మెగాస్టార్‌కు మళ్లీ ఎమోషన్ టైమొచ్చిందా?
అయితే క్రమంగా కాలం మారింది. కాలంతో పాటూ ప్రేక్షకుల అభిరుచి కూడా మారింది. ఇప్పుడు కేవలం హీరో ఎంట్రీకి క్లాప్స్ పడటం మాత్రమే సరిపోవడం లేదు
టాలీవుడ్‌లో మాస్ హీరోలు చాలామంది ఉన్నారు. స్టార్‌డమ్‌తో థియేటర్లను ఊపేసే హీరోలు కూడా ఉన్నారు. కానీ మాస్ ఇమేజ్, కామెడీ టైమింగ్, డ్యాన్స్, యాక్షన్‌తో పాటు ఆడియన్స్ ను కంటతడి పెట్టించే నటనా సామర్థ్యం ఉన్న హీరోలు మాత్రం చాలా అరుదు. ఆ అరుదైన జాబితాలో మెగాస్టార్ చిరంజీవి పేరు ఎప్పుడూ ముందుంటుంది. అందుకే ఇప్పుడు ఆయన కెరీర్‌లో మరోసారి ఎమోషనల్ కమర్షియల్ సినిమాకి సరైన టైమొచ్చిందా అనే డిస్కషన్ ఆసక్తికరంగా మారుతోంది.
చిరంజీవి కెరీర్‌ను వెనక్కి తిరిగి చూస్తే, ఆయన సక్సెస్‌ల వెనుక కేవలం ఫైట్లు, సాంగ్స్, మాస్ ఎలివేషన్స్ మాత్రమే కనిపించవు. స్వయంకృషి సినిమాలో సాధారణ వ్యక్తి జీవిత పోరాటాన్ని తన యాక్టింగ్ తో ఆడియన్స్‌కు దగ్గర చేశారు. ఆపద్బాంధవుడులో ఎమోషన్స్ కు పెద్ద పీట వేశారు. రుద్రవీణలో స్టార్ ఇమేజ్‌ను పక్కనపెట్టి నటుడిగా తనలోని మరో కోణాన్ని చూపించారు. తర్వాత వచ్చిన స్నేహం కోసం, అన్నయ్య, డాడీ వంటి సినిమాల్లో కూడా ఫ్యామిలీ, ఎమోషన్స్ వంటి అంశాలు చిరంజీవి పాత్రలకు బలంగా నిలిచాయి. ఆయన ఫిల్మోగ్రఫీలో యాక్షన్, ఫ్యామిలీ డ్రామా, ఎమోషనల్ క్యారెక్టర్లు కలిసి సాగిన తీరు స్పష్టంగా కనిపిస్తుంది.
అయితే క్రమంగా కాలం మారింది. కాలంతో పాటూ ప్రేక్షకుల అభిరుచి కూడా మారింది. ఇప్పుడు కేవలం హీరో ఎంట్రీకి క్లాప్స్ పడటం మాత్రమే సరిపోవడం లేదు, ఆ హీరో క్యారెక్టర్ తో ఆడియన్స్ కనెక్ట్ అవుతున్నారా లేదా అన్నదే సినిమా లాంగ్ రన్ కు బలంగా మారుతుంది. ముఖ్యంగా పెద్ద స్టార్ సినిమాల్లో యాక్షన్‌కు ఎంత ప్రాధాన్యం ఉంటుందో, ఎమోషన్‌కు కూడా అంతే బలం అవసరమని ఇటీవల ఆడియన్స్ రెస్పాన్స్ చెబుతోంది.
ఇక్కడే చిరంజీవి వంటి నటుడికి ఒక ప్రత్యేకమైన అవకాశం కనిపిస్తోంది. ఆయన వయసు, ఎక్స్‌పీరియెన్స్, స్క్రీన్ ప్రెజెన్స్‌కు సరిపోయే కథలో ఫ్యామిలీ బాండింగ్, ఫాదర్ సెంటిమెంట్, ఫ్రెండ్‌షిప్ లేదా జీవిత పోరాటం వంటి అంశాలు బలంగా ఉంటే అది పూర్తిగా కొత్త అనుభూతిని ఇవ్వగలదు. మధ్యలో చిరంజీవి మార్క్ కామెడీ, అవసరమైన మాస్ ఎలివేషన్స్, కొన్ని స్టైలిష్ యాక్షన్ ఘట్టాలు జోడిస్తే అదే అసలైన ఎమోషనల్ కమర్షియల్ ప్యాకేజ్‌గా మారే అవకాశం ఉంది.
అంటే మెగాస్టార్‌ను మాస్ నుంచి పూర్తిగా దూరం చేయాల్సిన అవసరం లేకుండానే, మాస్ ఎలిమెంట్స్‌కు ఎమోషన్ జోడించడం లాంటివి చేస్తే అలాంటి ప్రాజెక్టులు బాగా వర్కవుటయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకప్పుడు చిరంజీవి సినిమాల్లో ఆడియన్స్ విజిల్స్ వేయడంతో పాటు కన్నీళ్లు కూడా పెట్టుకునేవాళ్లు. ఇప్పుడు మరోసారి అలాంటి పాత్ర ఆయన చేతికి వస్తే, మెగాస్టార్‌లోని స్టార్‌ను మాత్రమే కాదు... ఎన్నో సంవత్సరాలుగా ఫ్యాన్స్ ప్రేమిస్తున్న నటుడిని కూడా స్క్రీన్‌పై కొత్తగా చూసే అవకాశం ఉంటుంది.