'పెద్ది' కి అన్ని విధాలా లైన్ క్లియర్ చేసిన మెగాస్టార్?
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో గత కొన్ని రోజులుగా సింగిల్ స్క్రీన్ థియేటర్ల ఎగ్జిబిటర్లకు, నిర్మాతలకు మధ్య నడుస్తున్న తీవ్ర వివాదానికి ఎట్టకేలకు తెరపడింది.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో గత కొన్ని రోజులుగా సింగిల్ స్క్రీన్ థియేటర్ల ఎగ్జిబిటర్లకు, నిర్మాతలకు మధ్య నడుస్తున్న తీవ్ర వివాదానికి ఎట్టకేలకు తెరపడింది. గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం `పెద్ది` విడుదలకు థియేటర్ల యాజమాన్యాలు అడ్డుచెప్పడంతో పరిశ్రమ పెద్ద సంక్షోభం వైపు అడుగులు వేసింది. ఈ క్లిష్ట సమయంలో మెగాస్టార్ చిరంజీవి స్వయంగా రంగంలోకి దిగి రెండు రోజుల పాటు జరిపిన సుదీర్ఘ చర్చల అనంతరం ఈ వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించారని తెలిసింది. చిరంజీవి ఇచ్చిన హామీలు .. ఆయన తీసుకున్న చొరవతో తెలంగాణ సింగిల్ స్క్రీన్ ఎగ్జిబిటర్లు తమ పట్టును వీడటంతో `పెద్ది` చిత్రానికి ఎదురైన ప్రధాన అడ్డంకులు పూర్తిగా తొలగిపోయాయి.
అసలు వివాదానికి ప్రధాన కారణం థియేటర్ల రెవెన్యూ మోడల్. టాలీవుడ్‌లో దశాబ్దాలుగా కొనసాగుతున్న సాంప్రదాయ రెంట్ విధానానికి స్వస్తి పలికి, మల్టీప్లెక్స్‌ల తరహాలోనే సింగిల్ స్క్రీన్లలో కూడా `పర్సంటేజీ సిస్టమ్` (రెవెన్యూ షేరింగ్) అమలు చేయాలని తెలంగాణ ఎగ్జిబిటర్ల అసోసియేషన్ గట్టిగా డిమాండ్ చేసింది. దీనిపై తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (టిఎఫ్‌సిసి) దాదాపు ఏడాది కాలంగా ఎలాంటి స్పష్టమైన నిర్ణయం తీసుకోకపోవడంతో సింగిల్ స్క్రీన్ యాజమాన్యాలు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశాయి. అందువల్ల `పెద్ది` సినిమా నుంచే పర్సంటేజీ విధానాన్ని వర్తింపజేయాలని.. లేదంటే సినిమాను ప్రదర్శించబోమని ఎగ్జిబిటర్లు గట్టి పట్టుబట్టారు.
ఇదే సమయంలో అనూహ్యంగా తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ప్రతినిధులు మెగాస్టార్ చిరంజీవిని కలిసి తమ సమస్యలను, డిమాండ్లను సుదీర్ఘంగా వివరించారు. ఎగ్జిబిటర్లు తమ విధివిధానాలను స్పష్టం చేస్తూ.. ఒకవేళ భవిష్యత్తులో ప్రభుత్వాల అనుమతితో సినిమా టికెట్ ధరలను పెంచినట్లయితే.. ఆ అదనపు ధరతో పాటు థియేటర్ రెంట్‌కు అదనంగా మరో 7.5 శాతం మొత్తాన్ని ఎగ్జిబిటర్లకు చెల్లించాల్సి ఉంటుందని చిరంజీవి కి వివరించారు. అంతేకాకుండా జూన్ 30 తర్వాత విడుదలయ్యే అన్ని కొత్త చిత్రాలను కచ్చితంగా పర్సంటేజీ ప్రాతిపదికన మాత్రమే థియేటర్లలో ప్రదర్శిస్తామని తమ నిర్ణయాన్ని తెలియజేశారు.
ఎగ్జిబిటర్ల బాధలను, నిర్మాతల ఆర్థిక సమీకరణాలను ఓపికగా విన్న చిరంజీవి వారికి విలువైన సలహాలు, గ్యారెంటీలను ఇచ్చారు. ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఏర్పాటు చేసిన ప్రత్యేక సబ్ కమిటీ రిపోర్ట్.. మార్గదర్శకాలకు అనుగుణంగానే ముందుకు సాగాలని చిరు ఎగ్జిబిటర్లకు సూచించారు. ఈ సమస్యపై ఛాంబర్ కొత్త కమిటీ జూన్ 30 లోపు ఒక కచ్చితమైన.. పారదర్శకమైన ముగింపునకు వచ్చేలా తాను స్వయంగా పర్యవేక్షిస్తానని హామీ ఇచ్చారు. అలాగే జూలై 3 నుండి తెలంగాణవ్యాప్తంగా పాత రెంట్ విధానాన్ని పూర్తిగా రద్దు చేసి సరికొత్త పర్సంటేజీ షేరింగ్ మోడల్‌ను అమలు చేసేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.
మెగాస్టార్ చిరంజీవి ఇచ్చిన బలమైన నమ్మకంతో తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (టి.ఎస్.ఎఫ్.సి.సి) అధికారికంగా ఒక ప్రెస్ నోట్ విడుదల చేసింది. చిత్ర పరిశ్రమ సంక్షేమాన్ని మునుముందు రానున్న పెద్ద సినిమాల మనుగడను దృష్టిలో ఉంచుకుని తాము ప్రస్తుతానికి వెనక్కి తగ్గుతున్నట్లు ఎగ్జిబిటర్లు ప్రకటించారు. జూన్ 30 వరకు పాత సాంప్రదాయ రెంట్ పద్ధతిలోనే సినిమాలు ప్రదర్శించడానికి అంగీకరిస్తూ.. `పెద్ది` చిత్రం ఎటువంటి ఆటంకాలు లేకుండా థియేటర్లలో సజావుగా విడుదలయ్యేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మెగాస్టార్ సకాలంలో స్పందించి ఇరువర్గాలకు న్యాయం చేయడంతో టాలీవుడ్ పెద్ద గండం నుండి గట్టెక్కినట్లయింది. అయితే దీనికోసం మెగాస్టార్ ఒకటికి రెండుసార్లు తెలంగాణ ఎగ్జిబిటర్లతో సమావేశం అయినట్టు తెలుస్తోంది.