విశ్వంభర ప్రపంచమే వేరట!
టీజర్ లోని వీఎఫ్ఎక్స్ కు నెగిటివ్ రెస్పాన్స్ రావడంతో చిత్ర యూనిట్ ఆ టీమ్ ను మార్చి కొత్త వారికి వీఎఫ్ఎక్స్ వర్క్స్ బాధ్యతల్ని అప్పచెప్పింది.;
గత కొన్ని సినిమాలుగా ఫ్లాపుల్లో ఉన్న మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర అనే సోషియో ఫాంటసీ సినిమాతో పాటూ అనీల్ రావిపూడి దర్శకత్వంలో మెగా157ను కూడా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ముందుగా ప్రేక్షకుల ముందుకు రానున్న సినిమా విశ్వంభర. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్ రిలీజైంది.
విశ్వంభరపై భారీ అంచనాలు
టీజర్ లోని వీఎఫ్ఎక్స్ కు నెగిటివ్ రెస్పాన్స్ రావడంతో చిత్ర యూనిట్ ఆ టీమ్ ను మార్చి కొత్త వారికి వీఎఫ్ఎక్స్ వర్క్స్ బాధ్యతల్ని అప్పచెప్పింది. సోషియో ఫాంటసీ సినిమా కావడంతో ఈ సినిమాకు ఎక్కువగా విజువల్ ఎఫెక్ట్స్ అవరసరమవుతుంది. చాలా ఏళ్ల తర్వాత చిరూ నుంచి వస్తున్న సోషియో ఫాంటసీ మూవీ అవడంతో విశ్వంభరపై అందరికీ మంచి అంచనాలున్నాయి.
చిరూ సరసన ఐదుగురు భామలు
ఇదిలా ఉంటే రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో డైరెక్టర్ వశిష్ట సినిమాలోని క్యాస్టింగ్ మరియు కొత్త విషయాలను వెల్లడించారు. విశ్వంభర సినిమాలో మొత్తం ఐదుగురు హీరోయిన్లు నటిస్తున్నారని వశిష్ట కన్ఫర్మ్ చేశారు. అందులో భాగంగానే త్రిష లీడ్ హీరోయిన్ గా నటిస్తుంటే, ఆషికా రంగనాథన్ సెకండ్ హీరోయిన్ గా నటిస్తున్నారని, మిగిలిన ముగ్గురూ కథలో భాగంగా కనిపిస్తారని, ఆ ఐదుగురు హీరోయిన్లూ సినిమాకు చాలా కొత్తదనాన్ని తీసుకొస్తారని వశిష్ట చెప్పారు.
అందుకే అవతార్ తో పోలిక
అయితే విశ్వంభర సినిమాను అవతార్ తో పోలుస్తున్న విషయంపై కూడా డైరెక్టర్ స్పందించి క్లారిటీ ఇచ్చారు. సినిమాలో విజువల్స్ ఆ కామెంట్స్ కు కారణమై ఉంటాయని, కానీ విశ్వంభర కథ, ఆ సినిమా కోసం తాను సృష్టించిన ప్రపంచం మొత్తం వేరే అని స్పష్టం చేశారు. విశ్వంభర రిలీజ్ ఆలస్యమవడానికి కారణం విజువల్స్ ఎఫెక్ట్స్ వర్క్సేనని ఆయన పేర్కొన్నారు.
మెగా157కు పూర్తి భిన్నంగా..
అనిల్ రావిపూడితో మెగాస్టార్ చేస్తున్న మెగా157 కథకు, విశ్వంభర సినిమా చాలా భిన్నంగా ఉంటుందని, తాము తీసిన సినిమాపై తాను చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నామని, ఎక్కడా ఎలాంటి ప్రెజర్ ఫీలవడం లేదని వశిష్ట చెప్పారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న విశ్వంభరకు పోస్ట్ ప్రొడక్షన్ అయిపోయి, వీఎఫ్ఎక్స్ తనకు నచ్చితే అప్పుడే సినిమా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయనున్నట్టు వశిష్ట తెలిపారు. ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే.