బ్రహ్మాస్త్ర 2.. ఈసారైనా అసలు విషయంపై దృష్టి పెడతారా?

సినిమా చూస్తున్నంత సేపు కళ్లకు పండగే అయినా, కథ పరంగా కనెక్ట్ అవ్వలేకపోయామని చాలామంది పెదవి విరిచారు.;

Update: 2025-10-20 03:57 GMT

గత సినిమాలతో పోలిస్తే 'బ్రహ్మాస్త్ర: పార్ట్ వన్ శివ'.. అనేది అప్పటి వరకు వచ్చిన సినిమాలలో కొంతవరకు బెస్ట్ విజువల్ మూవీ. బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్‌తో అయాన్ ముఖర్జీ ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేశాడు. 'అస్త్రవర్స్' అనే అతని ఆలోచన చాలా గ్రాండ్‌గా, ఆశలు రేకెత్తించేలా ఉంది. కానీ, ఆ విజువల్స్ వెనుక ఉన్న కథ, సంభాషణలు చాలా మంది ప్రేక్షకులను నిరాశపరిచాయనేది వాస్తవం.


సినిమా చూస్తున్నంత సేపు కళ్లకు పండగే అయినా, కథ పరంగా కనెక్ట్ అవ్వలేకపోయామని చాలామంది పెదవి విరిచారు. ఈ నేపథ్యంలో, దర్శకుడిగా అయాన్ ముఖర్జీ ఫామ్ కూడా ఇప్పుడు చర్చనీయాంశమైంది. 'బ్రహ్మాస్త్ర' తర్వాత ఆయన దర్శకత్వం వహించిన భారీ యాక్షన్ చిత్రం 'వార్ 2' కూడా బాక్సాఫీస్ వద్ద అంచనాలను అందుకోలేకపోయింది. హృతిక్, ఎన్టీఆర్ లాంటి ఇద్దరు పవర్‌హౌస్ పెర్ఫార్మర్లు ఉన్నప్పటికీ, కథనంలోని లోపాల వల్ల సినిమా పెద్దగా మ్యాజిక్ చేయలేకపోయింది.


దీంతో, అయాన్ కేవలం విజువల్స్‌పైనే దృష్టి పెట్టి, కథను బలహీనంగా రాసుకుంటున్నారా అనే సందేహాలు బలపడ్డాయి. ఇలాంటి పరిస్థితుల్లో, అయాన్ ముఖర్జీ తన సోషల్ మీడియాలో ఒక చిన్న హింట్ వదిలాడు. హిమాలయాల్లో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న ఫోటోలతో పాటు, ఒక పోస్టుకు సింపుల్‌గా "Pt 2" అని పెట్టి, పక్కన 'ఓం' ఎమోజీని జోడించాడు. సహజంగానే, ఇది 'బ్రహ్మాస్త్ర 2' గురించిన సూచనే అని కొందరు భావించారు. అయితే, ఈసారి ఫ్యాన్స్‌లో భారీ ఎగ్జయిట్‌మెంట్ కంటే, ఎక్కువ సందేహాలే వ్యక్తమవుతున్నాయి.

'బ్రహ్మాస్త్ర: పార్ట్ టూ దేవ్' మొదటి భాగానికి మించి ఉండాలంటే, కేవలం విజువల్స్ సరిపోవు. మొదటి భాగంలో తేలిపోయిన సంభాషణలు, బలహీనమైన కథనం లాంటి లోపాలను ఈసారి సరిదిద్దుకోవాలి. విలన్‌గా పరిచయం చేసిన 'దేవ్' పాత్రకు బలమైన ఆరిజిన్ స్టోరీ, ఎమోషనల్ డెప్త్ ఉండాలి. ఈ ప్రాథమిక అంశాలపై దృష్టి పెట్టకుండా, మళ్ళీ విజువల్ గ్రాండియర్‌తో వస్తే ఫలితం తేడా కొట్టే ప్రమాదం ఉంది.

ఈ సీక్వెల్‌లో దేవ్ పాత్రలో రణ్‌వీర్ సింగ్, అతని సరసన దీపికా పదుకొణె నటిస్తారని ప్రచారం జరుగుతోంది. ఎంత పెద్ద స్టార్ కాస్ట్ ఉన్నా, చివరికి నిలబెట్టేది కథే. అందుకే, ఈ చిన్న హింట్ ఇచ్చిన అయాన్, ఈసారి కేవలం కళ్లకు మాత్రమే కాదు, ప్రేక్షకుడి బుర్రకు, గుండెకు కూడా పని చెప్పే సినిమా తీస్తాడా అనేది ఇప్పుడు అసలైన పాయింట్. 'అస్త్రవర్స్' భవిష్యత్తు మొత్తం ఈ రెండో భాగంపైనే ఆధారపడి ఉంది. ఇక ఎనౌన్స్మెంట్ ఎప్పుడు ఉంటుందో చూడాలి.

Tags:    

Similar News