డీప్ ఫేక్ చేస్తే శిక్ష త‌ప్పదు.. చిరంజీవికి కోర్టు ర‌క్ష‌ణ‌

ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి కూడా హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేయ‌గా అనుకూల తీర్పు వెలువ‌డింద‌ని స‌మాచారం.;

Update: 2025-10-23 10:09 GMT

డీప్ ఫేక్- మార్ఫింగ్ ఫోటోలు, వీడియోల‌తో త‌మ‌కు తీవ్ర‌మైన ఆర్థిక న‌ష్టంతో పాటు ప‌రువు న‌ష్టం కూడా క‌లుగుతోంద‌ని సెల‌బ్రిటీలు ఆందోళ‌న చెందుతున్నారు. డిజిట‌ల్ విప్ల‌వ ప‌ర్య‌వ‌సానంలో ఎప్పుడు ఏం జ‌రుగుతోందో ఊహించ‌లేని ప‌రిస్థితి ఉంది. ఇటీవ‌లి కాలంలో ఏఐలో సృష్టించిన ఫేక్ ఫోటోలు, వీడియోల‌లోని ఒరిజిన‌ల్ వ్య‌క్తిత్వాన్ని సాధార‌ణ ప్ర‌జ‌లు గుర్తించ‌డం అంత సులువు కాదు. చాలా అస‌భ్య‌క‌ర‌మైన వెబ్ సైట్లు, వాణిజ్య కంటెంట్ ఉన్న వెబ్ సైట్లు సెల‌బ్రిటీల ఫోటోలు, వాయిస్ లు, ఏఐ వీడియోల‌ను విచ్ఛ‌ల‌విడిగా దుర్వినియోగం చేయ‌డం ప్ర‌మాద‌క‌ర స్థాయికి చేరుకుంది. త‌మ స్వార్థ‌పూరిత వ్యాపార‌ ప్ర‌యోజ‌నాల కోసం సెల‌బ్రిటీల‌కు చెడ్డ పేరు తేవ‌డానికి కూడా కొన్ని వెబ్ సైట్లు వెన‌కాడ‌టం లేదు.

అయితే మారిన ఈ ప‌రిస్థితుల నేప‌థ్యంలో బాలీవుడ్ స్టార్లు అభిషేక్ బ‌చ్చ‌న్, ఐశ్వ‌ర్యారాయ్ ఇప్ప‌టికే దిల్లీ కోర్టును ఆశ్ర‌యించ‌గా, వారికి అన్ని కోణాల్లోను ఉప‌శ‌మ‌నం క‌లిగిస్తూ న్యాయ‌మూర్తులు తీర్పును వెలువ‌రించారు. దాదాపు 30-40 వెబ్ సైట్ల నుంచి వారి డీప్ ఫేక్ ఫోటోలు, వీడియోలు, వాయిస్ లు వ‌గైరా తొల‌గించ‌డానికి అనుమ‌తులు ల‌భించాయి. ఆ త‌ర్వాత త‌న హ‌క్కులను కూడా ప‌రిగ‌ణించి ఇలాంటి ఫేక్ వ్య‌వ‌హారాల నుంచి ర‌క్ష‌ణ క‌ల్పించాల‌ని టాలీవుడ్ కింగ్ నాగార్జున కోర్టును ఆశ్ర‌యించ‌గా, అక్క‌డ అనుకూల తీర్పు వెలువడింది. నాగార్జున‌కు ఉప‌శ‌మ‌నం ల‌భించింది.

ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి కూడా హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేయ‌గా అనుకూల తీర్పు వెలువ‌డింద‌ని స‌మాచారం. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి పేరు, ఇమేజ్, వాయిస్ లేదా పోలికను డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో, AI-జనరేటెడ్, మెటావర్స్ ఫార్మాట్ లు స‌హా ఎక్క‌డైనా అనధికారికంగా ఉపయోగిస్తే దానికి శిక్ష త‌ప్ప‌దు. అలాంటి చ‌ర్య‌ల‌పై కోర్టు తాత్కాలిక నిషేధం విధించింది. సెప్టెంబ‌ర్ లోనే అందుకు సంబంధించిన ఉత్త‌ర్వు వెలువ‌డింది.

ఇ-కామర్స్ దుకాణాలు, యూట్యూబ్ ఛానెల్‌లు, డిజిటల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లతో సహా 30 కి పైగా ఆన్‌లైన్ సంస్థలపై చిరంజీవి దాఖలు చేసిన పిటిషన్ ని కోర్టు విచారించింది. ఆయా సంస్థలు చిరంజీవి అనుమతి లేకుండా వాణిజ్య, వ్యక్తిగత లాభం కోసం ఆయ‌న‌ వ్యక్తిత్వాన్ని ఉపయోగించుకుంటున్నాయని ఆరోపించారు. కొన్ని ఉత్ప‌త్తుల‌కు చిరంజీవి స్వ‌యంగా ప్రచారం చేస్తున్నారు అని న‌మ్మించేంత‌గా ప్ర‌క‌ట‌న‌లు రూపొందించార‌ని ఇలాంటివి వ్య‌క్తిగ‌తంగా ఆయ‌న‌కు, ఆయ‌న కుటుంబానికి డ్యామేజ్ చేస్తాయ‌ని కూడా న్యాయ‌విచార‌ణ‌లో పేర్కొన్నారు. చిరు లేదా మెగాస్టార్ చిరంజీవి, బాస్, అన్న‌య్య లేదా ఇంకేవైనా బిరుదుల పేర్ల‌ను ఉపయోగించి కొన్ని ఉత్ప‌త్తుల‌ను సేల్ చేస్తున్నార‌ని, అది ఆయ‌న‌కు న‌ష్టం క‌లిగిస్తుంద‌ని కూడా అభియోగాలు న‌మోద‌య్యాయి.

చిరంజీవి అసాధార‌ణ ఛ‌రిష్మాను అనుమ‌తి లేకుండా ఉప‌యోగించుకోవాల‌నుకుంటే శిక్ష త‌ప్ప‌ద‌ని కోర్టు వ్యాఖ్యానించింది. వాణిజ్య ప్రయోజనాల కోసం.. రాజకీయ, దేశ వ్యతిరేక లేదా అసభ్యకరమైన కంటెంట్‌ను ప్రచారం చేయడానికి చిరంజీవి ఫోటోలు లేదా ఏఐ కంటెంట్‌ను ఉప‌యోగిస్తే అది నేర‌పూరిత‌మైన చ‌ర్య‌గా ప‌రిగ‌ణించ‌బడుతుంది. ఈ నష్టం పూడ్చలేనిది అని కూడా కోర్టు ఆర్డర్ పేర్కొంది. భౌతిక, ఎలక్ట్రానిక్ మాధ్య‌మాలు, ఏఐ-ఆధారిత మీడియాలు .. డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో ఏదైనా మాధ్యమంలో చిరంజీవి గుర్తింపును ఉపయోగించకుండా కోర్టు నిషేధం విధించింది. ఈ కేసు తదుపరి విచారణ అక్టోబర్ 27న జరగనుంది. చిరంజీవి న్యాయ బృందం అన్ని డిజిటల్ మాధ్య‌మాల నుంచి వ్యక్తిత్వ హక్కులకు శాశ్వత రక్షణ కోరుతుందని భావిస్తున్నారు.

Tags:    

Similar News