టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్ - డివైన్ ఫార్ములా!
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కథల ఎంపిక -ట్రెండ్స్ కాలానికి అనుగుణంగా మారుతూ ఉంటాయి.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కథల ఎంపిక -ట్రెండ్స్ కాలానికి అనుగుణంగా మారుతూ ఉంటాయి. ఒకప్పుడు కమర్షియల్ మాస్, లవ్ స్టోరీలు బాక్సాఫీస్‌ను ఏలితే ఇప్పుడు టాలీవుడ్‌లో డివైన్ ఫార్ములా సరికొత్త సంచలనాలు సృష్టిస్తోంది. ప్రత్యేకించి మైథలాజికల్ , భక్తిరస అంశాలకు గ్రామ దేవతలు, శక్తి పీఠాలు, దైవిక శక్తుల నేపధ్యాలను జోడించి తెరకెక్కిస్తున్న చిత్రాలకు ప్రేక్షకుల నుంచి గొప్ప ఆదరణ లభిస్తోంది. సాంకేతికత పెరిగిన నేటి డిజిటల్ యుగంలో కూడా దైవిక అంశాలతో కూడిన కథాంశాల పట్ల ఆడియన్స్ చూపిస్తున్న ఆసక్తి ఇండస్ట్రీ వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తోంది.
ఇటీవల రవితేజ కథానాయకుడిగా రిలీజ్ అయిన `ఇరుముడి` బాక్సాఫీస్ వద్ద సాధించిన అపూర్వ విజయం నయా ట్రెండ్‌కు బలమైన పునాది వేసింది. భక్తి నేపథ్యంతో పాటు గ్రామ దేవతల శక్తులు, ఆచార వ్యవహారాల చుట్టూ తిరిగే కథాంశంతో తెరకెక్కిన సినిమా 100 కోట్లకు పైగా షేర్ వసూలు చేసి రికార్డులు తిరగరాసింది. ఈ చిత్రం ఇచ్చిన ధైర్యంతో టాలీవుడ్ మేకర్స్ , నిర్మాతలు దైవిక నేపథ్యం ఉన్న కథల వైపు మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా గ్రామ దేవతల కథలకు, అమ్మవారి మహిమల చుట్టూ తిరిగే స్క్రిప్ట్‌లకు ట్రేడ్ వర్గాల్లో డిమాండ్ పెరుగుతోంది.
ఈ క్రమంలోనే సెప్టెంబర్ నెలలో అమ్మవారి శక్తుల నేపథ్యంలో రెండు ప్రతిష్టాత్మక చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. సెప్టెంబర్ 10న `మారెమ్మ` చిత్రం విడుదల కానుండగా, ఆ మరుసటి రోజే సెప్టెంబర్ 11న `మహేంద్రగిరి వారాహి` థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. గ్రామ దేవత `మారెమ్మ` శక్తియుక్తులు -గ్రామీణ ఆచారాల నేపథ్యంతో తెరకెక్కిన మారెమ్మ చిత్రంపై ఇప్పటికే మంచి అంచనాలు ఉండగా వారాహి అమ్మవారి నేపథ్యంతో వస్తోన్న మహేంద్రగిరి వారాహి చిత్రం కూడా విజువల్ ఎఫెక్ట్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో ప్రేక్షకులను అలరించేందుకు సన్నాహాలు చేసుకుంటోంది.
ఈ చిత్రాలే కాదు. రాబోయే రోజుల్లో కూడా ఇదే తరహా కథాంశాలతో పలు భారీ ప్రాజెక్టులు సెట్స్‌పై రూపుది ద్దుకుంటున్నాయి. అందులో అత్యంత ఆసక్తికరమైన ప్రాజెక్ట్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ కథానాయకుడిగా నటిస్తున్న `ఎల్లమ్మ` చిత్రం. తెలంగాణ జానపదంలో ఎంతో విశిష్టత కలిగిన ఎల్లమ్మ తల్లి నేపథ్యాన్ని -శక్తి అంశాలను ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. డిఎస్పి నటనతో పాటు దైవిక కథాంశం ఎలా ఉండబోతోందనేది సినీ ప్రియుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
గతంలో కూడా `అమ్మోరు`, `దేవి`, `అరుంధతి` వంటి చిత్రాలు తెలుగు వెండితెరపై ప్రభంజనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుత తరం దర్శకులు పాత కాలపు భక్తి సినిమాలాగే కాకుండా ఆధునిక విజువల్ ఎఫెక్ట్స్ , గూస్‌బంప్స్ ఇచ్చే నేపథ్య సంగీతం ,థ్రిల్లర్ ఎలిమెంట్స్‌ను జోడించి డివైన్ ఫార్ములాను నయా ప్యాకేజీగా ప్రేక్షకులకు అందిస్తున్నారు. రూట్ లెవెల్ కల్చర్, స్థానిక నమ్మకాలు అంతర్జాతీయ స్థాయి సాంకేతికతతో తోడవ్వడం ఈ చిత్రాల విజయానికి ప్రధాన కారణమవుతోంది.