హైదరాబాద్ బాట పడుతున్న బాలీవుడ్ భామలు !

అలాగే బాలీవుడ్‌లో సెన్సేషన్‌గా మారిన తృప్తి దిమ్రి కూడా రెబల్ స్టార్ ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో తెర‌కెక్కుతున్న‌ పవర్‌ఫుల్ పోలీస్ డ్రామా `స్పిరిట్` తో లాంచ్ అవుతుంది.

Update: 2026-05-31 00:30 GMT

చలనచిత్ర రంగంలో ప్రాంతీయ సరిహద్దులు చెరిగిపోతున్న త‌రుణ‌మిది. ముఖ్యంగా టాలీవుడ్ నిర్మిస్తున్న భారీ పాన్-ఇండియా చిత్రాలు.. ఇక్కడి మేకింగ్ స్టాండర్డ్స్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఈ క్రమంలోనే బాలీవుడ్ భామలు హైదరాబాద్ బాట పడుతున్నారు. గెస్ట్ రోల్స్ కోసమో.. ఐటెం సాంగ్స్ కోసమో కాకుండా కథను మలుపు తిప్పే కీలక పాత్రల్లో నటించేందుకు ఇక్కడి స్టార్ హీరోలు.. అగ్ర దర్శకుల చిత్రాలలో సైన్ చేస్తూ 2026లో సరికొత్త ట్రెండ్‌కు తెరతీశారు. ఈ జోరులో అందరికంటే ముందు వరుసలో కనిపిస్తోంది అతిలోక సుందరి కుమార్తె జాన్వి కపూర్. ఇప్పటికే టాలీవుడ్‌లో అడుగులు బలంగా వేసిన ముద్దుగుమ్మ ప్రస్తుతం క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉంది.

ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న `పెద్ది` చిత్రంతో పాటు, ఎన్టీఆర్ సరసన `దేవర 2` లోనూ న‌టిస్తుంది. గ్లామర్‌కే పరిమితం కాకుండా వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక మార్కెట్‌ను క్రియేట్ చేసుకునే పనిలో పడింది జాన్వి. అలాగే బాలీవుడ్ సీనియర్ నటి రవీనా టాండన్ వారసురాలిగా సినీ రంగ ప్రవేశం చేస్తున్న రషా తడాని కూడా తన అరంగేట్రం కోసం టాలీవుడ్‌నే ఎంచుకోవడం విశేషం. `శ్రీనివాస మంగాపురం` ప్రాజెక్ట్‌తో అమ్మ‌డు తెలుగు తెరకు పరిచయమవుతోంది. ఇండియన్ సినిమాలోనే టాప్ హీరోయిన్‌గా దూసుకుపోతున్న దీపికా పదుకునే సైతం టాలీవుడ్ వైపు ప్రత్యేక ఆసక్తిని కనబరుస్తోంది.

ఐకాన్ స్టార్ అల్లు -స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో తెర‌కెక్కుతోన్న‌ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ `రాకా` చిత్రంలో దీపికా హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ క్రేజీ కాంబినేషన్ చిత్రానికి దేశవ్యాప్తంగానే కాకుండా అంతర్జాతీయ స్థాయిలోనూ భారీ క్రేజ్ లభిస్తోంది. ఒక అగ్ర నటి ఇలాంటి భారీ ప్రాజెక్టులో భాగమవ్వడం సినిమా బిజినెస్ రేంజ్‌ను మరింత పెంచుతుందనడంలో సందేహం లేదు. గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా సూపర్ స్టార్ మహేష్ హీరోగా న‌టిస్తోన్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం `వారణాసి`తో టాలీవుడ్ స్క్రీన్‌పై ఎంట్రీ ఇస్తుంది.

అలాగే బాలీవుడ్‌లో సెన్సేషన్‌గా మారిన తృప్తి దిమ్రి కూడా రెబల్ స్టార్ ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో తెర‌కెక్కుతున్న‌ పవర్‌ఫుల్ పోలీస్ డ్రామా `స్పిరిట్` తో లాంచ్ అవుతుంది. ఇంకా ఛాన్సులు రావాలేగానే న‌వ‌త‌రం మ‌రింత భామ‌లు తెలుగు సినిమాల‌పై ఎంతో ఆస‌క్తిగా ఉన్నారు. గతంలో ఉత్తరాది నటీమణులు బాలీవుడ్‌లో స్థిరపడ్డాక ఇటువైపు వచ్చేవారు. కానీ ఇప్పుడు కెరీర్ ఆరంభంలోనే నేరుగా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వడానికి మొగ్గు చూపుతుండటం ఇక్కడి చిత్రాల డిమాండ్‌కు అద్దం పడుతోంది. హైదరాబాద్ ఇప్పుడు ప్రాంతీయ సినిమా హబ్ మాత్రమే కాదు. భారతీయ చలనచిత్ర పరిశ్రమకు ప్రధాన రాజధానిగా ఎదుగుతోంది. బాలీవుడ్ హీరోయిన్లు టాలీవుడ్‌ను ప్రథమ ప్రాధాన్యతగా ఎంచుకోవడం వెనుక ఇక్కడి కథల వైవిధ్యం, భారీ బడ్జెట్, గ్లోబల్ రీచ్ స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముంబై భామల గ్లామర్, టాలీవుడ్ హీరోల మాస్ ఇమేజ్ తోడైతే రాబోయే రోజుల్లో భారతీయ సినిమా ఖ్యాతి అంత‌కంత‌కు పెరుగుతుంది.

Tags:    

Similar News