రెండేళ్ల క్రితం నా పుట్టిన రోజు అక్కడే జరిగింది : విజయ్ దేవరకొండ
మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తూ... 28 మంది చనిపోయిన ఈ ఘటన హృదయ విదారకమైనది.;
జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడి దేశం మొత్తాన్ని కుదిపేసింది. అమాయకులైన పర్యాటకులపై కాల్పులు జరిపిన ఉగ్రవాదులను, ఉగ్రవాద సంస్థలను క్షమించవద్దంటూ దేశం మొత్తం ముక్త కంఠంతో డిమాండ్ చేస్తుంది. సోషల్ మీడియాలో చాలా మంది దీనికి ప్రతీకారం తీసుకోవాల్సిందే అంటూ డిమాండ్ చేస్తున్నారు. సామాన్యులు మాత్రమే కాకుండా సెలబ్రెటీలు సైతం ఈ ఉగ్రదాడి ని తీవ్రంగా ఖండించి చనిపోయిన పర్యాటకులకు ప్రగాడ సంతాపం తెలియజేశారు. టాలీవుడ్‌కి చెందిన సినీ ప్రముఖులు పలువురు ఈ దారుణంపై స్పందించారు. సోషల్ మీడియా ద్వారా పలువురు తమ సంతాపం తెలియజేశారు.
మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తూ... 28 మంది చనిపోయిన ఈ ఘటన హృదయ విదారకమైనది. ఉగ్రవాదులు పాల్పడిన ఈ చర్య క్షమించరానిది. చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అన్నారు.
విజయ్ దేవరకొండ స్పందిస్తూ... రెండు సంవత్సరాల క్రితం పహల్గాంలో ఒక షూటింగ్‌లో పాల్గొన్నాను. ఆ సమయంలో షూటింగ్ చాలా సరదాగా నవ్వుల మధ్య సాగింది. ఆ సమయంలో మమ్మల్ని చాలా జాగ్రత్తగా స్థానిక కశ్మీరీలు చూసుకున్నారు. వారి ప్రేమ మధ్య ఆ సమయంలో నా పుట్టిన రోజు జరుపుకున్నాను. నిన్న జరిగిన హృదయ విదారక ఘటన నాకు కోపం తెప్పించింది. మిమ్మల్ని మీరు ఒక దళంగా చెప్పుకుంటూ పర్యాటకులను కాల్చి చంపడం అనేది కచ్చితంగా పిరికిపంద చర్య అంటూ ఉగ్రవాదుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. కాశ్మీర్‌కు మేము అండగా నిలుస్తాము. ఈ పిరికి వాళ్ళు త్వరలోనే నిర్మూలించబడుతారు. భారతదేశం ఎప్పటికీ ఉగ్రవాదానికి తలవంచదు.
అల్లు అర్జున్ స్పందిస్తూ... పహల్గాం ఎంతో అందమైన ప్రదేశం. అక్కడ జరిగిన ఘటన తెలిసి గుండె పగిలింది. బాధిత కుటుంబాలకు నా సానుభూతి తెలియజేస్తున్నాను. మృతి చెందిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను.
ఎన్టీఆర్ స్పందిస్తూ... పహల్గాం ఘటనలో చనిపోయిన వారిని, బాధితులను చూస్తూ ఉంటే హృదయం బరువెక్కుతోంది. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. అక్కడ శాంతి కోసం ప్రార్థిస్తున్నాను అన్నారు.
నాని స్పందిస్తూ... మూడు నెలల క్రితం అక్కడ 200 మందితో కలిసి షూటింగ్‌లో పాల్గొన్నాను. ఇలాంటి దారుణాన్ని ఊహించలేదు. ఉగ్రదాడి హృదయాన్ని కలచి వేసింది అన్నారు.
మహేష్ బాబు స్పందిస్తూ... ఇది డార్క్ డే, ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాను. బాధిత కుటుంబాలకు అండగా ఉందాం అన్నారు.
అక్షయ్ కుమార్ స్పందిస్తూ... ఈ దాడి దారుణమైనది. అమాయకులను చంపడం అనేది దారుణం. మృతుల కుటుంబాల కోసం ప్రార్థిస్తున్నాను.
సంజయ్ దత్ స్పందిస్తూ... ఇది కచ్చితంగా క్షమించరాని ఘాతుకం. ఈ ఉగ్ర చర్యపై అందరూ మౌనం వీడాలి, తప్పకుండా ప్రతీకారం తీర్చుకోవాల్సిందే అని అన్నారు.
జాన్వీ కపూర్ స్పందిస్తూ... పహల్గాం ఉగ్ర దాడి గురించి తెలిసి షాక్ అయ్యాను. సైనిక దుస్తుల్లో వచ్చి కాల్పులు జరపడం అనేది అన్యాయం. ఇలాంటి అనాగరిక చర్యల వల్ల నాలోని కోపాన్ని అణచివేయలేక పోతున్నాను. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాల కోసం ప్రార్థన చేస్తున్నా. మేం మొత్తం మీ వెంట ఉన్నాం. ఈ సమయంలో ధైర్యంగా ఉండండి.
సోనూసూద్ స్పందిస్తూ... అమాయకపై పర్యాటకులపై ఉగ్రదాడి జరగడం దారుణం. ఇది కచ్చితంగా పిరికిపంద చర్య. నాగరిక ప్రపంచంలో ఉగ్రవాదానికి చోటు ఉండకూడదు. ఈ దాడి ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు అన్నారు.
ఇంకా పలువురు సినీ ప్రముఖులు ఈ విషయమై స్పందిస్తూ తమ సంతాపం తెలియజేశారు. అంతే కాకుండా పలువురు గతంలో తాము పహల్గాంలో షూటింగ్ చేసిన సందర్భాలను గుర్తు చేసుకున్నారు. ఉగ్రవాద చర్య ను ఖండిస్తూ కఠినంగా వ్యవహరించాలంటూ ప్రభుత్వాన్ని సెలబ్రిటీలు డిమాండ్ చేస్తున్నారు.