నితీష్ రామాయ‌ణానికి 'ఏఐ - యానిమేష‌న్' సినిమాల‌తో పోలిక‌నా?

భారతీయ చిత్రసీమలో భక్తి, పురాణ నేపథ్యాలకు ఎల్లప్పుడూ అపారమైన ఆదరణ ఉంటుంది.

Update: 2026-09-02 23:30 GMT

భారతీయ చిత్రసీమలో భక్తి, పురాణ నేపథ్యాలకు ఎల్లప్పుడూ అపారమైన ఆదరణ ఉంటుంది. `మహావతార్ నరసింహ` చిత్రం కేవలం యానిమేషన్ మాధ్యమాన్ని నమ్ముకుని తన కథలోని ప్రత్యేకతతో బాక్సాఫీస్ వద్ద అద్భుత విజయాన్ని అందుకుంది. ఈ విజయం తర్వాత ఇప్పుడు అంతర్జాతీయ ప్రమాణాలతో రూపుదిద్దుకుంటున్న `చిరంజీవి హనుమాన్ - ది ఎటర్నల్` చిత్రంపై అందరి దృష్టి పడింది. రాజేష్ మాపుస్కర్ దర్శకత్వంలో అబండంటియా ఎంటర్‌టైన్‌మెంట్, కలెక్టివ్ మీడియా నెట్‌వర్క్ నిర్మిస్తున్న ఈ చిత్రం.. దేశంలోనే తొలి పూర్తిస్థాయి ఏఐ (AI) ఆధారిత చిత్రంగా రాబోతోంది. అయితే నరసింహుడి యానిమేషన్ రికార్డులను ఈ ఏఐ హనుమంతుడు తిరగరాయడం అంత సులువేనా అనే అంశంపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

సాంకేతిక కోణంలో చూస్తే యానిమేషన్, ఏఐ చిత్రాల మధ్య స్పష్టమైన వ్యత్యాసం ఉంది. సాంప్రదాయ యానిమేషన్‌లో డిజైనర్లు, ఆర్టిస్టుల శ్రమతో ప్రతీ పాత్రకు జీవం వస్తుంది. వారి హావభావాలు, నడక శైలి సహజంగా ఉండి ప్రేక్షకులను భావోద్వేగంగా కట్టిపడేస్తాయి. కానీ ప్రస్తుతం ఉన్న కృత్రిమ మేధ సాంకేతికత ఇంకా ఆరంభ దశలోనే ఉందనేది వాస్తవం. ఏఐ విజువల్స్‌లో పాత్రల కదలికలు, ముఖ కవళికలు తరచుగా కృత్రిమంగా.. జీవం లేనట్లుగా కనిపిస్తాయి. ఈ లోపాలను అధిగమించకుండా ఏఐ చిత్రం యానిమేటెడ్ `మహావతార్ నరసింహ`ను మించిపోతుందని ఆశించడం తొందరపాటే అవుతుందని విశ్లేషిస్తున్నారు.

అయితే `చిరంజీవి హనుమాన్` బృందం ఈ సాంకేతిక పరిమితులను అధిగమించేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది. నితేష్ తివారీ `రామాయణం` మొదటి భాగంలో సన్నీ డియోల్ హనుమంతుడి పాత్రలో చివరిలో మాత్రమే కనిపిస్తారని ప్రచారం జరుగుతున్నందున, హనుమంతుని సంపూర్ణ మహత్యాన్ని వెండితెరపై చూడాలనుకునే భక్తులకు, సినీ ప్రియులకు ఈ ఏఐ చిత్రం ఒక గొప్ప అనుభూతిని ఇస్తుందని భావిస్తున్నారు.

ట్రేడ్ విశ్లేషకులు మాత్రం.. ఈ చిత్రం బాక్సాఫీస్ స‌క్సెస్ సాధ్యాసాధ్యాలపై కాస్త సందిగ్ధంలోనే ఉన్నారు. పూర్తిస్థాయి ఏఐ దృశ్యాలను సాధారణ ప్రేక్షకులు పెద్ద తెరపై ఎలా స్వీకరిస్తారో అనే అంశంపై స్పష్టత లేదు. విజువల్స్ గనుక ఏమాత్రం అసహజంగా అనిపించినా ఆ ప్రభావం థియేటర్ కలెక్షన్లపై పడుతుంది. దీనికితోడు `రామాయణం` వంటి భారీ చిత్రం వచ్చిన వెంటనే `చిరంజీవి హనుమాన్` కూడా రావడం వల్ల రెండిటినీ పోల్చి చూస్తారు. నాశిర‌కం విజువ‌ల్స్ ఉంటే గునుక నిర్ధ‌య‌గా తిర‌స్క‌రిస్తారనే భయాలున్నాయి. పౌరాణిక, చారిత్ర‌క క‌థ‌ల‌తో సినిమాలు ఎన్ని వ‌చ్చినా ప్ర‌జ‌లు చూస్తారు. అయితే భావోద్వేగాలను మేక‌ర్స్ ఎంత అద్భుతంగా పండిస్తే, దానికి అంతటి ఆద‌ర‌ణ ద‌క్కుతుంది.

సాంకేతికత ఎంత వేగంగా విస్తరిస్తున్నా వెండితెరపై మానవీయమైన కోణం- ఆర్టిస్టుల శ్రమతో కూడిన యానిమేషనే ఏఐ కంటే ఎక్కువ‌గా ప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకునే ఛాన్సుంది. ``చిరంజీవి హనుమాన్ - ది ఎటర్నల్` చిత్రం తన ఏఐ విజువల్స్‌తో ఈ అంచనాలను తలకిందులు చేస్తుందా లేదా అనేది టీజర్, ట్రైలర్లు వచ్చాకే నిర్ణయించవచ్చని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. భక్తి భావానికి సరికొత్త సాంకేతికత తోడవుతున్న ఈ ప్రయోగం రానున్న రోజుల్లో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో వేచి చూడాలి. నితీష్ తివారీ రామాయ‌ణం విజువ‌ల్ గ్రాండియారిటీ- జ‌వ‌జీవాల‌తో రూపొందుతున్న‌ది. దానిని ఎప్ప‌టికీ ఏఐ సినిమాలు, యానిమేష‌న్స్ తో పోల్చ‌డం స‌రికాద‌నేది కూడా ప్ర‌జ‌లు గ్ర‌హించాలి.

Tags:    

Similar News