ఐ-బొమ్మ రవి.. ఆస్తులు అమ్ముకోవడానికి వచ్చి
ఇటీవల వారణాసి టైటిల్ గ్లింప్స్ ఈవెంట్లో ఒక డ్రోన్ కదలిక తన కలల్ని ఎలా చిద్రం చేసిందో చెబుతూ రాజమౌళి ఎంతగానో ఆవేదన చెందారు.;
టాలీవుడ్ యేటేటా పైరసీ కారణంగా వందల కోట్లు నష్టపోతోంది. ఐబొమ్మ, బప్పం లాంటి టొరెంట్ వెబ్ సైట్లతో పాటు, ఇతర పైరసీ మాఫియా కారణంగా తెలుగు చిత్రసీమకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. అసలే జనాల్ని థియేటర్లకు రప్పించలేక నానా తంటాలు పడుతున్న ఈ రోజుల్లో పైరసీ భూతం ప్రత్యక్ష నరకంలా మారింది. చాలా మంది నిర్మాతలు తమ సినిమాని టొరెంట్ లింకుల్లో హెచ్.డి కాపీలు చూసుకుని గగ్గోలు పెడుతున్నారు.
ఇటీవల వారణాసి టైటిల్ గ్లింప్స్ ఈవెంట్లో ఒక డ్రోన్ కదలిక తన కలల్ని ఎలా చిద్రం చేసిందో చెబుతూ రాజమౌళి ఎంతగానో ఆవేదన చెందారు. ఒక చిన్న టీజర్ గ్లింప్స్ ని లీక్ చేస్తేనే ఆయన తట్టుకోలేకపోయారు. అయితే ఆ ఆవేదనకు వంద రెట్లు అధిక వేదనతో నిర్మాతలు కుంగిపోవడానికి కారణం పైరసీ భూతం. ముఖ్యంగా ఐబొమ్మ లాంటి వెబ్ సైట్లు తాజా తాజాగా సినిమా రిలీజైన గంటలోపే హెచ్.డి కాపీలను ఆన్ లైన్ లో అందిస్తుండటంతో హైదరాబాద్, విజయవాడ, వైజాగ్ సహా అన్ని నగరాల్లో, ఇరు తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి పల్లెలోను ప్రజలు ఈ పైరసీ వీడియోలను ఆస్వాధించి థియేటర్లకు రావడం మానుకున్నారు. ఇక దేశంలోని చాలా మంది బీటెక్ గ్రాడ్యుయేట్లు పైరసీ డౌన్ లోడ్ ల కోసం అధికంగా కృషి చేస్తున్నట్టు సర్వే కూడా ఉంది. టెక్నాలజీ విద్యనభ్యసించిన చాలా మంది ఈ తరహా ముసుగు వ్యాపారాలను సులువుగా చేయగలుగుతున్నారని పోలీసులు నివేదిస్తున్నారు.
ఇప్పుడు అరెస్ట్ అయిన ఐబొమ్మ రవి ఇమ్మడి కూడా టెకీ. అతడు సాఫ్ట్ వేర్ కంపెనీ సీఈవో. తన విజ్ఞానాన్ని అతడు తప్పుడు విధానంలో దుర్వినియోగపరిచాడు. కూకట్ పల్లి ఫ్యామిలీ కోర్టులో భార్యతో విడాకుల కేసు కారణంగా అతడు కరేబియన్ నుంచి హైదరాబాద్ కూకట్ పల్లికి వచ్చాడని కొన్ని కథనాలొచ్చాయి. అయితే భార్యతో సమస్యల కారణంగా అతడు తన ఆస్తులను కూడా అమ్ముకునేందుకు సిద్ధమై వచ్చాడని గుసగుసలు వినిపించాయి. అయితే రవి నేరకార్యకలాపాలు తనకు తెలియదని అతడి తండ్రి అప్పారావు తీవ్ర ఆవేదన వ్యక్తపరిచిన వీడియోలు ఇంతకుముందు వైరల్ అయ్యాయి. తమ కుటుంబం తీవ్ర కష్టాలలో ఉందని ఆయన ఆవేదన చెందారు.
ఇప్పుడు ఐబొమ్మ రవిపై నాలుగు కేసులు నమోదయ్యాయని తెలుస్తోంది. ఈసారి ఫారిన్ యాక్ట్ ను కూడా జోడించారు పోలీసులు. 2022లో భారత పౌరసత్వం వదులుకున్న రవి కరేబియన్ దీవులకు వెళ్లిపోయాడు. అక్కడ పౌరసత్వం కోసం ఏకంగా 80లక్షలు చెల్లించాడు. కరేబియన్ పాస్ పోర్ట్ తోనే ఇక్కడకు వచ్చాడు. విశాఖపట్నం, హైదరాబాద్ లో తన ఆస్తులను అమ్మేసుకుని కరేబియన్ వెళ్లిపోవాలనుకున్నాడు. కానీ ఖాకీల ఎంట్రీతో కథ అడ్డం తిరిగింది. రవి దొరికిపోయాడు. భార్యతో వివాదం కారణంగా అతడు ఆస్తులు అమ్ముకుని వెళ్లిపోవాలనుకున్నాడా? అంటూ ఆరాలు తీస్తున్నారు.