'టీమ్ కెరీర్‌ లోనే హెయ్యెస్ట్'.. చెన్నై లవ్ స్టోరీ ప్లాన్ రివీల్ చేసిన ఎస్కేఎన్

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన లేటెస్ట్ మూవీ చెన్నై లవ్ స్టోరీ విడుదలకు సిద్ధమవుతోంది.

Update: 2026-07-18 16:28 GMT

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన లేటెస్ట్ మూవీ చెన్నై లవ్ స్టోరీ విడుదలకు సిద్ధమవుతోంది. జులై 24న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఆ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్‌ లో గ్రాండ్ గా జరిగింది. ఈ సందర్భంగా నిర్మాత ఎస్కేఎన్ చేసిన వ్యాఖ్యలు చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా సినిమాను తమ టీమ్ కెరీర్‌లోనే అత్యధిక థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు ఆయన వెల్లడించడం విశేషం.

ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో మాట్లాడిన ఎస్కేఎన్.. కిరణ్ అబ్బవరంపై పూర్తి నమ్మకం వ్యక్తం చేశారు. "క, కె ర్యాంప్ సినిమాల తర్వాత చెన్నై లవ్ స్టోరీతో కిరణ్ అబ్బవరం హ్యాట్రిక్ హిట్ అందుకోబోతున్నారు. మేమంతా కలిసి ఒక మీనింగ్‌ ఫుల్ హ్యాట్రిక్ కొట్టబోతున్నాం. సినిమా విడుదల కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాం" అని అన్నారు. అలాగే రచయిత, నిర్మాత సాయి రాజేష్ పాత్రను ప్రస్తావించారు.

"సాయి రాజేష్ ప్రస్తుతం బాలీవుడ్ సినిమా వర్క్స్ తో బిజీగా ఉన్నప్పటికీ, చెన్నై లవ్ స్టోరీకి స్టోరీతోపాటు స్క్రీన్‌ ప్లే అందించారు. నిర్మాతగా కూడా ప్రతి విషయాన్ని దగ్గరుండి చూసుకున్నారు. ఇప్పటికీ చెన్నై నుంచి బాధ్యతలతో వచ్చి సినిమా ప్రమోషన్లలో పాల్గొంటున్నారు" అంటూ ఆయనకు థ్యాంక్స్ చెప్పారు. హీరోయిన్ శ్రీ గౌరిప్రియపై కూడా ఎస్కేఎన్ ప్రశంసలు కురిపించారు. "చెన్నై లవ్ స్టోరీ సినిమాతో ఆమె తన కెరీర్‌ లో పది మెట్లు ఎక్కుతారు" అని అన్నారు.

సంగీత దర్శకుడు మణిశర్మ అందించిన పాటలు ఇప్పటికే మంచి ఆదరణ పొందాయని, ఆడియో సక్సెస్ కావడం మూవీ టీమ్ లో మరింత జోష్ నింపిందని చెప్పారు. అయితే కార్యక్రమంలో ఎస్కేఎన్ చేసిన అత్యంత కీలక వ్యాఖ్య విడుదల ప్లాన్ కు సంబంధించినదే. "మా అందరి కెరీర్‌లో చెన్నై లవ్ స్టోరీనే అత్యధిక థియేటర్లలో విడుదల చేస్తున్నాం" అని స్పష్టం చేశారు. దీంతో సినిమా రిలీజ్ రేంజ్, బిజినెస్‌ పై ఇప్పుడు అందరిలో ఆసక్తి పెరిగింది.

ఆ తర్వవాాత ప్రేమకథల గురించి మాట్లాడిన ఎస్కేఎన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "నాకు 90స్ లవ్ స్టోరీ మూవీస్ లో పవన్ కళ్యాణ్ తొలి ప్రేమ చిత్రమంటే ఇష్టం. ప్రేమ అనేది అసలు కాంప్లికేటెడ్ కాదు. అది మనకు దొరికితే చాలా ఈజీ. దొరకకపోతేనే కాంప్లికేటెడ్‌. ప్రేమ విజయం సాధించిందా లేదా అన్నదానిపైనే అంతా ఆధారపడి ఉంటుంది" అని చెప్పారు. ఇంకా "ఇది కేవలం లవ్ స్టోరీ కాదు. ప్రేక్షకులు గుర్తుంచుకునే క్లాసిక్ లవ్ స్టోరీగా నిలుస్తుందని నమ్ముతున్నాం" అని చెప్పారు.

కాగా, రవి నంబూరి దర్శకత్వం వహించిన ఆ సినిమాలో కిరణ్ అబ్బవరం స్టీవెన్ శంకర్ గా, శ్రీ గౌరిప్రియ నివిగా కనిపించనున్నారు. రొటీన్ ప్రేమకథలకు భిన్నంగా పూర్తిగా చెన్నై నేపథ్యంతో రూపొందిన ఆ సినిమా, "తొలిప్రేమ గొప్పదే కావచ్చు.. కానీ అదే జీవితం కాదు" అనే భావన చుట్టూ తిరగనుంది. భారీ విడుదలకు సిద్ధమవుతున్న ఆ ప్రేమకథ ప్రేక్షకులను ఎంత మేర ఆకట్టుకుంటుందో జులై 24న తేలనుంది.





Tags:    

Similar News