సుకుమార్ శిష్యులే కాదు.. యేలేటి దగ్గర నుంచీ నలుగురు!

ఐతే, అనుకోకుండా ఒక రోజు, ఒక్కడున్నాడు, ప్రయాణం, సాహసం లాంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు యేలేటి.

Update: 2026-09-30 06:04 GMT

టాలీవుడ్‌లో దర్శకుల శిష్యుల గురించి మాట్లాడితే ఎక్కువగా సుకుమార్ బ్యాచ్ పేర్లే వినిపిస్తాయి. బుచ్చిబాబు సాన, శ్రీకాంత్ ఓదెల లాంటి వాళ్లు పెద్ద సినిమాలు చేయడంతో ఆ స్కూల్‌కు మంచి గుర్తింపు వచ్చింది. కానీ ఇంకో వైపు ఎలాంటి హడావుడి లేకుండా చంద్రశేఖర్ యేలేటి దగ్గర నుంచి కూడా వరుసగా దర్శకులు బయటకు వచ్చారు. ఇప్పుడు ఆ లిస్ట్‌లో మరో పేరు చేరబోతుండటంతో ఈ కనెక్షన్ మళ్లీ గుర్తుకొస్తోంది.

ఐతే, అనుకోకుండా ఒక రోజు, ఒక్కడున్నాడు, ప్రయాణం, సాహసం లాంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు యేలేటి. ఆయన మొదటి నుంచీ రెగ్యులర్ కమర్షియల్ ఫార్ములాకు కొంచెం దూరంగానే వెళ్లారు. కథ ఏ జోనర్‌లో ఉందో దానికి తగ్గట్టే సినిమా చేయడం ఆయన స్టైల్. ఆశ్చర్యం ఏంటంటే.. ఆయన దగ్గర పనిచేసిన వాళ్లు బయటకు వచ్చాక ఒక్కొక్కరు ఒక్కో రూట్ ఎంచుకున్నారు.

హను రాఘవపూడి అందులో ముందుగా గుర్తొచ్చే పేరు. యేలేటి టీమ్‌లో పనిచేసిన తర్వాత ‘అందాల రాక్షసి’తో దర్శకుడిగా మారారు. తర్వాత ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’, ‘పడి పడి లేచే మనసు’, ‘సీతారామం’ వరకు ఎక్కువగా ప్రేమకథలు, ఎమోషనల్ డ్రామాల వైపు వెళ్లారు. ఇప్పుడు ప్రభాస్ ఫౌజీ అంటూ కెరీర్ కూడా పెద్ద స్థాయి వరకు చేరింది.

రాధాకృష్ణ కుమార్ జర్నీ మరోలా సాగింది. యేలేటి సాహసం సినిమా వరకు అసిస్టెంట్‌గా, రైటింగ్ పనుల్లో భాగమైన ఆయన ‘జిల్’తో డైరెక్టర్ అయ్యారు. రెండో సినిమాకే ప్రభాస్‌తో ‘రాధే శ్యామ్’ చేసే అవకాశం వచ్చింది. చిన్న టీమ్ నుంచి మొదలై నేరుగా భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ వరకు వెళ్లిన దర్శకుడిగా ఆయన ట్రాక్ పూర్తిగా వేరేలా ఉంది.

భారత్ కమ్మ కూడా ఇదే రూట్ నుంచి వచ్చాడు. ‘ప్రయాణం’ సమయంలో యేలేటి దగ్గర పనిచేసిన ఆయన తర్వాత ‘డియర్ కామ్రేడ్’తో దర్శకుడిగా పరిచయమయ్యారు. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నతో వచ్చిన ఆ సినిమా ప్రేమకథతో పాటు ఎమోషన్, సోషల్ కాన్ఫ్లిక్ట్‌ను కలిపిన ప్రయత్నంగా నిలిచింది.

ఇప్పుడు శశాంక్ యేలేటి వంతు వచ్చింది. ‘ప్రయాణం’, ‘సాహసం’ సమయంలో డైరెక్షన్ విభాగంలో పనిచేసిన ఆయన ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’తో మెగాఫోన్ పట్టుకున్నారు. తొలి సినిమాకే ఫహాద్ ఫాజిల్‌ను తీసుకుని, మ్యాజిక్ ఫాంటసీ టచ్ ఉన్న కథను ఎంచుకోవడం కూడా రెగ్యులర్ డెబ్యూ రూట్ కాదు. పైగా నిర్మాతగా ఎస్.ఎస్. కార్తికేయ ఉండటం వల్ల ప్రాజెక్ట్‌పై మొదటి నుంచే పెద్ద స్థాయిలో ఫోకస్ పడింది. ఇక సినిమా ఏ స్థాయిలో సక్సెస్ అవుతుందో చూడాలి.

Tags:    

Similar News