అప్పుడు సీఎం జగన్ డిసిషన్ తప్పు అన్నారు.. కానీ: బీవీఎస్ రవి
తెలుగు సినిమా పరిశ్రమలో టికెట్ రేట్ల అంశం మరోసారి చర్చకు వచ్చింది. రచయిత, నిర్మాత, దర్శకుడు బీవీఎస్ రవి ఆ విషయంపై ఓ ఇంటర్వ్యూలో ఇటీవల చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.;
తెలుగు సినిమా పరిశ్రమలో టికెట్ రేట్ల అంశం మరోసారి చర్చకు వచ్చింది. రచయిత, నిర్మాత, దర్శకుడు బీవీఎస్ రవి ఆ విషయంపై ఓ ఇంటర్వ్యూలో ఇటీవల చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సినిమా అనేది వినోదానికి ఒక సాధనం అని, కానీ ఇప్పుడు అది చాలా ఖరీదైన ఎంటర్టైన్మెంట్ గా మారిపోయిందని ఆయన అన్నారు.
అదే సమయంలో ఒకప్పుడు సినిమా చూసేందుకు కుటుంబం మొత్తం హాయిగా థియేటర్ కు వెళ్లేదని బీవీఎస్ రవి గుర్తు చేశారు. కానీ కాలక్రమేణా సినిమా టికెట్ ధరలు పెరిగిపోయి, సామాన్య ప్రేక్షకుడికి భారంగా మారిపోయాయని పరోక్షంగా వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తీసుకున్న టికెట్ రేట్ల నిర్ణయాన్ని ఆయన గుర్తు చేశారు.
ఏపీ సీఎంగా జగన్ మోహన్ రెడ్డి టికెట్ ధరలు తగ్గిస్తే అప్పట్లో చాలా మంది తీవ్రంగా వ్యతిరేకించారని చెప్పారు. ఇండస్ట్రీకి చెందిన పలువురు వెళ్లి ఆయనతో మాట్లాడారని, ఇది సమస్య కాదని వాదించారని తెలిపారు. కానీ వాస్తవంగా చూస్తే… చాలా మంది డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లతో మాట్లాడినప్పుడు తక్కువ టికెట్ రేట్లే బెటర్ అని వారు చెప్పినట్లు వెల్లడించారు.
ఆ తర్వాత ఇటీవల జరిగిన టాలీవుడ్ లో జరిగిన పరిణామాలను ప్రస్తావించారు. బన్నీ వాసు తన సినిమా కోసం కేవలం రూ.99కే టికెట్ ధరను నిర్ణయించారని బీవీఎస్ రవి గుర్తు చేశారు. తక్కువ ధరకు టికెట్ అందుబాటులో ఉండటంతో పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు థియేటర్లకు వచ్చారని అన్నారు. మంచి వసూళ్లు వచ్చాయని చెప్పారు.
ఆ నిర్ణయంతోనే సినిమా గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగిందని, అదే ఒకరకంగా పబ్లిసిటీగా మారిందని వ్యాఖ్యానించారు. ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే తక్కువ టికెట్ రేటు అనే అంశమే ఒక పబ్లిసిటీ కంటెంట్ గా మారిపోయిందని బీవీఎస్ రవి అభిప్రాయపడ్డారు. సినిమా కథ, కంటెంట్ తో పాటు… టికెట్ ధర కూడా ప్రేక్షకులను థియేటర్ కు రప్పించే అంశంగా మారిందని పరోక్షంగా అన్నారు.
భవిష్యత్తులో ఇంకా కొత్త పద్ధతులు వస్తాయేమో అని ఆయన సరదాగా వ్యాఖ్యానించారు. ఒకటి కొంటే ఇంకొకటి టికెట్ ఫ్రీ అనే ఆఫర్లు కూడా రావచ్చేమో అని చమత్కరించారు. మొత్తంగా చూస్తే, సినిమా పరిశ్రమలో టికెట్ రేట్ల అంశం ఎంత కీలకంగా మారిందో బీవీఎస్ రవి వ్యాఖ్యలు స్పష్టంగా తెలుస్తోంది. ప్రేక్షకుడికి అందుబాటులో ఉండే రేట్లతో సినిమాలు విడుదలైతే థియేటర్లకు పూర్వ వైభవం తిరిగి వస్తుందని పలువురు సినీ పండితులు అభిప్రాయపడుతున్నారు.