‘బైకర్’ క్లైమాక్స్ కోసం యూవీ సాహసం!

సినిమా అంటే కేవలం కెమెరా ముందు నటన మాత్రమే కాదు, వెండితెరపై ఒక కొత్త ప్రపంచాన్ని చూపించాలనే తపన ఉండాలి.;

Update: 2026-03-23 05:50 GMT

సినిమా అంటే కేవలం కెమెరా ముందు నటన మాత్రమే కాదు, వెండితెరపై ఒక కొత్త ప్రపంచాన్ని చూపించాలనే తపన ఉండాలి. ‘బైకర్’ సినిమా విషయంలో దర్శకుడు అభిలాష్ రెడ్డి సరిగ్గా అదే చేశారు. లేటెస్ట్ గా జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో అతను మాట్లాడిన మాటలు వింటుంటే, ఈ సినిమా కోసం చిత్ర యూనిట్ పడిన కష్టం మామూలుగా లేదనిపిస్తోంది. ముఖ్యంగా క్లైమాక్స్ సీక్వెన్స్ కోసం ఇండోనేషియాలోని ఒక ఐలాండ్‌కు వెళ్లి షూటింగ్ చేయడం ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

ఈ ప్రాజెక్ట్ ఇంత గ్రాండ్‌గా రావడానికి యూవీ క్రియేషన్స్ వంశీ ఇచ్చిన సపోర్ట్ కారణమని అభిలాష్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. క్లైమాక్స్ కోసం ఇండోనేషియాలోని ఒక టెర్రైన్ ప్రాంతాన్ని ఎంచుకున్నప్పుడు, అంతర్జాతీయ మోటోక్రాస్ సంస్థలు సైతం అక్కడ లాజిస్టిక్స్ కుదరవని షూటింగ్ క్యాన్సిల్ చేశారట. కానీ వంశీ మాత్రం, తమ్ముడూ నీకు ఏం కావాలన్నా తీసుకో, కానీ అవుట్‌పుట్ మాత్రం అదిరిపోవాలి అని భరోసా ఇచ్చారట.

దీంతో దర్శకుడు వెనక్కి తగ్గకుండా ప్లాన్ చేసి ఆ ఐలాండ్‌లో షూటింగ్ పూర్తి చేశారు. కేవలం లొకేషన్ మాత్రమే కాదు, రేసింగ్ సీన్లలో రియాలిటీ కోసం ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ నుండి సుమారు 50 మంది ప్రొఫెషనల్ రేసర్లను రప్పించారు. ఇండియాలో సెట్లు వేసి మేనేజ్ చేయకుండా, ఇండోనేషియాలో రియల్ ట్రాక్స్‌పై ఈ విజువల్స్ చిత్రీకరించడం విశేషం.

"వంశీ అన్న లాంటి నిర్మాత దొరకబట్టే నేను అడిగింది అడిగినట్లుగా సమకూర్చారు. ఈ బ్యానర్ లేకపోతే ఇంత క్వాలిటీ అవుట్‌పుట్ వచ్చేది కాదు" అని అభిలాష్ ఎమోషనల్ అయ్యారు. సినిమాలో 1990, 2000 కాలానికి సంబంధించిన రెండు వేర్వేరు టైమ్ లైన్స్ ఉంటాయని, ఆ కాలాన్ని ప్రతిబింబించేలా బైక్స్ వాతావరణాన్ని చాలా జాగ్రత్తగా రీ క్రియేట్ చేశామని దర్శకుడు వివరించారు.

ప్రతి రేసు వెనుక ఒక బలమైన ఎమోషన్ ఉంటుందని, అది ఆడియన్స్‌కు కచ్చితంగా కనెక్ట్ అవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. శర్వానంద్ ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్ రాజశేఖర్ గారి పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్ సినిమాకు మెయిన్ పిల్లర్స్‌గా నిలుస్తాయని చెప్పారు. యూవీ క్రియేషన్స్ పెట్టిన ప్రతి రూపాయి స్క్రీన్ మీద విజువల్ వండర్‌లా కనిపిస్తుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. డాల్బీ సినిమా, 4DX వంటి లేటెస్ట్ ఫార్మాట్లలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తుండటంతో, ఇండోనేషియాలో తీసిన ఆ రేసింగ్ సీన్లు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తాయని అభిలాష్ ప్రామిస్ చేస్తున్నారు. ఏప్రిల్ 3న థియేటర్లలో ఈ హై వోల్టేజ్ రైడ్ మొదలుకానుంది. ఇక రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాలి.




Tags:    

Similar News