Rs.12,000 ఫైన్..'బుక్ మై షో'పై సామాన్యుడి విజయం
బుక్‌మైషో సంస్థ ఇలా వినియోగదారుల కోర్టులో చట్టపరమైన ఎదురుదెబ్బలు తినడం ఇదే మొదటిసారి కాదు.
ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ రంగంలో గుత్తాధిపత్యాన్ని చెలాయిస్తున్న `బుక్‌మైషో` వంటి దిగ్గజ సంస్థలకు ఒక సామాన్య సినిమా ప్రేక్షకుడు గట్టి షాక్ ఇచ్చాడు. ప్రముఖ నటుడు మోహన్‌లాల్ ప్రతిష్టాత్మక చిత్రం `బారోజ్` కోసం 2025 జనవరి 1న బుక్‌మైషో ద్వారా టికెట్ బుక్ చేసుకున్న ఒక వినియోగదారుడికి, థియేటర్‌కు వెళ్లాక ముందస్తు సమాచారం లేకుండా షో రద్దు కావడం తీవ్ర నిరాశను మిగిల్చింది. దీనిపై వెనక్కి తగ్గని సదరు ప్రేక్షకుడు వినియోగదారుల కోర్టును ఆశ్రయించగా... కోర్టు బాధితుడికి అనుకూలంగా తీర్పునిస్తూ బుక్‌మైషో సంస్థకు రూ. 10,000 నష్టపరిహారంతో పాటు రూ. 2000 కోర్టు ఖర్చులు చెల్లించాలని ఆదేశించింది. ఈ అపూర్వ విజయం సోషల్ మీడియాలో `BMS పై సామాన్యుడి విజయం` అంటూ మార్మోగిపోతోంది.
బుక్‌మైషో సంస్థ ఇలా వినియోగదారుల కోర్టులో చట్టపరమైన ఎదురుదెబ్బలు తినడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ టికెట్లు బుక్ చేసుకున్నాక సాంకేతిక లోపాలు లేదా థియేటర్ల యజమాన్యాల పొరపాట్ల వల్ల షోలు రద్దయినప్పుడు.. రీఫండ్ ఇవ్వడంలో నిర్లక్ష్యం వహించినందుకు పలువురు వినియోగదారులు కోర్టులను ఆశ్రయించి బుక్‌మైషోపై విజయాలు సాధించారు. టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫామ్‌లు కేవలం మేం `మధ్యవర్తులం` మాత్రమేనని... థియేటర్లలో జరిగే లోపాలకు మాకు సంబంధం లేదని తప్పించుకోవడానికి వీల్లేదని, కస్టమర్ల నుండి డబ్బులు వసూలు చేసినప్పుడు పూర్తి బాధ్యత వహించాల్సిందేనని కన్స్యూమర్ ఫోరమ్‌లు గతంలోనే స్పష్టం చేశాయి.
అలాగే ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేస్తే అదనపు ఛార్జీల బాదుడు ప్రజల నడ్డి విరిచేస్తోంది. ఒక్కో టికెట్‌పై ఇంటర్నెట్ హ్యాండ్లింగ్ ఫీజు, బుకింగ్ ఛార్జీలు, జీఎస్టీ అంటూ అదనంగా రూ.30 నుండి రూ.60 వరకు వసూలు చేస్తున్నారు. అసలు ఆన్‌లైన్ వర్కింగ్ లేదా హ్యాండ్లింగ్ ఛార్జీలను వినియోగదారుడే ఎందుకు చెల్లించాలనే ప్రశ్న సర్వత్రా వ్యక్తమవుతోంది. సంస్థలు తమ డిజిటల్ మౌలిక సదుపాయాల నిర్వహణ ఖర్చును వినియోగదారులపై రుద్దడం పూర్తిగా అనుచితమని... వాస్తవానికి ఆన్‌లైన్ విధానం వల్ల థియేటర్ల వద్ద సిబ్బంది ఖర్చు, ప్రింటింగ్ ఖర్చు తగ్గుతున్నందున ప్రేక్షకులకు రాయితీ ఇవ్వాల్సింది పోయి... ఇలా అదనపు దోపిడీకి పాల్పడటంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.
కేవలం ఆన్‌లైన్ టికెటింగ్ యాప్స్ మాత్రమే కాదు..థియేటర్ల యజమాన్యాలు కూడా వాణిజ్య ప్రకటనల పేరిట ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తున్నాయి. సినిమా టికెట్‌పై ముద్రించిన సమయానికి షో ప్రారంభించకుండా.. విలువైన సమయాన్ని వృథా చేస్తూ 15 నుండి 20 నిమిషాల పాటు కేవలం కమర్షియల్ యాడ్స్, ప్రమోషన్లను ప్లే చేయడంపై గతంలో కొందరు సినిమా ప్రేమికులు వినియోగదారుల కోర్టులలో సుదీర్ఘ పోరాటం చేసి చారిత్రాత్మక విజయాలు సాధించారు. టికెట్ కొనుగోలు చేసిన ప్రేక్షకుడికి కేవలం సినిమాను వీక్షించే హక్కు మాత్రమే కాకుండా.. నిర్ణీత సమయ పాలనను పొందే హక్కు కూడా ఉందని కోర్టులు ఆయా సందర్భాలలో థియేటర్లకు జరిమానాలు విధించాయి.
ఈ నేపథ్యంలో ఒకవేళ థియేటర్లలో పరిమితికి మించి ఎక్కువ ప్రకటనలతో మిమ్మల్ని విసిగిస్తే కచ్చితంగా వినియోగదారుల ఫోరమ్‌లో ఫిర్యాదు చేయవచ్చు. సినిమా ప్రారంభ సమయం దాటిపోయినా ప్రకటనలు వేస్తూ కాలాన్ని వృథా చేయడం `సేవా లోపం` కిందకే వస్తుంది. అందువల్ల ప్రేక్షకులు తమకు జరిగిన టైమ్ వేస్ట్ ను లేదా నష్టాన్ని టికెట్ కాపీ, థియేటర్లో ప్రకటనలు ప్లే అవుతున్న సమయాన్ని వీడియో ఆధారాలతో సహా జాతీయ వినియోగదారుల హెల్ప్‌లైన్ (NCH) లేదా స్థానిక కన్స్యూమర్ కోర్టులో ఫిర్యాదు చేసి తమ హక్కులను కాపాడుకోవచ్చు.