రిలీజ్‌కు ముందే 'కల్ట్' ట్యాగ్… ఓవర్ హైప్ సినిమా‌కు మైనస్? ప్లస్ ?

యువ హీరో కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీప్రియా జంటగా నటిస్తున్న లేటెస్ట్ రొమాంటిక్ డ్రామా ‘చెన్నై లవ్ స్టోరీ’ మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Update: 2026-07-20 10:59 GMT

యువ హీరో కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీప్రియా జంటగా నటిస్తున్న లేటెస్ట్ రొమాంటిక్ డ్రామా ‘చెన్నై లవ్ స్టోరీ’ మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రమోషన్స్ జోరుగా సాగుతున్న ఈ తరుణంలో ఈ చిత్రం రన్‌టైమ్, ప్రమోషన్స్ స్ట్రాటజీ గురించి నెట్టింట ఒక ఆసక్తికరమైన విశ్లేషణ మొదలైంది. సినిమా విడుదల కాకముందే మేకర్స్ దీన్ని ఒక 'కల్ట్', 'ఎమోషనల్ రైడ్' అని పదే పదే ప్రమోట్ చేయడం వెనుక ఉన్న మైండ్‌సెట్ ఏంటి? ఈ ఓవర్-హైప్ ప్రమోషన్ స్ట్రాటజీ సినిమాకు ప్లస్ అవుతుందా లేక మైనస్ అవుతుందా అనే సరికొత్త కోణం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

మారిన ట్రెండ్ - ప్రేక్షకులు ఇవ్వాల్సిన ట్యాగ్ మేకర్స్ ఇచ్చుకుంటే?:

ఒకప్పుడు ఒక సినిమా థియేటర్లలోకి వచ్చి, అందులోని కంటెంట్ ప్రేక్షకులకు విపరీతంగా నచ్చినప్పుడు వారే దాన్ని ఒక 'కల్ట్ క్లాసిక్' గా మార్చేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ పూర్తిగా రివర్స్ అయింది. ఇక మేకర్స్ తమకు తామే ముందుగా అలాంటి పవర్‌ఫుల్ ట్యాగ్‌లు వేసుకుని మార్కెట్ చేస్తున్నారు. దీనివల్ల సాధారణ ఆడియన్స్‌లో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతాయి. ఇక ఈ తరహా ఓవర్-హైప్ ప్రమోషన్ స్ట్రాటజీ ఒకవేళ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే పెద్ద ప్లస్ అవుతుంది కానీ, థియేటర్లలో కంటెంట్ ఏమాత్రం తేడా కొట్టినా అంతే వేగంగా నెగెటివ్ టాక్‌గా మారి సినిమాను ముంచేసే ప్రమాదం ఉంది.

3 గంటల రన్‌టైమ్ - ప్రేమకథకు పెద్ద రిస్క్:

ఈ సినిమా నిడివి గురించి ఇండస్ట్రీ సర్కిల్స్‌లో ఒక లీక్ గట్టిగా వినిపిస్తోంది. మొదట 3 గంటల 10 నిమిషాల నిడివి అనుకుని, ఆ తర్వాత ఒక పది నిమిషాలు తగ్గించి 3 గంటల రన్‌టైమ్‌ను లాక్ చేసినట్లు తెలుస్తోంది. సాధారణంగా ఒక ప్రేమకథకు మూడు గంటల నిడివి అంటే చాలా పెద్ద రిస్క్ అనే చెప్పాలి. గతంలో సాయి రాజేష్ సృష్టించిన 'బేబీ' చిత్రం మూడు గంటల లెన్త్‌తో వచ్చి బ్లాక్‌బస్టర్ అయింది కాబట్టి, అదే నమ్మకంతో దీనికి కూడా అంతే సమయం ఫిక్స్ చేసినట్లు ఉన్నారు. అయితే ప్రతిసారీ అదే మ్యాజిక్ రిపీట్ అవ్వడం కత్తి మీద సామే.

బేబీ బ్రాండ్ మార్కెటింగ్.. పోటీదారుల లెక్కలు:

ఈ చిత్రానికి రవి నంబూరి దర్శకుడైనప్పటికీ, కథకుడు మరియు నిర్మాత అయిన సాయి రాజేష్ పేరు మీదే ప్రమోషన్స్ ఎక్కువగా నడుస్తున్నాయి. 'బేబీ' సినిమా తెచ్చిన క్రేజ్‌ను క్యాష్ చేసుకుంటూ సినిమాను జనంలోకి బలంగా తీసుకెళ్లాలనేది మేకర్స్ ప్లాన్. ఇక మణిశర్మ అందించిన సంగీతం, ట్రైలర్ కట్ సినిమాపై పాజిటివ్ వైబ్స్ తెచ్చాయి. ఇక ఒకరోజు ముందే తమిళ స్టార్ విజయ్ సినిమా రిలీజ్ ఉన్నప్పటికీ, అది భగవంత్ కేసరి రీమేక్ కావడంతో తెలుగు రాష్ట్రాల్లో తమ సినిమా కలెక్షన్లకు పెద్దగా ఎఫెక్ట్ పడదని చెన్నై లవ్ స్టోరీ టీమ్ చాలా కాన్ఫిడెంట్‌గా ఉంది.

కంటెంట్ గనుక నిజంగానే ఎంగేజింగ్‌గా ఉంటే జనాలు 3 గంటల సమయాన్ని అస్సలు లెక్క చేయరని గతంలో కొన్ని సినిమాలు నిరూపించాయి. అయితే మేకర్స్ ముందుగానే 'కల్ట్' అని ట్యాగ్ వేసుకోవడం కంటే, రిలీజ్ అయ్యాక ప్రేక్షకుల నోట ఆ మాట వస్తేనే ఆ సక్సెస్ కిక్ వేరుగా ఉంటుంది. మరి ఈ వారం థియేటర్లలోకి రాబోతున్న కిరణ్ అబ్బవరం చెన్నై లవ్ స్టోరీ, ఓవర్-హైప్ ప్రమోషన్ల అంచనాలను అందుకుని నిజంగానే కల్ట్ హిట్ అవుతుందో లేదో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే..

Tags:    

Similar News