'నటి'గా గెలిచిన భాగ్యం

సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లకు అందం ఎంత ముఖ్యమో, అదృష్టం కూడా అంతే ముఖ్యం. కొన్నిసార్లు ఎంత గ్లామర్ ఉన్నా, బాక్సాఫీస్ విజయాలు దరిచేరవు.;

Update: 2025-11-27 20:30 GMT

సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లకు అందం ఎంత ముఖ్యమో, అదృష్టం కూడా అంతే ముఖ్యం. కొన్నిసార్లు ఎంత గ్లామర్ ఉన్నా, బాక్సాఫీస్ విజయాలు దరిచేరవు. టాలీవుడ్ లో అందాల భామ భాగ్యశ్రీ బోర్సేకి కూడా నిన్నటి వరకు అదే పరిస్థితి. చేసిన సినిమాలు వరుసగా నిరాశ పరుస్తున్నా, ఆమె గ్రాఫ్ మాత్రం పడిపోలేదు. అయితే నేడు వచ్చిన ఆంధ్ర కింగ్ తాలుకా సినిమంతో ఆమెపై ఉన్న ముద్ర పూర్తిగా చెరిగిపోయింది. ఫ్లాపుల్లో కూడా తనను తాను కొత్తగా ఆవిష్కరించుకుని అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

మొదట్లో ఈమెను చూసి అందరూ కేవలం 'గ్లామర్ డాల్' అనుకున్నారు. 'మిస్టర్ బచ్చన్' సినిమాలో గ్లామర్ తో యూత్ ను కట్టిపడేసినా, ఆ సినిమా డిజాస్టర్ అవ్వడంతో ఆమెకు పెద్దగా పేరు రాలేదు. ఆ తర్వాత విజయ్ దేవరకొండతో చేసిన 'కింగ్డమ్' సినిమా కూడా అంచనాలను అందుకోలేకపోయింది. దీంతో ఆమె కెరీర్ కష్టమే అని చాలామంది ఫిక్స్ అయ్యారు. కేవలం పాటల కోసమే పనికొస్తుందనే కామెంట్స్ కూడా వినిపించాయి.

కానీ ఆ విమర్శలన్నింటికీ ఆమె తన నటనతోనే సమాధానం చెప్పింది. రీసెంట్ గా వచ్చిన 'కాంత' సినిమా కమర్షియల్ గా పెద్ద హిట్ కాకపోయినా, అందులో ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. గ్లామర్ ఇమేజ్ నుంచి బయటకు వచ్చి, ఎమోషనల్ పాత్రలో ఒదిగిపోయిన తీరు విమర్శకులను మెప్పించింది. అక్కడే ఆమెలోని అసలైన నటి బయటకు వచ్చింది.

ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చిన 'ఆంధ్ర కింగ్ తాలూకా' సినిమాతో భాగ్యశ్రీ బోర్సే తన స్థానాన్ని పదిలం చేసుకుంది. రామ్ లాంటి ఎనర్జిటిక్ హీరో పక్కన నటిస్తూనే, తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. కేవలం అందంతోనే కాకుండా, అభినయంతోనూ మెప్పించింది. ముఖ్యంగా సినిమాలో వచ్చే ఒక ఎమోషనల్ సీన్ లో ఆమె నటన చూస్తే, ఈమె ఆ గ్లామర్ పాత్రలు వేసిన అమ్మాయేనా అని సందేహం రాకమానదు.

వరుస పరాజయాలు ఎదురైనా, ఆమె ఎంచుకుంటున్న పాత్రలు ఇప్పుడు ఆమెను కాపాడుతున్నాయి. గ్లామర్ డాల్ అనే ట్యాగ్ ను చెరిపేసుకుని, పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ హీరోయిన్ గా మారుతోంది. హిట్లు, ఫ్లాపులు అనేవి దైవాధీనం కానీ.. వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుని నటిగా నిరూపించుకోవడం ఆమె చేతుల్లోనే ఉంది. ఆ విషయంలో భాగ్యశ్రీ సక్సెస్ అయ్యిందనే చెప్పాలి.

మొత్తానికి బాక్సాఫీస్ లెక్కలు ఎలా ఉన్నా, ఇండస్ట్రీలో మాత్రం ఆమెకు మంచి గుర్తింపు దక్కింది. ఇప్పుడు ఆమెకు కావాల్సింది ఒక్క సాలిడ్ కమర్షియల్ హిట్ మాత్రమే. నటనలో ఆరితేరింది కాబట్టి, సరైన కథ పడితే భాగ్యశ్రీ స్టార్ హీరోయిన్ల లిస్టులో చేరడం ఖాయం. చూస్తుంటే ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా ఆమె కోరిక నెరవేర్చేలా కనిపిస్తోంది. సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్స్ కూడా గట్టిగానే పెరిగే అవకాశం మెండుగా కనిపిస్తోంది. ఇక రాబోయే రోజుల్లో వెండితెర భాగ్యం ఇంకెన్ని వైవిధ్యమైన పాత్రలతో అలరిస్తుందో చూడాలి.

Tags:    

Similar News