రామ్ చరణ్ తర్వాత బుచ్చిబాబు కథ ఎవరికి? హీరోల లిస్ట్‌లో ఎవరెవరు ఉన్నారంటే?
ఇటీవల ‘ఇరుముడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆయన చేసిన వ్యాఖ్యలు బుచ్చిబాబు తదుపరి ప్రాజెక్ట్‌లపై రకరకాల అంచనాలను పెంచేశాయి.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో ‘పెద్ది’ సినిమాను పూర్తి చేసి హిట్ కొట్టిన దర్శకుడు బుచ్చిబాబు సానా నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎవరితో ఉంటుంది అనే విషయంపై టాలీవుడ్‌లో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. నెక్స్ట్ సినిమా ఇంకా అధికారికంగా ఫిక్స్ కాకపోయినా, ఆయన వద్ద ఉన్న స్టార్ హీరోల లైనప్ మాత్రం చాలా పెద్దదిగానే ఉంది. ఇటీవల ‘ఇరుముడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆయన చేసిన వ్యాఖ్యలు బుచ్చిబాబు తదుపరి ప్రాజెక్ట్‌లపై రకరకాల అంచనాలను పెంచేశాయి.
మాస్ మహారాజాతో తొలి కథ:
తన కెరీర్ ఆరంభంలోనే రాసుకున్న మొదటి కథ మాస్ మహారాజా రవితేజ కోసమేనని బుచ్చిబాబు ఇటీవల బయటపెట్టారు. ఆ పవర్‌ఫుల్ స్క్రిప్ట్ ఇప్పటికీ తన వద్దే భద్రంగా ఉందని, రవితేజకు వినిపించి ఆ సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లాలని ఉందంటూ ఓ కొత్త కాంబినేషన్‌పై హింట్ ఇచ్చారు. ఇక దీంతో వీరిద్దరి కాంబోపై సినీ ప్రియుల్లో తీవ్ర కుతూహలం మొదలైంది.
ఎన్టీఆర్ కోసం మరో బలమైన లైన్:
‘ఉప్పెన’ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో ఒక సినిమా చేయాలని బుచ్చిబాబు ప్రయత్నించారు. అయితే ‘పెద్ది’ కథ వేరు, ఎన్టీఆర్ కోసం రాసుకున్న కథ పూర్తిగా వేరు అని ఆయన స్పష్టం చేశారు. ఇక ఎన్టీఆర్ పిలిస్తే వెంటనే వెళ్లి ఆ బలమైన కథను వినిపిస్తానని, ఆ కాంబినేషన్ కోసం తాను సిద్ధంగా ఉన్నానని బుచ్చిబాబు పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు.
మహేష్ బాబుతో కాంబినేషన్ ఉందా?:
మరోవైపు సూపర్‌స్టార్ మహేష్ బాబు పేరు కూడా బుచ్చిబాబు లిస్ట్‌లో వినిపిస్తోంది. మహేష్ కోసం ప్రత్యేకంగా ఒక లైన్ ఉందా అని అడగ్గా, ఆయన దాన్ని కొట్టిపారేయకుండా సరైన సమయం వచ్చినప్పుడు చెబుతానంటూ ఆసక్తికరంగా బదులిచ్చారు. ఇక దీంతో మహేష్‌తో కూడా ఒక క్రేజీ ప్రాజెక్ట్ ప్లానింగ్‌లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
పెద్ద హీరోల కోసం పక్కా స్క్రిప్ట్ బ్యాంక్:
ఇక్కడ గమనించాల్సిన విషయమేమిటంటే.. బుచ్చిబాబు ఒకే కథను హీరోలందరి చుట్టూ తిప్పడం లేదు. ఇక ఎన్టీఆర్ కథ వేరు, రవితేజ కోసం రాసుకున్న కథ వేరు, అలాగే ‘పెద్ది’ని చరణ్ కోసమే ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. అంటే ఆయన దగ్గర ముందే సిద్ధంగా ఉన్న పెద్ద స్క్రిప్ట్ బ్యాంక్ ఉంది.
‘ఉప్పెన’ తర్వాత ‘పెద్ది’ చేయడానికి దాదాపు ఐదేళ్ల సమయం పట్టింది. కానీ ఈసారి మళ్లీ అంత పెద్ద గ్యాప్ తీసుకోకుండా త్వరగానే తన తదుపరి చిత్రాన్ని ప్రకటించాలని బుచ్చిబాబు భావిస్తున్నారు. మరి ఈ లైనప్‌లో ఉన్న రవితేజ, ఎన్టీఆర్, మహేష్ బాబులలో ఆయన నెక్స్ట్ సినిమా ఏ స్టార్ హీరోతో పట్టాలెక్కుతుందో వేచి చూడాలి.