కాస్టింగ్ కౌచ్ లేదన్న చిరంజీవి.. విభేదించిన సింగర్ చిన్మయి..మళ్లీ సంచలన వ్యాఖ్యలు
క్యాస్టింగ్ కౌచ్.. సినీ వర్గాల్లో ఎప్పటికప్పుడు వినిపించే మాట! రీసెంట్ గా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తొలిసారి బహిరంగంగా స్పందించారు.;
క్యాస్టింగ్ కౌచ్.. సినీ వర్గాల్లో ఎప్పటికప్పుడు వినిపించే మాట! రీసెంట్ గా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తొలిసారి బహిరంగంగా స్పందించారు. తన లేటెస్ట్ మూవీ మన శంకర వరప్రసాద్ గారు సక్సెస్ మీట్ లో ఆ విషయాన్ని ప్రస్తావించారు. సినీ ఇండస్ట్రీ మిర్రర్ లాంటిదని, మనం ఏది ఇస్తే అదే తిరిగి వస్తుందని వ్యాఖ్యానించారు.
పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ లేదని, ఒక వేళ ఇలాంటి చేదు అనుభవాలు ఎదురైనా అది మీ తప్పు అన్నట్లు అన్నారు. దీంతో ఆయన వ్యాఖ్యలు ఫుల్ వైరల్ గా మారగా.. నెటిజన్లు ఒక్కొక్కరు ఒక్కోలా రెస్పాండ్ అయ్యారు. ఇప్పుడు ఎప్పుడూ మొహమాటం లేకుండా కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడే సింగర్ చిన్మయి శ్రీపాద క్యాస్టింగ్ కౌచ్ పై సోషల్ మీడియాలో లాంగ్ పోస్ట్ పెట్టి సంచలన వ్యాఖ్యలు చేశారు.
క్యాస్టింగ్ కౌచ్ ఇప్పటికీ కొనసాగుతోందని, ఫుల్ కమిట్‌మెంట్ అనే పదం పేరుతో మహిళలపై అనుచిత ఒత్తిళ్లు తెస్తున్నారని ఆమె ఆరోపించారు. సాధారణంగా కమిట్మెంట్ అంటే ప్రొఫెషనలిజం, పనిపై నిబద్ధత అని భావించే వారికి సినిమా ఇండస్ట్రీలో ఆ పదానికి పూర్తిగా భిన్నమైన అర్థం ఉంటుందని పేర్కొన్నారు. పెద్ద హోదాల్లో ఉన్న కొంతమంది పురుషులు మహిళల నుంచి శారీరక అనుకూలతలు ఆశిస్తారని ఆరోపించారు.
తనకు తెలిసిన ఓ ఘటనను ఉదాహరణ చెబుతూ, ఓ మ్యూజిక్ డైరెక్టర్ స్టూడియోలో ఓ యువ సింగర్ పై లైంగిక దాడికి ప్రయత్నించగా, ఆమె భయంతో సౌండ్ బూత్ లోకి వెళ్లి తలుపు వేసుకొని కూర్చొందని తెలిపారు. ఇండస్ట్రీలోని ఓ సీనియర్ వచ్చి కాపాడే వరకు ఆమె అక్కడే ఉండాల్సి వచ్చిందని, ఆ ఘటన తర్వాత ఆ యువతి ఆ రంగాన్నే వదిలేసిందని చెప్పారు.
లైంగిక వేధింపులు, దాడులు ఇండస్ట్రీలో పెద్ద సమస్యగా మారాయని చిన్మయి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా లెజెండరీ నటుడు చిరంజీవి గురించి మాట్లాడుతూ, ఆయన పనిచేసిన తరం మహిళా సహనటులతో పరస్పర గౌరవంతో వ్యవహరించిందని, అదే సంస్కృతి వాళ్లను లెజెండ్స్ గా మార్చిందని అన్నారు. మీటూ ఉద్యమం సమయంలో కొంతమంది పెద్ద వాళ్ళు బాధితుల కన్నా మహిళలను తప్పుపట్టారని చిన్మయి విమర్శించారు.
షావుకారు జానకి, వైజీ మహేంద్ర ఇంటర్వ్యూలో లైంగిక వేధింపులపై మాట్లాడిన మహిళలను అవమానించేలా వ్యాఖ్యలు చేశారని ఆమె గుర్తు చేశారు. విదేశాల నుంచి వస్తున్న యువతులు చదువులో ముందుండి, ఇండస్ట్రీలో ఏం జరుగుతుందో స్పష్టంగా తెలుసుకొని వస్తున్నారని, కానీ ఇండస్ట్రీ మీ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే అద్దం కాదని ఆమె వ్యాఖ్యానించారు.
తాను కూడా రచయిత వైరముత్తు నుంచి అనుచిత ప్రవర్తనకు గురైన విషయాన్ని మరోసారి ప్రస్తావించారు. తాను అప్పట్లో టీనేజ్ యువతినని, ఆయనను గురువుగా భావించానని, తల్లి పక్కనే ఉన్నా అలాంటి ప్రయత్నం చేశారని తెలిపారు. పని ఇస్తున్నాం కాబట్టి శారీరక సుఖం కావాలని భావించే మనస్తత్వమే అసలు సమస్య అని చిన్మయి ఘాటుగా వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆమె కామెంట్స్.. నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి.