'ది ఒడిస్సీ' క‌లెక్ష‌న్లు చూపిస్తూ బాలీవుడ్‌పై పంచ్‌లు సెటైర్లు

హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన విజువల్ వండర్ `ది ఒడిస్సీ` గ్లోబల్ బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త చరిత్రను తిరగరాస్తోంది.

Update: 2026-07-24 03:50 GMT

హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన విజువల్ వండర్ `ది ఒడిస్సీ` గ్లోబల్ బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త చరిత్రను తిరగరాస్తోంది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం కేవలం 2 నుండి 3 రోజుల్లోనే ఏకంగా 264.1 మిలియన్ డాల‌ర్లు (మన భారతీయ కరెన్సీలో దాదాపు 2,200 కోట్లకు పైగా) గ్రాస్ వసూలు చేసి ప్రపంచ సినీ రంగాన్ని నిర్ఘాంతపరిచింది. 250 మిలియన్ డాల‌ర్ల‌ (దాదాపు 2,000 కోట్లు పైగా) భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా.. కేవలం తన ఓపెనింగ్ వీకెండ్‌లోనే పెట్టిన పెట్టుబడి మొత్తాన్ని రాబట్టుకుని సంచలనం సృష్టించింది.

ఈ ఊహించని విజయాన్ని.. కలెక్షన్ల సునామీని చూపిస్తూ సోషల్ మీడియాలో నెటిజన్లు, సినీ ప్రియులు బాలీవుడ్‌పై భారీ ఎత్తున సెటైర్లు, పంచ్‌లు విసురుతున్నారు. `ది ఒడిస్సీ` 2 రోజుల్లో సాధించిన ఈ కలెక్షన్లు మన బాలీవుడ్ ఇండస్ట్రీకి ఒక పెద్ద కోటింగ్ లాంటిది! అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మనదేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన బాలీవుడ్ లైఫ్‌టైమ్ రికార్డులను... నోలన్ సినిమా కేవలం 3 రోజుల వీకెండ్ వసూళ్లతో దాటేయడంపై విశ్లేషిస్తూ హిందీ చిత్ర పరిశ్రమ మేకింగ్ తీరును ఏకిపారేస్తున్నారు.

నోలన్ అభిమానులు ఆయనను `GOAT` (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్) అని కొనియాడుతూ.. ``ఇది సిద్ధార్థ్ ఆనంద్ తరహా రొటీన్ మాస్ సినిమా కాదు.. ప్యూర్ నోలన్ మ్యాజిక్!`` అంటూ పోలికలతో బాలీవుడ్ దర్శకులపై వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నారు. `ది ఒడిస్సీ` వసూళ్లు బాలీవుడ్‌కి ఒక అందని ద్రాక్ష లేదా కనిపించ‌ని డ్రీమ్! అని సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పిస్తున్నారు.

అయితే సినిమాపై అన్ని వైపులా ప్రశంసలు మాత్రమే కాకుండా మిశ్రమ స్పందనలు కూడా ఉన్నాయి. మెజారిటీ ప్రేక్షకులు మైండ్ బ్లోయింగ్ అని .. నోలన్ విజన్ అద్భుతమని ప్రశంసిస్తుంటే.. మరికొందరు మాత్రం అత‌డి సినిమాల్లో అంత‌గా ప్ర‌భావం చూపని సినిమా అని.. నాకు అసలు నచ్చలేదు! అంటూ పెదవి విరిచారు. దీనికి తోడు పోస్ట్ కింద ``ఇందులో భోజ్ పురి న‌టుడు రవికిషన్ కూడా ఉన్నాడా?`` అని ఒకరు సరదాగా కామెంట్ చేయగా.. రకరకాల ఫన్నీ ఎమోజీలు, ప్రమోషనల్ స్ప్యామ్ కామెంట్స్‌తో పోస్ట్ నిండిపోయింది.

ఏది ఏమైనా `ది ఒడిస్సీ` విజువల్స్, నటీనటుల ప్రదర్శన, ఐమాక్స్ కెమెరాల మేకింగ్ వల్ల `ది ఒడిస్సీ` థియేటర్లలో జానాన్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ రేంజ్ రికార్డులు నమోదు చేస్తూ... బాలీవుడ్ నిర్మాతలు - దర్శకులకు క్వాలిటీ అండ్ కంటెంట్ విషయంలో ఒక కొత్త పాఠాన్ని నేర్పుతోందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

`ది ఒడిస్సీ` బాక్స్ ఆఫీస్ వసూళ్లు:

ప్ర‌పంచ‌వ్యాప్తంగా థియేటర్లలో విజయవంతంగా 6 రోజులు పూర్తి చేసుకునే నాటికి `ది ఒడిస్సీ` ప్రపంచవ్యాప్తంగా దాదాపు 303 మిలియన్ డాల‌ర్ల‌ నుండి 346 మిలియన్ డాల‌ర్లు (భారతీయ కరెన్సీలో దాదాపు 2,800 కోట్ల నుండి 3,000 కోట్లు) రాబట్టింది. భారతీయ బాక్స్ ఆఫీస్ వద్ద ఈ చిత్రం 6 రోజుల్లో దాదాపు100.4 కోట్ల నుండి 104.69 కోట్ల గ్రాస్ వసూళ్లను (77 కోట్ల నెట్) సాధించి నోలన్ కెరీర్‌లోనే భారతదేశంలో అత్యంత వేగంగా 100 కోట్ల మార్కును దాటిన చిత్రంగా నిలిచింది.

Tags:    

Similar News