అప్పుడు చిరు.. ఇప్పుడు బాలయ్య.. అక్కడ క్లిక్ అయ్యేదెప్పుడు?
టాలీవుడ్ సీనియర్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి, నటసింహం బాలకృష్ణలకు తెలుగులో ఎంతటి స్టార్ డమ్ ఉందో అందరికీ తెలిసిందే.;
టాలీవుడ్ సీనియర్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి, నటసింహం బాలకృష్ణలకు తెలుగులో ఎంతటి స్టార్ డమ్ ఉందో అందరికీ తెలిసిందే. అశేష అభిమానులు వారిద్దరి సొంతం. ఆరు పదుల వయసులో కూడా తమదైన శైలిలో మెప్పిస్తూ.. యంగ్ హీరోలకు పోటీనిస్తూ. వరుస సినిమాలతో దూసుకుపోతున్న దిగ్గజాలకు తెలుగులో భారీ మార్కెట్ ఉంది.
అయితే చిరు, బాలయ్య నార్త్ మార్కెట్ విషయానికి వస్తే ఇద్దరికీ ఆశించిన స్థాయిలో ఫలితాలు దక్కడం లేదనే చెప్పాలి. మెగాస్టార్ సైరా నరసింహ రెడ్డి సినిమాతో నార్త్ ఆడియన్స్ ను టార్గెట్ చేశారు. స్వాతంత్ర్య పోరాట యోధుడి కథ, భారీ బడ్జెట్, అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటించడం వంటి అంశాలు సినిమాపై భారీ అంచనాలు పెంచాయి.
హిందీలో పెద్ద ఎత్తున రిలీజ్ చేసినప్పటికీ, సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. వసూళ్లు పరిమితంగానే నమోదయ్యాయి. ఆ తర్వాత మలయాళ సూపర్ హిట్ లూసిఫర్ రీమేక్ గా తెరకెక్కిన గాడ్ ఫాదర్ తో మరోసారి నార్త్ మార్కెట్ లో చిరంజీవి లక్ ను పరీక్షించారు. రాజకీయ నేపథ్యం, పవర్ ఫుల్ క్యారెక్టర్ ఉన్నప్పటికీ ఆ సినిమా కూడా హిందీలో పెద్దగా ప్రభావం చూపలేకపోయింది.
అదే సమయంలో రీసెంట్ గా బాలకృష్ణ.. అఖండ 2 తాండవం మూవీతో బీ టౌన్ లో సందడి చేశారు. నిజానికి అఖండ సినిమా బాలయ్యకు కెరీర్ లోనే పెద్ద హిట్ గా నిలిచింది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఆ చిత్రం తెలుగులోనే కాదు, హిందీ డబ్బింగ్ వెర్షన్ కు కూడా ఓ స్థాయిలో ఆదరణ లభించింది. యూట్యూబ్, టీవీ ప్రసారాల ద్వారా నార్త్ ఆడియన్స్ కు బాగా నచ్చింది.
దీంతో సీక్వెల్ ను హిందీలో కూడా రూపొందించారు మేకర్స్. అయితే బాలీవుడ్ లో అఖండ 2: తాండవంపై హిందీలో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అఖండ సీక్వెల్ నార్త్ మార్కెట్ లో క్లిక్ అవుతుందని ట్రేడ్ వర్గాలు కూడా భావించాయి. కానీ రిలీజ్ తర్వాత పరిస్థితి భిన్నంగా మారింది. అఖండ 2 హిందీ వెర్షన్ అక్కడ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయినట్లు తెలుస్తోంది.
థియేటర్లలో స్పందన నెమ్మదిగా ఉండటంతో వసూళ్లు నిరాశపరిచాయి. ఇప్పటివరకు కలెక్షన్లు కోటి రూపాయల మార్క్ ను కూడా దాటలేదని సమాచారం. దీంతో చిరంజీవి సినిమాల కంటే బాలకృష్ణ సినిమా హిందీలో మరింత తక్కువ వసూళ్లు సాధించిందనే చర్చ మొదలైంది. బాలీవుడ్ లో అఖండ 2 విషయంలో ఏదో అందుకుంటే ఇంకేదో అయిందని చెప్పాలి.
దీంతో ఇద్దరు స్టార్ హీరోలు నార్త్ మార్కెట్ లో ఆశించిన ఫలితాలు సాధించలేకపోయారని స్పష్టమవుతోంది. ఇప్పుడు చిరంజీవి, బాలయ్య అప్ కమింగ్ చిత్రాలపై అందరి ఫోకస్ పడింది. వారిద్దరూ విశ్వంభర, NBK 111తో మరోసారి పాన్ ఇండియా రేంజ్ లో సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు.
దీంతో ఆ ప్రాజెక్టులతో అయినా ఇద్దరూ నార్త్ ప్రేక్షకులను అలరిస్తారా? అక్కడ నిజమైన బ్రేక్ అందుకుంటారా? అన్నది చూడాల్సి ఉంది.