సెలబ్రిటీల పాలిట సోషల్ మీడియా యమపాశమా?
ఇలాంటి ఘటనలను చూస్తుంటే సెలబ్రిటీలకు సోషల్ మీడియా యమపాశంగా మారిందా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తరువాత సెలబ్రిటీలకు సంబంధించిన ప్రతి చిన్న విషయం క్షణాల్లో ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతోంది. ముఖ్యంగా సెలబ్రిటీలకు సంబంధించిన మంచి విషయాలే కాదు వారిని కించపరిచేలా ఎన్నో విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అలా సెలబ్రిటీలను విమర్శించడం ఒక ఎత్తైతే.. బ్రతికున్న వారిని మరణించినట్టు ముద్రించడం మరో ఎత్తు. ఇలాంటి ఘటనలను చూస్తుంటే సెలబ్రిటీలకు సోషల్ మీడియా యమపాశంగా మారిందా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.
ముఖ్యంగా ఈ సోషల్ మీడియాలో కొంతమంది ఆకతాయిలు సెలబ్రిటీలను మరణించినట్టు చూపించడమే కాదు సెలబ్రిటీలు వారి చుట్టూ చేరి ఏడుస్తున్నట్టు సృష్టించి మరింత వైరల్ చేస్తున్నారు. దీని వల్ల సెలబ్రిటీలకు బ్యాడ్ నేమ్ రావడమే కాకుండా వారి అభిమానులు పూర్తిస్థాయిలో భయభ్రాంతులకు లోనవుతున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలు తమను చనిపోయినట్టు చిత్రీకరించడంతో ప్రతి ఒక్కరికి తాము బ్రతికే ఉన్నామని చెప్పుకోలేక కొంతమంది సైలెంట్ అయితే.. మరి కొంతమంది ఇలాంటి సోషల్ మీడియా ఆకతాయిలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ విరుచుకుపడుతున్నారు.
అందులో భాగంగానే ఇప్పుడు మరొక సీనియర్ లెజెండ్రీ నటుడు కూడా సోషల్ మీడియా తీరుపై ఆవేదన వ్యక్తం చేశారు. బ్రతికున్న తనను చంపేశారని.. పైగా తన చుట్టూ స్టార్ సెలబ్రిటీలు ఏడుస్తున్నట్టు ఫోటోలు కూడా చిత్రీకరించారు అంటూ తన బాధను వ్యక్తపరిచారు. ఆయన ఎవరో కాదు లెజెండ్రీ యాక్టర్ జగపతిబాబు. ఇటీవల బుచ్చిబాబు సనా దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన పెద్ది సినిమాలో అప్పలసూరి పాత్రతో అదరగొట్టేసిన జగపతిబాబు.. తాజాగా వరుస ప్రమోషన్స్ లో పాల్గొంటూ ఎన్నో విషయాలను పంచుకుంటున్నారు.
అలా తాజాగా సోషల్ మీడియా పై మండిపడ్డారు. ఆయన మాట్లాడుతూ.." సోషల్ మీడియా ట్రోలింగ్ అనేది పని లేని వాళ్ళు చేసే పని. గతంలో నేను చనిపోయానని తారక్ తో పాటు కొంతమంది సెలబ్రిటీలు నా చుట్టూ చేరి ఏడుస్తున్నట్లుగా ఫోటోలు, వీడియోలు ఎడిట్ చేసి మరీ పోస్ట్ చేశారు అంటూ ఆయన గుర్తు చేసుకున్నారు. అయితే ఆ తర్వాత లక్కీగా తనపై ఎలాంటి ట్రోల్స్ రాలేదని.. సినిమాల్లో నటిస్తూ మళ్లీ బయట కూడా నటించడం అవసరం లేదని, నిజం చెప్పి కూడా బ్రతకొచ్చు అంటూ ఒక ఇంటర్వ్యూలో తెలిపారు జగపతిబాబు . ఏది ఏమైనా బ్రతికున్న సెలబ్రిటీలను వ్యూస్ కోసం చనిపోయినట్టు చిత్రీకరించడం నిజంగా అమానవీయం అంటూ పలువురు నెటిజన్లు మండిపడుతున్నారు. మరి ఇప్పటికైనా ఇలాంటి ఆకతాయిలలో మార్పు వస్తుందేమో చూడాలి.
జగపతిబాబు విషయానికొస్తే.. విలన్ గా తన కెరియర్ ను మొదలుపెట్టి నటుడిగా తనలోని విశ్వరూపాన్ని చూపించి ఫ్యామిలీ హీరోగా మంచి పేరు దక్కించుకున్న జగపతిబాబు.. లెజెండ్ సినిమాతో మళ్లీ విలన్ గా తనలోని నటుడిని మేలుకొలిపారు. ఇక అప్పటినుంచి విభిన్నమైన పాత్రలు పోషిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈయన ఈ మధ్యకాలంలో వరుస పెట్టి చిత్రాలు చేస్తూ బిజీగా మారిపోయారు. ఇక ఇటీవలే స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా పెద్దితో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈయన మరోవైపు ఆధ్యాత్మిక బయోపిక్ ఆంథాలజీ మూవీలో నటిస్తున్నారు . అంతేకాదు వధల అనే చిత్రంలో కూడా నటిస్తున్నారు జగపతిబాబు.