టాలీవుడ్ అనే జిల్లాకు చిరంజీవి క‌లెక్ట‌ర్?

ద‌ర్శ‌క‌ర‌త్న డా.దాస‌రి నారాయ‌ణ‌రావు ఇండ‌స్ట్రీకి పెద్ద దిక్కుగా స‌మ‌స్య‌ల్ని ప‌రిష్క‌రించేవారు. ఇండ‌స్ట్రీలో ఆయ‌న గంభీర‌మైన స్వ‌రానికి, ఛ‌రిష్మాకు భ‌య‌ప‌డేవారు.;

Update: 2025-08-23 18:30 GMT

ద‌ర్శ‌క‌ర‌త్న డా.దాస‌రి నారాయ‌ణ‌రావు ఇండ‌స్ట్రీకి పెద్ద దిక్కుగా స‌మ‌స్య‌ల్ని ప‌రిష్క‌రించేవారు. ఇండ‌స్ట్రీలో ఆయ‌న గంభీర‌మైన స్వ‌రానికి, ఛ‌రిష్మాకు భ‌య‌ప‌డేవారు. ఆయ‌న దివంగ‌తులు అయ్యాక ఆ స్థానాన్ని భ‌ర్తీ చేసే మ‌రొక స్టార్ లేక‌పోవ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. ధాతృత్వంలో పేరున్న మెగాస్టార్ చిరంజీవి అన్నివేళ‌లా ఆ స్థానానికి అర్హుడు అని అంద‌రూ న‌మ్ముతున్నారు. ప‌రిశ్ర‌మ‌లో ఏ స‌మ‌స్య వ‌చ్చినా ముందుగా చిరంజీవిని క‌లుస్తున్నారు. ఇటీవ‌ల కార్మికుల‌తో నిర్మాత‌ల స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించేందుకు మెగాస్టార్ చిరంజీవి స్వ‌యంగా పూనుకున్నారు. చాలా మంత‌నాల త‌ర్వాత సీఎం రేవంత్ రెడ్డి చొర‌వతో ఇది ప‌రిష్కార‌మ‌య్యేందుకు ఆయ‌న స‌హ‌క‌రించార‌ని క‌థ‌నాలొచ్చాయి.

అయితే ఇండ‌స్ట్రీకి ఇది ఒక్క‌టే స‌మస్య కాదు. ఇక్క‌డితో అయిపోలేదు! ముందుంది ముస‌ళ్ల పండ‌గ‌!! అందుకే ఈ స‌మ‌యంలో మెగాస్టార్ ముందున్న విద్యుక్త ధ‌ర్మం గురించి తెలుగు మీడియాలో విస్త్ర‌తంగా చ‌ర్చ సాగుతోంది. ఆయ‌న లాంటి ఛ‌రిష్మా, సేవాగుణం ఉన్న వ్య‌క్తి క‌చ్ఛితంగా ఇండ‌స్ట్రీ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించ‌గ‌ల‌ర‌ని న‌మ్ముతున్నారు. క్రైసిస్ స‌మ‌యాల్లో విస్త్ర‌తంగా ఆర్థిక విరాళాలు అందించి, నిత్యావ‌స‌రాలు అందించి లేదా ఆస్ప‌త్రి బెడ్ ల కోసం స‌హ‌క‌రించిన‌ చిరంజీవి కేవ‌లం ఈ త‌ర‌హా సేవ చేస్తే స‌రిపోదు. ఆయ‌న పెద్ద‌రికం నెర‌పాల్సిన స‌మ‌యం ఆస‌న్న‌మైంది. దాస‌రిలా ఆయ‌న గంభీరంగా అన్ని విష‌యాల్లో చొర‌వ తీసుకోవాల్సిన స‌మ‌యం వ‌చ్చింద‌ని అంద‌రూ న‌మ్ముతున్నారు.

ఇప్పుడున్న పోటీ ప్ర‌పంచంలో వారానికి నాలుగైదు సినిమాలు రిలీజ్‌కి వ‌స్తుంటే, థియేటర్ల కోసం ఘర్షణలు స‌హ‌జం. అలాంటి స‌మ‌యంలో ఇరువురు నిర్మాత‌ల న‌డుమ ఆయ‌న మ‌ధ్య‌వ‌ర్తిత్వం చాలా ఉప‌క‌రిస్తుంది. స్నేహపూర్వకంగా స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించే విల్ ప‌వ‌ర్ ఆయ‌న‌కు ఉంది. అదే స‌మయంలో సినిమాలు నష్టపోయినప్పుడు పంపిణీవ‌ర్గాలు, బ‌య్య‌ర్లు న‌ష్ట‌పోకుండా నిర్మాత‌ల‌తో మ‌ధ్య‌వ‌ర్తిత్వంతో ప‌రిష్కారం చూప‌గ‌ల‌గాలి. స‌మ‌న్యాయం చేసేందుకు ఆయ‌న జ‌డ్జిగా మారాలి. పెద్ద సినిమాల రిలీజ్ ల స‌మ‌యంలో టికెట్ ధరల పెంపు పెద్ద స‌మ‌స్య‌. ప్ర‌భుత్వాలు మారినప్పుడు ఒక్కోసారి స‌మ‌స్య‌లు ఒక్కోలా ఉత్ప‌న్న‌మ‌వుతున్నాయి. అలాంటివి రాకుండా చిరు ముందు చూపుతో ప‌రిశ్ర‌మ‌ను ప్ర‌భుత్వంతో స‌మ‌న్వ‌యం చేయాలి. ఒక ర‌కంగా సినీప‌రిశ్ర‌మను ఒక జిల్లాగా ప‌రిగ‌ణిస్తే, దీని కోసం ప‌ని చేసే `జిల్లా క‌లెక్ట‌ర్` కం మెజిస్ట్రేట్ గా మారాలి.

ప్ర‌భుత్వాల నుంచి పరిశ్ర‌మ అభివృద్ధికి అవ‌స‌ర‌మ‌య్యే జీవోల‌ను విడుద‌ల‌య్యేలా చిరంజీవి కృషి చేయాలి. ప‌రిశ్ర‌మ విష‌యంలో ముందు చూపు చూడాలి. ఏపీకి ఉప‌ముఖ్య‌మంత్రి హోదాలో ఉన్న త‌న సోద‌రుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ వ‌యా చాలా స‌మ‌స్య‌ల్ని ప‌రిష్క‌రించేందుకు చొర‌వ చూపాలి.

ఏపీ టాలీవుడ్ అభివృద్ధి కోసం..!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో కొత్త సినీప‌రిశ్ర‌మ ఏర్పాటుకు స‌మ‌య‌మాస‌న్న‌మైంది. ఒక కొత్త ప‌రిశ్ర‌మ‌ను పాదుకొల్పేందుకు కూడా చిరంజీవి కృషి చేయాల్సి ఉంటుంది. మ‌రో మూడు నెల‌ల్లో ఏపీ - టాలీవుడ్ విష‌య‌మై మాట్లాడేందుకు సీఎన్‌బి- ప‌వ‌న్ క‌ల్యాణ్ స‌హా ఏపీఎఫ్‌డిసి కృషి చేయ‌నుంద‌ని ఇటీవ‌ల క‌థ‌నాలొచ్చాయి. ఈ చ‌ర్చా స‌మావేశాల‌కు చిరంజీవి విధిగా హాజ‌రై ప‌రిశ్ర‌మ త‌ర‌పున‌ త‌న బాణిని వినిపించాలి. ఇలాంటి క్లిష్ఠ సంద‌ర్భాల్లో ప‌రిశ్ర‌మ‌ను ఏక‌తాటిపైకి తేవ‌డం ఆయ‌న బాధ్య‌త‌. బీచ్ సొగ‌సుల విశాఖ న‌గ‌రంలో కొత్త టాలీవుడ్ నెల‌కొల్పే అవ‌కాశాల‌పై చిరంజీవి చాలా సార్లు బ‌హిరంగ ప్ర‌క‌ట‌న‌లు చేసారు. ఈసారి ప్ర‌భుత్వంతో చ‌ర్చ‌ల్లో దీనిపై ఒక క్లారిటీని ఇవ్వాల్సి ఉంటుంది.

డ‌బ్బు వ‌స్తేనే, లాభం ఉంటేనే ప‌రిశ్ర‌మ‌కు పెద్ద దిక్కు! అనుకునే స్థాయి చిరంజీవిది కాదు. ఆయ‌న అన్నిటికీ అతీతంగా ఉన్నారు. త‌న‌కు తానుగా `టాలీవుడ్ పెద్ద దిక్కు` అనే ట్యాగ్‌ని మోయ‌రు. సినీపెద్ద‌గా త‌న‌కు తానుగా మార‌రు. ప‌రిశ్ర‌మ‌కు ఫ‌లానా క‌ష్టం వ‌చ్చింది.. వ‌చ్చి ఆదుకోండి! అని అడిగితేనే వ‌స్తాను అని చెప్పారు. ఎందుకంటే ఇండ‌స్ట్రీలో దేనికీ స‌హ‌క‌రించ‌ని వారు.. మిడిమిడి జ్ఞానులు ఆయ‌న‌ను వ్య‌తిరేకించే ప్ర‌బుద్ధుల్లో ఉన్నారు! కార‌ణం ఏదైనా కానీ ఇప్పుడు దాస‌రి నారాయ‌ణ‌రావు లేని లోటును పూడ్చేందుకు ఎవ‌రో ఒక‌రు రావాలి. అది చిరంజీవి అయితే బావుంటుంద‌ని అంద‌రూ కోరుకుంటున్నారు. చిరు ఇక‌పై సాహసానికి సిద్ధంగా ఉండాలి. దాస‌రి లాగా గంభీర‌మైన‌, గ‌ద్గ‌ద స్వ‌రంతో ప్ర‌త్య‌ర్థుల‌ను సౌండ్ లేకుండా చేయ‌గ‌ల‌గ‌డం ఒక ప్ర‌త్యేక‌మైన క‌ళ‌. అలాంటి క‌ళ‌లో చిరు రాటు దేలాలి. సౌమ్యుడిగా, మంచి వాడిగానే ఉంటే స‌రిపోదు. సంద‌ర్భం వ‌స్తే రప్ఫాడించాలి...!

Tags:    

Similar News