CM విజయ్‌పై ఆరోపణలతో ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించిన నటి
తమిళ బిగ్ బాస్ ఫేమ్, నటి జూలి ఇటీవల చెన్నైలో నిర్వహించిన ఒక ప్రెస్ కాన్ఫరెన్స్‌లో తమిళనాడు ముఖ్యమంత్రి, ప్రముఖ నటుడు విజయ్ ..అతడి రాజకీయ పార్టీ `తమిళగ వెట్రి కజగం` (TVK) మద్దతుదారులపై తీవ్రస్థాయిలో సంచలన ఆరోపణలు చేశారు.
తమిళ బిగ్ బాస్ ఫేమ్, నటి జూలి ఇటీవల చెన్నైలో నిర్వహించిన ఒక ప్రెస్ కాన్ఫరెన్స్‌లో తమిళనాడు ముఖ్యమంత్రి, ప్రముఖ నటుడు విజయ్ ..అతడి రాజకీయ పార్టీ `తమిళగ వెట్రి కజగం` (TVK) మద్దతుదారులపై తీవ్రస్థాయిలో సంచలన ఆరోపణలు చేశారు. గత కొద్దికాలంగా సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న విపరీతమైన ఆన్‌లైన్ హరాస్‌మెంట్ -క్యారెక్టర్ విద్వంశం కారణంగా తాను గర్భస్రావాన్ని ఎదుర్కొన్నానని.. తన మొదటి బిడ్డను కోల్పోయానని కన్నీటిపర్యంతమయ్యారు. ఈ మానసిక క్షోభకు నేరుగా విజయ్ అన్నే బాధ్యుడంటూ ఈ నటి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సౌత్ సినీ, రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి.
ఈ వివాదం పూర్తి వివరాల్లోకి వెళితే.. నటి జూలి ఈ ఏడాది జనవరిలో మొహమ్మద్ ఇక్రీమ్‌ను వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత విజయ్ రాజకీయ పార్టీ టీవీకే (టీవీకే) విధానాలపై లేదా ఆ పార్టీకి వ్యతిరేకంగా ఆమె మాట్లాడినప్పటి నుండి సోషల్ మీడియాలో విజయ్ అభిమానులు, టీవీకే మద్దతుదారులు తనను టార్గెట్ చేయడం ప్రారంభించారని జూలి పేర్కొన్నారు. ఒక మహిళ కేవలం ఒక పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడినంత మాత్రాన.. ఎలాంటి విచక్షణ లేకుండా తనను, తన భర్తను, తన వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ కథనాలు అల్లడం ఎంతవరకు సమంజసమని జూలీ ప్రశ్నించారు. ఈ నిరంతర ఆన్‌లైన్ వేధింపుల వల్ల కలిగిన తీవ్రమైన మానసిక ఆందోళన వల్లే తన కడుపులోని బిడ్డ చనిపోయిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
తనపై జరిగిన ఈ ట్రోలింగ్‌కు సంబంధించి జూలి ఈ ఏడాది మార్చి నెలలోనే ఎనిమిది మంది వ్యక్తులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఆ సమయంలో రాష్ట్రంలో డీఎంకే ప్రభుత్వం అధికారంలో ఉండగా.. ఇటీవల జరిగిన ఎన్నికల అనంతరం మే నెలలో విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత ఒక రోజూ అకస్మాత్తుగా జూలికి ఒక నోటీసు అందింది. అందులో ఆమె ఇచ్చిన ఫిర్యాదు క్రిమినల్ కేసు కిందకు రాదని, అది కేవలం సివిల్ డిఫమేషన్ కిందకు వస్తుందని పేర్కొన్నారు. తాను నిందించిన ఆ ఎనిమిది మంది వ్యక్తులు అధికార టీవీకే పార్టీ మద్దతుదారులు కావడం వల్లే పోలీసులు తన కేసును సీరియస్‌గా తీసుకోవడం లేదని... కావాలనే పక్కన పెట్టేస్తున్నారని జూలి తీవ్ర ఆరోపణలు చేశారు.
ఇదిలా ఉండగా.. జూలి పోలీసులను ఆశ్రయించిన తర్వాత ఆమెపై ట్రోలింగ్ మరింత పెరిగిందని.. తనను ఏకంగా 15 లక్షల కిడ్నీ స్కామ్‌తో ముడిపెడుతూ సరికొత్త అబద్ధపు ప్రచారాలు మొదలుపెట్టారని వెల్లడించారు. ``నా ప్రతిష్టను దిగజార్చడానికి ఒక పక్కా కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వంతో ఈ కిడ్నీ స్కామ్ కథనాన్ని కొందరు టీవీకే మద్దతుదారులు.. ఒక లాయర్ కలిసి సృష్టించారు`` అని జూలి మండిపడ్డారు. ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఆమె మాట్లాడుతూ.. ``నా బిడ్డను కోల్పోవడానికి విజయ్ అన్నే కారణం. ఆయన స్వయంగా వచ్చి నన్ను వేధించకపోవచ్చు... కానీ తన మద్దతుదారులను ఒక్క మాట వెనక్కి తగ్గమని ఆయన హెచ్చరించి ఉంటే ఈ రోజు నా బిడ్డ బతికి ఉండేది`` అని భావోద్వేగానికి గురయ్యారు.
అయితే ఈ ఆరోపణలపై ఇండస్ట్రీ నుండి మిశ్రమ స్పందన వస్తోంది. సీనియర్ నటి అంబికా సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. జూలి గర్భస్రావం చెందడం పట్ల విచారం వ్యక్తం చేశారు. కానీ ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తిని ఇలాంటి వ్యక్తిగత ఆరోగ్య సమస్యకు బాధ్యుడిని చేస్తూ మాట్లాడటం చాలా అనాగరికం.. అగౌరవపరిచేలా ఉందని విమర్శించారు. మరోవైపు విజయ్ అభిమానులు కూడా సోషల్ మీడియాలో అనామక ఖాతాల నుండి వచ్చే ట్రోలింగ్‌కు తమ హీరోను ఎలా బాధ్యుడిని చేస్తారని జూలిని ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి ఒక స్టార్ హీరో ముఖ్యమంత్రి అయిన తరుణంలోనే ఒక నటి తన గర్భస్రావానికి ఆ పార్టీ మద్దతుదారుల వేధింపులే కారణమని ఆరోపించడం తమిళనాట పెద్ద సంచలనంగా మారింది.