స్టాలోన్ 'ఫ‌స్ట్ బ్ల‌డ్' స్ఫూర్తితో చిరంజీవి మూవీ

చిరు కెరీర్ తొలినాళ్లలో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన చిత్రం ఖైదీ (1983) విడుదలై నేటికి 42 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మేకర్స్ ఓ స్పెషల్ వీడియోను రిలీజ్ చేశారు.;

Update: 2025-10-28 12:14 GMT

80ల‌లో మెగాస్టార్ చిరంజీవి కెరీర్ ని కీల‌క మ‌లుపు తిప్పిన సినిమా `ఖైదీ`. చిరుకు మాస్ యాక్ష‌న్ హీరోగా ఇమేజ్ ని అమాంతం పెంచింది. కోదండ‌రామిరెడ్డి ద‌ర్శ‌క‌త్వం.. ప‌రుచూరి సోద‌రుల డైలాగులు, చ‌క్ర‌వ‌ర్తి సంగీతం ఈ సినిమాకి ప్ర‌ధాన బ‌లం. 1983లో ఈ చిత్రం రిలీజ్ అయింది. ఇందులో యాక్ష‌న్ స‌న్నివేశాలు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌. 1982లో విడుద‌లైన సిల్వ‌స్ట‌ర్ స్టాలోన్ ఫస్ట్ బ్ల‌డ్ లోని యాక్ష‌న్ దృశ్యాల స్ఫూర్తితో ఇందులో పోరాటాల‌ను రూపొందించ‌గా, చిరు లుక్ డిజైన్ కూడా స్టాలోన్ జాన్ రాంబో పాత్ర స్ఫూర్తి. అలాగే ఖైదీకి చ‌క్ర‌వ‌ర్తి సంగీతం- పాట‌లు ..ప‌రుచూరి డైలాగులు అద‌న‌పు అస్సెట్ గా నిలిచాయి. ఇది మెగాస్టార్ కెరీర్ దిశ మార్చిన మాస్ యాక్ష‌న్ సినిమాగా పాపుల‌రైంది.

ఖైదీ సినిమా చూసిన కొంద‌రు బాలీవుడ్ ద‌ర్శ‌క‌నిర్మాత‌లు సైతం చిరంజీవితో సినిమాలు చేసేందుకు ఆస‌క్తిని క‌న‌బ‌రిచారు. భార‌త‌దేశంలో ఏ ఇత‌ర‌ హీరోకి లేనంత పెద్ద‌ బ‌డ్జెట్లు ఖ‌ర్చు చేసేందుకు కూడా ఆరోజుల్లో నిర్మాత‌లు ఆస‌క్తిని క‌న‌బ‌రిచార‌ని క‌థ‌నాలొచ్చాయి. అయితే చిరు పూర్తిగా తెలుగు ప‌రిశ్ర‌మ‌కే క‌ట్టుబడి సినిమాల‌లో న‌టించారు.

చిరు కెరీర్ తొలినాళ్లలో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన చిత్రం ఖైదీ (1983) విడుదలై నేటికి 42 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మేకర్స్ ఓ స్పెషల్ వీడియోను రిలీజ్ చేశారు. ప్ర‌స్తుతం ఈ వీడియో ఇంట‌ర్నెట్ లో వైర‌ల్ గా మారుతోంది. చిరుకు మాస్ యాక్ష‌న్ హీరోగా ఇమేజ్ తెచ్చిన ఖైదీని నాలుగు ద‌శాబ్ధాలుగా అభిమానులు సెల‌బ్రేట్ చేస్తూనే ఉన్నారు. ఈ చిత్రాన్ని మరోసారి థియేటర్లలో చూసేందుకు వేచిచూస్తున్నామని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఖైదీ చిత్రంలో రావు గోపాల్ రావు విల‌న్ గా న‌టించ‌గా సుమ‌ల‌త‌, మాధ‌వీల‌త క‌థానాయిక‌లుగా న‌టించారు. ఈ చిత్రానికి స్టోరి- స్క్రీన్ ప్లే ప‌రుచూరి సోద‌రులు అందించారు.

ఖైదీ చిత్రాన్ని హిందీలోను రీమేక్ చేయ‌గా అక్క‌డ జీతేంద్ర క‌థానాయ‌కుడిగా న‌టించారు. పద్మాలయా స్టూడియోస్ ప‌తాకంపై జి హనుమంత రావు నిర్మించారు. కృష్ణ సమర్పకుడు. ఎస్.ఎస్. రవిచంద్ర దర్శకత్వం వహించారు. ఇందులో జీతేంద్ర, శత్రుఘ్న సిన్హా, హేమ మాలిని, మాధవి నటించగా బప్పి లాహిరి సంగీతం అందించారు. క‌న్న‌డ‌లో విష్ణువ‌ర్ధ‌న్ క‌థానాయ‌కుడిగా ఖైది చిత్రాన్ని రీమేక్ చేసారు.


Tags:    

Similar News