MSGకు రెండు సర్కార్ల జీవోలు.. ఓపెనింగ్స్ గట్టిగానే?
ఫెస్టివల్ సీజన్ లో చిరంజీవి మూవీ విడుదల కావడంతో అభిమానుల్లో జోష్ డబుల్ అయింది.;
మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ మన శంకర వరప్రసాద్ గారు థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమైంది. ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 12న విడుదల కానుంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఆ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి.
ఫెస్టివల్ సీజన్ లో చిరంజీవి మూవీ విడుదల కావడంతో అభిమానుల్లో జోష్ డబుల్ అయింది. ఈ నేపథ్యంలో సినిమాకు సంబంధించిన టికెట్ ధరలు, స్పెషల్ షోలపై ప్రభుత్వ అనుమతులు లభించాయి. తెలంగాణ ప్రభుత్వం తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జనవరి 11న ప్రీమియర్ షో వేసుకునేందుకు అనుమతి మంజూరు చేసింది. టికెట్ ధరను రూ.600గా (జీఎస్టీతో కలిపి) నిర్ణయించింది.
రాత్రి 8 గంటల నుంచి 10 గంటల మధ్య ప్రీమియర్ షోను వేయాల్సి ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. అదే విధంగా జనవరి 12వ తేదీ నుంచి ఏడు రోజుల పాటు టికెట్ ధరలను పెంచుకునే అవకాశాన్ని తెలంగాణ ప్రభుత్వం కల్పించింది. ఈ మేరకు సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.50 వరకు (జీఎస్టీతో కలిపి), మల్టీప్లెక్స్ లలో రూ.100 వరకు (జీఎస్టీతో కలిపి) అదనంగా వసూలు చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది.
అందుకు సంబంధించిన అధికారిక జీవోను తాజాగా ప్రభుత్వం జారీ చేసింది. దీంతో తెలంగాణలో సినిమా ఓపెనింగ్స్ పై మంచి ప్రభావం పడుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్ లో కూడా చిరంజీవి చిత్రానికి టికెట్ ధరల పెంపుపై ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ లభించింది. ఏపీ ప్రభుత్వం కూడా స్పెషల్ ప్రీమియర్ షోకు అనుమతి ఇచ్చింది.
అక్కడ ప్రీమియర్ షో టికెట్ ధరను రూ.500గా (జీఎస్టీతో కలిపి) నిర్ణయించారు. దాంతోపాటు సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.100 వరకు (జీఎస్టీతో కలిపి), మల్టీప్లెక్స్ లలో రూ.125 వరకు (జీఎస్టీతో కలిపి) టికెట్ ధరలు పెంచుకునే అవకాశాన్ని కల్పించారు. ఇరు తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రభుత్వాల నుంచి అనుమతులు రావడంతో మన శంకర వరప్రసాద్ గారు మూవీ నిర్మాతలు ఊపిరి పీల్చుకున్నారు.
పండుగ సీజన్ లో విడుదలయ్యే భారీ చిత్రాలకు టికెట్ ధరల పెంపు కీలకమని చెప్పాలి. ముఖ్యంగా చిరంజీవి వంటి స్టార్ హీరో సినిమా కావడంతో తొలి రోజుల వసూళ్లు కూడా కీలకమే. దీంతో ఇప్పుడు రెండు రాష్ట్రాల సర్కార్ల నుంచి అనుమతులు రావడంతో ఓపెనింగ్స్ భారీగా ఉండే అవకాశం ఉంది. మరి ఇప్పటికే సూపర్ హైప్ క్రియేట్ చేసుకున్న మన శంకర వరప్రసాద్ గారు మూవీ ఎంతటి ఓపెనింగ్స్ సాధిస్తుందో వేచి చూడాలి.