ఆ అధ్యాయం ముగిసింది.. డేటింగ్ యాప్ ట్రై చేసా: చాహల్
టీమ్ ఇండియా లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ కెరీర్, వ్యక్తిగత జీవితం కారణంగా తీవ్రమైన డిప్రెషన్ లోకి వెళ్లిన సంగతి తెలిసిందే. తాను డిప్రెషన్ నుంచి బయటపడేందుకు నిపుణుడిని కలిసి శిక్షణ తీసుకున్నానని కూడా తెలిపాడు.;
టీమ్ ఇండియా లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ కెరీర్, వ్యక్తిగత జీవితం కారణంగా తీవ్రమైన డిప్రెషన్ లోకి వెళ్లిన సంగతి తెలిసిందే. తాను డిప్రెషన్ నుంచి బయటపడేందుకు నిపుణుడిని కలిసి శిక్షణ తీసుకున్నానని కూడా తెలిపాడు. భార్య ధనశ్రీతో విడాకుల కారణంగా గత ఏడాది అంతా యజ్వేంద్ర తీవ్ర మానసిక వేదనను అనుభవించాడు. చివరికి విడాకుల తర్వాత దాని నుంచి బయటపడ్డానని రిలీఫ్ ఫీలయ్యాడు.
తాజాగా అతడు తన వ్యక్తిగత జీవితంపై సాగుతున్న పుకార్లకు చెక్ పెడుతూ, మొదటిసారి తన విడాకులు, డిప్రెషన్‌తో తాను చేసిన పోరాటం గురించి సంచలన విషయాలను రివీల్ చేసాడు. చాహల్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ధనశ్రీ వర్మతో తన బంధం గురించి మాట్టాడారు. ``మా ఇద్దరి మధ్య ఉన్న ఆ అధ్యాయం ముగిసింది. మేమిద్దరం పరస్పర అంగీకారంతో విడిపోవాలని నిర్ణయించుకున్నాం. సోషల్ మీడియాలో వచ్చే పుకార్లు మమ్మల్ని మానసికంగా చాలా ఇబ్బంది పెట్టాయి. కానీ ఇప్పుడు మేం మా దారుల్లో ముందుకు వెళ్తున్నాం`` అని వ్యాఖ్యానించారు. విడాకుల తర్వాత ఎవరికి వారు కెరీర్ బిజీలో ఉన్నామని చాహల్ మరోసారి ధృవీకరించారు
చట్టపరమైన ప్రక్రియ ముగిసిన క్షణమే భావోద్వేగంగా అంతా ముగిసిపోయిందని చాహల్ స్పష్టం చేశాడు. కోర్టు నుండి బయటకు రాగానే అంతా అయిపోయిందని అన్నారు. ``ఆ అధ్యాయం ముగిసింది. ఇప్పుడు ఆ దశ నుంచి బయటపడ్డాను. నేను అక్కడే చిక్కుకుపోవాలనుకోవడం లేదు!`` అని చాహల్ చెప్పాడు. తాను, ధనశ్రీ ఇద్దరూ తమ తమ జీవితాల్లో సంతోషంగా ఉన్నామని అన్నాడు. అయితే తమను ట్రోల్ చేస్తూ బాధపెట్టడం ద్వారా ఎవరికి ఏం వస్తుందో తెలియడం లేదని ఆవేదన చెందారు. ధనశ్రీకి 4 కోట్ల భరణం చెల్లింపు గురించి వచ్చిన వార్తల గురించి, అలాగే తాను ఆ సమయంలో చేసిన వీడియోల గురించి ట్రోలర్స్ అభిప్రాయల గురించి చాహల్ చాలా మాట్లాడారు. అలాగే తాను ఎవరితోను డేటింగ్ చేయడం లేదని, తాను ఒంటరిగా సంతోషంగా ఉన్నానని తెలిపారు. తనతో కనిపించే మహిళలు తన స్నేహితులు మాత్రమేనని కూడా చాహల్ అన్నారు.
తన క్రికెట్ కెరీర్‌లో ఎదురైన ఒడిదుడుకులు, వ్యక్తిగత జీవితంలో సమస్యలు తనను తీవ్రమైన డిప్రెషన్ లోకి నెట్టాయని చాహల్ ఆవేదన వ్యక్తం చేశారు. 2024 వరల్డ్ కప్ టీమ్‌లో చోటు దక్కకపోవడం, వ్యక్తిగత సమస్యలు తోడవ్వడంతో తాను మానసికంగా కుంగిపోయానని చెప్పారు. ఒకానొక సమయంలో నాకు క్రికెట్ అంటేనే విరక్తి కలిగింది. ఎవరితోనూ మాట్లాడాలనిపించేది కాదు. కానీ నా కుటుంబం, ముఖ్యంగా నా తండ్రి నాకు అండగా నిలిచారు. ప్రొఫెషనల్ థెరపీ తీసుకోవడం వల్ల నేను మళ్ళీ సాధారణ స్థితికి రాగలిగానని చాహల్ వివరించారు.
ప్రస్తుతం చాహల్ ఐపీఎల్ (IPL 2026) కోసం సిద్ధమవుతున్నారు. తన వ్యక్తిగత బాధలను పక్కన పెట్టి, కేవలం క్రికెట్‌పైనే దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. నేను మళ్ళీ ఫామ్ కోసం ప్రయత్నిస్తున్నానని తెలిపారు. ఇప్పుడు నా ఏకైక లక్ష్యం భారత్ తరపున మరిన్ని వికెట్లు తీయడం! అని ధీమా వ్యక్తం చేశారు.
సెలబ్రిటీల కోసం డేటింగ్ యాప్- `రాయా`ను తాను కూడా కొంత సమయం పాటు ప్రయత్నించానని కానీ కొద్ది సేపటికే తొలగించానని తెలిపాడు. డేటింగ్ యాప్ ల కాన్సెప్ట్ తనకు అర్థం కాలేదని కూడా అంగీకరించాడు. చాహల్ ఇప్పుడు అన్నిటి నుంచి బయటపడ్డారు. అతడు ఐపీఎల్ లో అద్భుతంగా రాణించాలని, వరసగా వికెట్లు తీసి మ్యాచ్ విన్నర్ గా నిలవాలని కూడా అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.