పోలిశెట్టి 'భీమవరం బాల్మ'.. హుషారెత్తించిందిగా!
టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే.;
టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. తక్కువ సినిమాలే చేసినా.. అందరినీ మెప్పించారు. తన యాక్టింగ్ తో ఆకట్టుకున్నారు. చివరగా.. అనుష్కతో కలిసి మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి చేసి మంచి హిట్ అందుకున్నారు. ఇప్పుడు అనగనగా ఒక రాజు మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు.
నిజానికి.. ఆ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉంది. కానీ హీరోకి ఆ మధ్య యాక్సిడెంట్ అవ్వడం, దాన్నుంచి కోలుకోవడంతో అనగనగా ఒక రాజు మూవీ కాస్త లేట్ అయింది. ఇప్పుడు వచ్చే ఏడాది జనవరి నెలలో రిలీజ్ కానుంది. సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14వ తేదీన గ్రాండ్ గా థియేటర్స్ లో విడుదల చేయనున్నారు మేకర్స్.
అయితే ఇప్పటికే కొద్ది రోజుల క్రితం సినిమా ప్రమోషన్స్ ను స్టార్ట్ చేశారు. వరుస అప్డేట్స్ ఇస్తూ మూవీపై హైప్ క్రియేట్ చేస్తున్నారు. ముఖ్యంగా వినూత్నంగా ప్రమోషనల్ కంటెంట్ ను విడుదల చేస్తున్నారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన గ్లింప్స్, ప్రమోషనల్ వీడియోలతో సూపర్ రెస్పాన్స్ అందుకున్నారు.
తాజాగా గురువారం సాయంత్రం సినిమా నుంచి భీమవరం బాల్మ.. అంటూ సాగే పాటను విడుదల చేశారు. ఇప్పటికే పాట ప్రోమో అందరినీ ఆకట్టుకుంది. ముఖ్యంగా నవీన్ పోలిశెట్టి ఆలపించడంతో అందరి దృష్టి సాంగ్ పై పడింది. దీంతో అంతా ఆసక్తిగా ఎదురు చూశారు. ఇప్పుడు పాట రిలీజ్ అయ్యి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మ్యూజిక్ లవర్స్ ను మెప్పిస్తోంది.
ఎవరే ఈ బ్యూటీ.. ఇంత అందంగా ఉందే హాయి.. అంటూ సాగుతున్న పాటకు ఆస్కార్ అవార్డు విన్నర్ చంద్రబోస్ లిరిక్స్ అందించారు. మిక్కీ జె మేయర్ సంగీత దర్శకత్వంలో నవీన్ పోలిశెట్టి ఆలపించారు. ఆయనతోపాటు నూతన మోహన్ కూడా గాత్రం అందించారు. ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ సాంగ్ కు కొరియోగ్రఫీ చేశారు.
భీమవరం బాల్మ.. సాంగ్ అదిరిపోయిందని నెటిజన్లు, మ్యూజిక్ లవర్స్ కామెంట్స్ పెడుతున్నారు. ఫుల్ హుషారెత్తించే విధంగా ఉందని అంటున్నారు. మంచి జోష్ తో బాగుందని చెబుతున్నారు. నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌదరి లుక్స్ సూపర్ అని కొనియాడుతున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న అనగనగా ఒక రాజు నుంచి భీమవరం బాల్మ.. పాటను మీరు కూడా వినేయండి.