అదిగో ఇదిగో అంటూ ఏడాది.. విశ్వంభర ఇంకెప్పుడు మరి?
మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న సోషియో ఫాంటసీ ఫిల్మ్ విశ్వంభర విడుదల విషయం మరోసారి హాట్ టాపిక్ గా మారింది.
మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న సోషియో ఫాంటసీ ఫిల్మ్ విశ్వంభర విడుదల విషయం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. బింబిసార ఫేమ్ దర్శకుడు వశిష్ట తెరకెక్కిస్తున్న ఆ భారీ ప్రాజెక్టుపై మొదట్లో ఉన్న అంచనాలు రోజురోజుకు తగ్గిపోతున్నాయనే చర్చ వినిపిస్తోంది. రిలీజ్ డేట్ పై రూమర్లు వస్తున్నా.. కానీ అధికారిక ప్రకటన రాకపోవడం అభిమానులను మరింత నిరాశకు గురిచేస్తోంది.
యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఆ చిత్రం గత ఏడాది షూటింగ్ పూర్తి చేసుకున్నప్పటికీ, ఇప్పటివరకు విడుదలపై క్లారిటీ రాలేదు. మొదట ఆ సినిమాను 2025 సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల చేయాలని భావించారు. అయితే అదే సమయంలో రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ రిలీజ్ ఉండటంతో విశ్వంభర వాయిదా వేసినట్లు టాక్ వినిపించింది. ఆ తర్వాత సమ్మర్ రిలీజ్ అంటూ ప్రచారం జరిగింది.
చిరంజీవి కూడా అదే విషయాన్ని చెప్పారు. రీసెంట్ గా జూలై 10న సినిమా విడుదల అవుతుందనే వార్తలు వినిపించాయి. కానీ ఇప్పటి వరకు మేకర్స్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోవడం గమనార్హం. అందుకు ప్రధాన కారణంగా వీఎఫ్ ఎక్స్ పనులనే తెలుస్తోంది. సినిమా సెకండాఫ్ మొత్తం గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ పై ఆధారపడి ఉండటంతో క్వాలిటీ విషయంలో ఎలాంటి రాజీ పడకూడదనే ఉద్దేశంతో టైమ్ తీసుకుంటున్నట్లు గతంలో చిరంజీవి స్వయంగా వెల్లడించారు.
ఆడియన్స్ కు ఒక కొత్త విజువల్ అనుభూతిని అందించాలంటే పోస్ట్ ప్రొడక్షన్ పనులు హై రేంజ్ లో ఉండాలని భావిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. అయినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ లేకపోవడం అభిమానుల్లో ఆందోళన పెంచుతోంది. ఇప్పటికే చిరంజీవి తన కొత్త చిత్రాన్ని డైరెక్టర్ బాబీ కొల్లితో స్టార్ట్ చేశారు. ఇటీవల ప్రారంభమైన ఆ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా సాగుతోంది.
దీంతో విశ్వంభరపై మరింత కన్ఫ్యూజన్ నెలకొంది. ఒకవైపు కొత్త సినిమా శరవేగంగా ముందుకు వెళ్తుంటే, మరోవైపు చాలా కాలం క్రితం మొదలైన విశ్వంభర మాత్రం ఇంకా విడుదలకు సిద్ధం కాకపోవడం చర్చనీయాంశంగా మారింది. అయితే కేవలం వీఎఫ్ఎక్స్ పనులు మాత్రమే కాకుండా ఓటీటీ డీల్ కూడా విడుదల ఆలస్యానికి ఒక కారణమై ఉండొచ్చని కొందరు చెబుతున్నారు.
భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఆ సినిమాకు సరైన డిజిటల్ డీల్ కుదిరిన తర్వాతే రిలీజ్ డేట్ ను ఫైనల్ చేసే ఆలోచనలో నిర్మాతలు ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై కూడా అధికారిక సమాచారం లేదు. అయితే సినిమాపై మొదట్లో ఉన్న హైప్ ఇప్పుడు మెల్లగా తగ్గిపోతుండటంపై మెగా అభిమానులు సోషల్ మీడియాలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
కనీసం సినిమా విడుదల ఎప్పుడు? ప్రమోషన్స్ ఎప్పుడు మొదలవుతాయి? అనే విషయాలపై అయినా క్లారిటీ ఇవ్వాలని కోరుతున్నారు. భారీ అంచనాల మధ్య ప్రారంభమైన విశ్వంభర ఇప్పుడు విడుదల తేదీ విషయంలో ఇలా జరుగుతుండడం అభిమానులను నిరాశకు గురిచేస్తోంది. మరి ఆ విజువల్ వండర్ ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందో అన్నది ప్రస్తుతం మేకర్స్ కే తెలియాల్సిన పరిస్థితిగా మారింది.