చోటా కామెంట్స్.. ఎంత వరకు కరెక్ట్?
టాలీవుడ్ లో భారీ బడ్జెట్ సినిమాల నిర్మాణం గురించి ప్రముఖ సినిమాటోగ్రాఫర్ చోటా కె నాయుడు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.;
టాలీవుడ్ లో భారీ బడ్జెట్ సినిమాల నిర్మాణం గురించి ప్రముఖ సినిమాటోగ్రాఫర్ చోటా కె నాయుడు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర నేపథ్యంలో ఆయన చేసిన కామెంట్స్ పై మిక్స్ డ్ రెస్పాన్స్ వస్తోంది. ఆయన వ్యాఖ్యల్లో కొంత నిజం ఉన్నప్పటికీ, మరోవైపు మరికొంత వివాదాస్పదంగా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన చోటా కె నాయుడు.. పెద్ద సినిమాల్లో పని చేసే టెక్నీషియన్ల పరిస్థితిని వివరిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "లైటింగ్ తప్పుగా ఉన్నా, స్టేజ్ కంపోజిషన్ సరిగా లేకపోయినా నేను లేదని చెప్పలేను. ఎదురుగా ఉన్న వీఎఫ్ఎక్స్ వ్యక్తి కొత్తవాడైనా, నిపుణుడైనా, లేక అనుభవం లేని వాడైనా అతను చెప్పిందే వినాల్సి వస్తుంది" అని ఆయన పేర్కొన్నారు.
అయితే ఆ వ్యాఖ్యలపై ఇప్పుడు కొంతమంది భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. సినిమా అనేది ఒక వ్యక్తి కృషి మాత్రమే కాదని, అన్ని డిపార్ట్మెంట్ల కోపరేషన్ తో తయారయ్యేదని చెబుతున్నారు. అందుకే సినిమాను విజయవంతంగా తెరకెక్కించడానికి దర్శకుడు, సినిమాటోగ్రాఫర్, ఆర్ట్ డైరెక్టర్, వీఎఫ్ఎక్స్ సూపర్వైజర్, స్టోరీ బోర్డ్ ఆర్టిస్టులు, యానిమేటర్లు, విజువల్ ఆర్టిస్టులు వంటి అనేక మంది కలిసి పని చేయాల్సి ఉంటుంది.
ఉదాహరణకు దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాలోని కొన్ని భారీ సన్నివేశాలు అంతర్జాతీయ స్థాయి టెక్నీషియన్ల సహకారంతో రూపొందాయి. ముఖ్యంగా ట్రైన్- ట్యాంకర్ ఢీకొనే సీన్ రూపొందించేటప్పుడు యూరప్ కు చెందిన మినియేచర్ ఆర్టిస్టుల సహాయం తీసుకున్నారు. ఆ సమయంలో సినిమాటోగ్రాఫర్ కేకే సెంథిల్ కుమార్ సహా మొత్తం టీమ్ కొత్త ఆలోచనలను స్వీకరించి కలిసి పని చేసినట్లు తెలుస్తోంది..
ఇలాంటి సందర్భాల్లో ఒక డిపార్ట్మెంట్ చెప్పినదాన్ని మరో డిపార్ట్మెంట్ పూర్తిగా రిజెక్ట్ చేయడం కంటే చర్చల ద్వారా బెస్ట్ రిజల్ట్ అందుకోవడం మంచి పద్ధతి. అందువల్ల వీఎఫ్ఎక్స్ టీమ్ చెప్పింది తప్పనిసరిగా వినాల్సిందే అన్న భావన పూర్తిగా సరైనది కాదని కొందరు అంటున్నారు. అయితే చోటా కె నాయుడు చెప్పిన మరో విషయం మాత్రం చాలా మందికి సమంజసంగా అనిపిస్తోంది.
"సినిమా వెనుక రూ.400 కోట్ల బడ్జెట్ ఉంది. అంత భారీగా డబ్బు పెట్టిన నిర్మాతల కోసం మనం తలవంచి పని చేయాలి. నేను గతంలో అంజి, డమరుకం వంటి సినిమాలు చేశానని గొప్పగా ప్రవర్తించడం సరైంది కాదు" అని ఆయన చెప్పిన మాటలు పరిశ్రమలో ప్రశంసలు అందుకుంటున్నాయి. భారీ బడ్జెట్ సినిమాల్లో నిర్మాతల పెట్టుబడి చాలా ఎక్కువగా ఉంటుంది. అలాంటి సమయంలో ప్రతి విభాగం తమ బాధ్యతను జాగ్రత్తగా నిర్వర్తించాల్సి ఉంటుంది. దర్శకుడు నుంచి చిన్న టెక్నీషియన్ వరకు అందరూ ఒకే లక్ష్యంతో పనిచేస్తేనే ప్రేక్షకులను ఆకట్టుకునే విజువల్ వండర్ సృష్టించడం సాధ్యమవుతుంది. మొత్తానికి చోటా వ్యాఖ్యల్లో కొన్ని కరెక్ట్ అయితే.. మరికొన్ని మాత్రం కరెక్ట్ కాదని చెప్పాలి.