరి చూడాలి ఏం జరుగుతుందో.



Tags:    

Similar News