40 రూపాయల దొంగతనం.. 40 లక్షలు కట్టిన చంద్రబోస్
జీవితంలో మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు ఒక్కోసారి మనల్ని ఎంతో గొప్ప పనులు చేసేలా మారుస్తాయి.;
జీవితంలో మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు ఒక్కోసారి మనల్ని ఎంతో గొప్ప పనులు చేసేలా మారుస్తాయి. సరిగ్గా ఇలాంటి సంఘటనే ఆస్కార్ గెలిచిన రచయిత చంద్రబోస్ జీవితంలో జరిగింది. చిన్నప్పుడు చేసిన ఒక చిన్న దొంగతనం, ఇప్పుడు ఊరికి 40 లక్షల విలువైన ఆస్తిని తెచ్చిపెట్టింది. ఈ విషయాన్ని చంద్రబోస్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో బయటపెట్టారు.
రచయితగా చంద్రబోస్ ఇండస్ట్రీలో ఎలాంటి గుర్తింపుని అందుకున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సిరివెన్నెల సీతారామశాస్త్రి తరువాత మళ్ళీ అంతటి క్రేజ్ అందుకున్నాడు. ఎలాంటి పాటనైనా అలవోకగా రాయడంలో ఆయన స్టైలే. ముఖ్యంగా సుకుమార్ లాంటి ప్రముఖ దర్శకులు ఇప్పటికే ఆయనతోనే ట్రావెల్ అవుతున్నారు.
ఇక చంద్రబోస్ గారికి చిన్నప్పటి నుంచి పుస్తకాలంటే ప్రాణం. సొంతూరు చల్లగరిగలోని గ్రంథాలయానికి రోజూ వెళ్ళేవారు. ఒకరోజు ఆ లైబ్రరీకి కొత్తగా ఒక త్రిభాషా నిఘంటువు వచ్చింది. నీలం రంగు అట్టతో మెరుస్తూ ఉన్న ఆ పుస్తకం చూడగానే ఆయనకు మనసు ఆగలేదు. ఆ రోజు లైబ్రరీలో ఎవరూ లేని సమయం చూసి, ఆ పుస్తకాన్ని దొంగచాటుగా ఇంటికి తెచ్చేసుకున్నారు. అప్పట్లో ఆ పుస్తకం ధర కేవలం 40 రూపాయలు మాత్రమే.
ఆ పుస్తకం ఆయనతో పాటే చాలా ఏళ్లు ప్రయాణించింది. పాలిటెక్నిక్, ఇంజనీరింగ్ చదివేటప్పుడు, ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు కూడా ఆ పుస్తకం ఆయన దగ్గరే ఉంది. కానీ లైబ్రరీ నుంచి ఒక పుస్తకాన్ని దొంగిలించాననే అపరాధ భావం ఆయన్ను ఎప్పుడూ వెంటాడుతూనే ఉండేది. ఆస్కార్ అవార్డు వచ్చిన తర్వాత భార్యతో కలిసి సొంతూరు వెళ్ళినప్పుడు, అక్కడ పాతబడిపోయిన ఆ గ్రంథాలయాన్ని చూసి చలించిపోయారు. ఆ పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలని అక్కడికక్కడే నిర్ణయించుకున్నారు.
వెంటనే తన సొంత డబ్బు 40 లక్షల రూపాయలు ఖర్చు చేసి ఊరికి ఒక అద్భుతమైన కొత్త గ్రంథాలయాన్ని కట్టించారు. దానికి ఆస్కార్ గ్రంథాలయం అని పేరు పెట్టారు. నేను దొంగిలించిన ఆ పుస్తకం ఖరీదు అప్పట్లో 40 రూపాయలే కావచ్చు, కానీ అది నా చేత ఇప్పుడు 40 లక్షల గ్రంథాలయాన్ని కట్టించింది, అందుకే ఆ పుస్తకం విలువ ఇప్పుడు నాకు 40 లక్షలు అని చంద్రబోస్ ఆనందంగా చెప్పుకొచ్చారు.