టాలీవుడ్ లెజెండ్ సింగీతం సినిమాకి కాపీ వెర్ష‌న్?

బాలీవుడ్ లో ఇది అత్యంత ఖ‌రీదైన చిత్రం కాబోతోంద‌ని కూడా ప్ర‌చారం సాగుతోంది. ఎందుకంటే హాలీవుడ్ న‌టి సిడ్నీ స్వీనీ పారితోషికం చుక్క‌ల్లో ఉంటుంది.;

Update: 2025-09-17 16:44 GMT

ఈరోజుల్లో క‌థ‌లు దొర‌క‌డం లేదా లేక క్రియేట్ చేయ‌డం లేదా? ఈ ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం బాలీవుడ్ లో లేదు. ఒక కాఫీ షాప్ లో కూచుని హాలీవుడ్ సినిమాలు చూసి కాపీ క‌థ‌ల్ని రాసుకోవ‌డంలో బాలీవుడ్ ఫిలింమేక‌ర్స్ గొప్ప‌త‌నం గురించి ఇటీవ‌లే ఓ ప్ర‌ముఖుడు విన్న‌వించిన తీరు ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. నేటివిటీ క‌థ‌లు, నిజ క‌థ‌ల్ని రాయడంలో అక్క‌డ ఫిలింమేక‌ర్స్ కి ఆస‌క్తి లేద‌ని కూడా విమ‌ర్శించాడు.

అదంతా అటుంచితే ఇప్పుడు బాలీవుడ్ లో ఓ కాపీ క్యాట్ క‌థ‌ గురించి ముందే లీక్ అందింది. భార‌త‌దేశానికి చెందిన ఒక అబ్బాయి.. అమెరికా అమ్మాయితో ప్రేమ‌లో ప‌డితే అటుపై ఏం జ‌రిగింది? అనే క‌థాంశంతో బాలీవుడ్ ప్ర‌ముఖ ద‌ర్శ‌క‌నిర్మాత సినిమాని తెర‌కెక్కించే ప్లాన్ చేసార‌ని తెలిసింది. దీనికోసం హాలీవుడ్ న‌టి, యూపోరియా ఫేం సిడ్నీ స్వీనీని ఎంపిక చేసుకున్నార‌ని వెల్ల‌డైంది. సిడ్నీ స్వీనీతో మేక‌ర్స్ మంత‌నాలు సాగిస్తున్నారు. ఇంకా స‌ద‌రు న‌టి ఓకే చెప్ప‌లేదు. కానీ ఓకే చెబితే ఒక భార‌తీయ న‌టుడి స‌ర‌స‌న న‌టించేందుకు అవ‌కాశం ఉంది.

బాలీవుడ్ లో ఇది అత్యంత ఖ‌రీదైన చిత్రం కాబోతోంద‌ని కూడా ప్ర‌చారం సాగుతోంది. ఎందుకంటే హాలీవుడ్ న‌టి సిడ్నీ స్వీనీ పారితోషికం చుక్క‌ల్లో ఉంటుంది. దాదాపు 530 కోట్లు (45 మిలియ‌న్ల పౌండ్లు) చెల్లించేందుకు నిర్మాత‌లు సిద్ధంగా ఉన్నార‌ని, ఇది స‌ద‌రు న‌టి కెరీర్ బెస్ట్ అవుతుంద‌ని కూడా చెబుతున్నారు. ఇంత పెద్ద మొత్తం దేనికి ఇస్తున్నారు? అంటే.. న‌ట‌న‌(35 మిలియ‌న్ల పౌండ్లు) కు పారితోషికం, స్పాన్సర్‌షిప్‌లు , బ్రాండ్ టై-ఇన్‌లు అన్నీ క‌లుపుకుని ఇంత పెద్ద మొత్తం ఇస్తున్నారు. సిడ్నీ స్వీనీ యుఫోరియా, ది వైట్ లోటస్ చిత్రాలలో న‌ట‌న‌తో ప్ర‌పంచం దృష్టిని ఆక‌ర్షించింది.

ది సన్ క‌థ‌నం ప్రకారం.. ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ సిడ్నీ స్వీనీని సంప్రదించి బెస్ట్ డీల్ ని లాక్ చేసేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. సిడ్నీ చేరిక‌తో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను ఆకర్షించడం సాధ్య‌ప‌డుతుంద‌ని నిర్మాత‌లు ఆశిస్తున్నారు. ఆస‌క్తిక‌రంగా ఒక భార‌తీయ సెల‌బ్రిటీతో ప్రేమ‌లో ప‌డే యువ అమెరికన్ నటి పాత్రను సిడ్నీ స్వీనీ పోషించనుంది. క‌థ ఆస‌క్తిక‌రం. క్రాస్ క‌ల్చ‌ర్ క‌థ‌ అంత‌ర్జాతీయ ఆడియెన్ ని రీచ్ అవుతుంది. 2026 ప్రారంభంలో న్యూయార్క్, పారిస్, లండన్, దుబాయ్ వంటి నగరాల్లో చిత్రీకరణ జరగనుంది. అయితే సిడ్నీ స్వీనీ ఇంకా డేట్లు లాక్ చేయ‌లేదు. దీనికి కార‌ణం త‌న‌కు డ‌బ్బు ముఖ్యం కాదు.. డేట్స్ అడ్జ‌స్ట్ చేయ‌డం ముఖ్యం.

కాపీ క్యాట్ క‌థ‌లు రాస్తున్నారంటూ విమ‌ర్శ‌లొస్తున్న ఈ త‌రుణంలో, బాలీవుడ్ ఫిలింమేక‌ర్ ప్ర‌య‌త్నం నిజంగా ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. ఇది 70ల‌లో టాలీవుడ్ లెజెండ‌రీ దర్శ‌కుడు సింగీతం శ్రీ‌నివాస‌రావు తెర‌కెక్కించిన `అమెరికా అమ్మాయి` సినిమా థీమ్ లైన్ ని పోలి ఉండొచ్చ‌ని, క్రాస్ క‌ల్చ‌ర్ డ్రామా ఇంచుమించు అదే ఫీల్‌నిస్తుంద‌ని భావిస్తున్నారు. అమెరికా అమ్మాయితో ప్రేమ‌లో ప‌డే ఎన్నారై కుర్రాడి క‌థ‌తో ఇది రూపొందింది.

అమెరికా అమ్మయి (అమెరికన్ గర్ల్) అనేది 1976లో సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన భారతీయ తెలుగు భాషా చిత్రం. పాశ్చాత్య సంస్కృతితో పోలిస్తే తెలుగు సాంస్కృతిక ప్రాముఖ్యత కథ ఆధారంగా ఈ క్రాస్ ఓవర్ చిత్రం రూపొందించారు.. దేవయాని అనే రంగస్థల పేరుతో పిలుచుకునే ఫ్రెంచ్ నృత్యకారిణి అన్నీక్ చాయ్మోట్టి ప్రధాన పాత్రలో నటించారు. ఈ బ్యూటీ వెంపటి చిన్న సత్యం నుండి కూచిపూడి నృత్యం నేర్చుకుంది. అమెరికాలో నివ‌శించే శ్రీధర్ అనే భారతీయ యువకుడు అమెరికన్ మహిళ నీనాను వివాహం చేసుకుని ఆమెను భారతదేశానికి తీసుకువస్తాడు. అతని తల్లిదండ్రులు ఆమెను తమ ఇంట్లోకి అంగీకరించడానికి నిరాకరిస్తారు. నీనా భాష, నృత్యం, గానం వంటి భారతీయ సంస్కృతిని నేర్చుకుంటుంది. అంద‌రినీ ఆకట్టుకుంటుంది. చివరికి వారు ఆమెను తమ కోడలిగా అంగీకరిస్తారు. ఇక జంధ్యాల తెర‌కెక్కించిన ప‌డ‌మ‌టి సంధ్యారాగం చిత్రం కూడా ఇలాంటి క‌థ‌తోనే రూపొందింది.

ఇప్పుడు బాలీవుడ్ సినిమా క‌థ‌లో పాత్ర‌ల తీరుతెన్నులు మారినా కానీ ప్ర‌వ‌ర్త‌న‌, క్రాస్ ఓవ‌ర్ ల‌వ్ స్టోరీ ఎమోష‌న్స్ ఇంచుమించు ఒకే విధంగా ఉంటాయ‌న‌డంలో సందేహం లేదు. పాత సినిమాలు చూసి కొత్త క‌థ‌లు రాసే మేధావులున్న ప‌రిశ్ర‌మ‌లో ఇంత‌కంటే ఇంకేం చేయ‌గ‌ల‌రు?

Tags:    

Similar News