మూవీ రివ్యూ : 'బ్యాండ్ మేళం'

గత ఏడాది 'కోర్టు' సినిమాతో మెప్పించిన హర్ష్ రోషన్ - శ్రీదేవి జంటను హీరో హీరోయిన్లుగా పెట్టి కోన వెంకట్ ప్రొడక్షన్లో కొత్త దర్శకుడు సతీష్ జవ్వాజి రూపొందించిన చిత్రం.. బ్యాండ్ మేళం.;

Update: 2026-03-26 10:10 GMT

'బ్యాండ్ మేళం' మూవీ రివ్యూ

నటీనటులు: హర్ష్ రోషన్ - శ్రీదేవి - సాయికుమార్ - గోపరాజు విజయ్ తదితరులు

సంగీతం: విజయ్ బుల్గానిన్

ఛాయాగ్రహణం: సతీష్ ముత్యాల

నిర్మాతలు: శ్రావ్య - కావ్య

రచన - దర్శకత్వం: సతీష్ జవ్వాజి

గత ఏడాది 'కోర్టు' సినిమాతో మెప్పించిన హర్ష్ రోషన్ - శ్రీదేవి జంటను హీరో హీరోయిన్లుగా పెట్టి కోన వెంకట్ ప్రొడక్షన్లో కొత్త దర్శకుడు సతీష్ జవ్వాజి రూపొందించిన చిత్రం.. బ్యాండ్ మేళం. ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్ర విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ: గిరి (హర్ష్ రోషన్).. రాజి (శ్రీదేవి) బావా మరదళ్లు. చిన్నప్పటి నుంచి రాజి అంటే గిరికి ఎంతో ఇష్టం. కానీ పదో క్లాసులో ఫెయిల్ అయిన గిరి.. అక్కడితో ఆగిపోతాడు. రాజి మాత్రం చదువులో ముందుకు వెళ్ళి బీటెక్ చేరుతుంది. కానీ గిరి మాత్రం రాజి మీద ఆశలు వదులుకోడు. ప్రేమ పేరుతో తన వెంట పడుతూనే ఉంటాడు. తన చదువు విషయంలో రాజి అవమానించడంతో తనేంటో రుజువు చేసుకోవాలని అనుకుంటాడు. తన మిత్రులతో కలిసి మ్యూజిక్ బ్యాండ్ నడుపుతున్న గిరి.. సొంతంగా స్టూడియో పెట్టి ఎదగాలని ప్రయత్నిస్తాడు. మరి తన ప్రయత్నం ఎంత మేర ఫలించింది.. రాజి అతడికి దక్కిందా.. రాజికి అసలు గిరి మీద ప్రేమ ఉందా లేదా.. అన్నది మిగతా కథ.

కథనం - విశ్లేషణ: పోయినేడాది ఇదే సమయానికి ‘కోర్టు’ సినిమా థియేటర్లలో సందడి చేస్తూ ఉంది. అది నేచురల్ స్టార్ నాని నిర్మించిన చిత్రం. ఆ మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్లో నాని మాట్లాడుతూ.. ఈ సినిమా నచ్చకపోతే తాను హీరోగా నటిస్తున్న తర్వాతి సినిమా ‘హిట్-3’ చూడొద్దు అని ఒక బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. తర్వాత ‘కోర్టు’ చూసిన వాళ్లందరకీ నాని కేవలం ప్రమోషన్ కోసం ఆ స్టేట్మెంట్ ఇవ్వలేదని అర్థమైంది. అంతగా ఆ సినిమా ప్రేక్షకులను మెప్పించింది. కానీ నానిని అనుకరిస్తూ తర్వాత ప్రియదర్శి సహా చాలామంది ఇలాంటి స్టేట్మెంట్లు ఇచ్చారు. అవన్నీ గాలి మాటలే అని రుజువయ్యాయి. ఇప్పుడు ‘కోర్టు’ జంట హర్ష్ రోషన్-శ్రీదేవిలను హీరో హీరోయిన్లుగా పెట్టి ‘బ్యాండ్ మేళం’ సినిమాను ప్రొడ్యూస్ చేసిన సీనియర్ రైటర్ కోన వెంకట్.. ఈ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్లో నాని లాగే బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈ సినిమా నచ్చకపోతే రచయితగా తన తర్వాతి సినిమా (చిరంజీవి హీరోగా నటించబోతున్నాడు) చూడొద్దని ప్రకటించేశాడు. ‘కోర్టు’ జంట నటించిన సినిమా అనో.. ప్రోమోలు బాగున్నాయనో.. కోన వెంకట్ అంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడనో ‘బ్యాండ్ మేళం’ థియేటర్లలోకి వెళ్లి కూర్చుంటే.. షాక్ తప్పదు. ఈ మధ్య కాలంలో కాస్త పేరున్న నటీనటులు ఉండి.. కొంచెం గుర్తింపు ఉన్న ప్రొడక్షన్లో తెరకెక్కిన చిత్రాల్లో ‘బ్యాండ్ మేళం’ అంత అసహనం కలిగించే సినిమా ఇంకోటి ఉండదు అంటే అతిశయోక్తి ఏమీ కాదు.

‘బ్యాండ్ మేళం’ ఏ స్థాయిలో ఫ్రస్టేట్ ఉంటుందో.. ఒక ఉదాహరణ గురించి చెప్పుకోవాలి. ఇది స్పాయిలర్ లా అనిపించినప్పటికీ.. ఆ ప్రస్తావన లేకుండా సినిమా గురించి విశ్లేషించడమే కష్టం కాబట్టి దాని గురించి మాట్లాడాల్సిందే. సినిమా మధ్యలో ఉండగా హీరోయిన్.. హీరోతో కాకుండా వేరే అబ్బాయితో లేచిపోతుంది. తర్వాత ఆ అబ్బాయి మోసం చేశాడని తన ఊరికే తిరిగి వచ్చేస్తుంది. ఇక అక్కడ్నుంచి మొదలవుతుంది నాన్ స్టాప్ ‘బ్యాండ్ మేళం’. తర్వాత ఓ గంటన్నర నిడివి సినిమా ఉంటే.. హీరోయిన్ లేచిపోవడం మీద డైలాగ్ లేని సన్నివేశం వెతుక్కోవాల్సి ఉంటుంది. హీరో సహా ఎవరో ఒకరు లేచిపోయిన అమ్మాయి అంటూ హీరోయిన్ని ఏదో ఒక మాట అనడం.. ఆమె ఫీలవడం.. ఇదే వరస. ఆమె ఇంట్లో ఉన్నా అదే డైలాగ్.. బయటికి వచ్చినా అదే డైలాగ్.. బైక్ ఎక్కినా అదే మాట.. ఆటోలో పోయినా అదే మాట.. కామెడీ సీన్లో అయినా అదే పంచ్.. సెంటిమెంట్ పండించాలని చూసినా అదే మార్గం.. సెకండాఫ్ మొత్తంలో కనీసం 20 సీన్లు.. ఓ వంద డైలాగులైనా ఈ లేచిపోవడం మీదే ఉంటాయంటే అతిశయోక్తి కాదు. ఇంతా చేసి చివరికి చూస్తే ఆ లేచిపోవడం మీద పెద్ద ట్విస్టు.. వీర లెవెల్లో ఎమోషన్. రచయితగా పాతికేళ్ల అనుభవం ఉండి.. ఢీ.. రెడీ.. కింగ్.. దూకుడు లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలకు రచయితగా పని చేసిన కోన వెంకట్ ఈ సన్నివేశాలన్నీ చూసి కూడా అలాగే విడుదలకు వదిలేయడం.. పైగా ఈ సినిమా నచ్చకపోతే తన తర్వాతి సినిమా చూడొద్దని స్టేట్మెంట్ ఇవ్వడం అంటే అంతకంటే విడ్డూరమైన విషయం మరొకటి ఉండదు.

చెట్టు పేరు చెప్పి కాయలమ్మిన చందం ‘బ్యాండ్ మేళం’ సినిమా. ‘కోర్టు’ జంటతో సినిమా అంటే ఎంతో కొంత విషయం ఉంటుందని నమ్మి థియేటర్లలోకి అడుగు పెట్టిన కొన్ని నిమిషాలకే భ్రమలు విడిపోయేలా చేస్తుందీ సినిమా. పేరుకు ప్రేమకథే కానీ.. ప్రేమ సన్నివేశాలేమీ ఉండవిందులో. హీరో తన గుండె పట్టేసుకుని లవ్వు లవ్వు అంటూ హీరోయిన్ వెంట తిరుగుతుంటాడు. ఆమేమో అతణ్ని పట్టించుకోదు. పైగా అవమానిస్తుంది. హీరోయిన్ మీద తనకు అపారమైన ప్రేమ అని హీరో అంటుంటాడు. కానీ తనతో ప్రవర్తించే తీరు మాత్రం చూసే ప్రేక్షకులకు తీవ్ర అసహనం కలిగిస్తుంది. ఒక సీన్లో హీరోయిన్ లేచిపోయిందంటూ ఊర్లో వాళ్లు అవమానిస్తుంటే వాళ్లకు బుద్ధి చెబుతాడు హీరో. కానీ నెక్స్ట్ సీన్లో అతనే ఆమెను దారుణంగా అవమానిస్తాడు. హీరో ఎన్ని మాటలు అన్నా హీరోయిన్లో చలనమే ఉండదు. ప్రథమార్ధంలో హీరోను హీరోయిన్ అవమానిస్తే.. రెండో అర్ధంలో హీరో అదే పనిలో ఉంటాడు. ఇక ఇందులో లవ్ ఎక్కడుందో దర్శకుడికే తెలియాలి. చివర్లో ఒక ట్విస్టు ఇచ్చేసి వీళ్లిద్దరూ అమర ప్రేమికులు.. వాళ్ల ప్రేమను ఫీలైపోండి అన్నట్లుంటుంది వ్యవహారం. ఇది కాక హీరో గారి బ్యాండు మేళం చుట్టూ నడిపిన కామెడీ.. డ్రామాది అంతా ఇంకో నస. సినిమా మొత్తంలో పర్వాలేదు అనిపించే ఒక్క సీన్ లేదు.. ఒక్క డైలాగ్ లేదు. ప్రోమోలు కట్ చేయడంలో ఉన్న శ్రద్ధలో కాస్తయినా సినిమా మీద పెట్టి ఉంటే.. ‘బ్యాండ్ మేళం’ ఈ స్థాయిలో విసిగించకపోయేది. ‘కోర్టు’ జంట నటించింది కదా అని ఏవో అంచనాలు పెట్టుకుని ‘బ్యాండ్ మేళం’ జోలికి వెళ్తే.. తీవ్ర నిరాశ తప్పదు.

నటీనటులు: హర్ష్ రోషన్-శ్రీదేవి జంట తమ చివరి చిత్రంతో ఎంతగా అలరించిందో.. ‘బ్యాండ్ మేళం’లో అంతగా అసహనం కలిగిస్తుంది. హర్ష్ చాలా హుషారుగా నటించాడు కానీ.. అతను చేసిన గిరి పాత్ర మామూలుగా ఫ్రస్టేట్ చేయదు. తన మ్యూజిక్ స్టూడియో ప్రారంభ వేడుకలో అతను ఇచ్చే ప్రసంగం చూశాక.. తన పాత్రతో పూర్తిగా డిస్కనెక్ట్ అయిపోతాం. రాజి పాత్రలో శ్రీదేవి కూడా ఎలాంటి ప్రత్యేకతా చూపించలేకపోయింది. ఆ క్యారెక్టరే చాలా అయోమయంగా అనిపిస్తుంది. ఈసారి రోషన్ తో శ్రీదేవి కెమిస్ట్రీ ఏమాత్రం పండలేదు. సాయికుమార్ ను పూర్తిగా వృథా చేశారు. గోపరాజు విజయ్ పర్వాలేదు. హీరో తల్లి పాత్రలో చేసిన నటి బాగా చేసింది. హీరో మిత్ర బృంద పర్వాలేదు.

సాంకేతిక వర్గం: ‘బేబి’ సంగీత దర్శకుడు విజయ్ బుల్గానిన్ ‘బ్యాండ్ మేళం’తో మెప్పించలేకపోయాడు. పాటలు సోసోగా అనిపిస్తాయి. నేపథ్య సంగీతం బాగున్నా.. విషయం లేని సన్నివేశాల వల్ల దాని ప్రయోజనం నెరవేరలేదు. సతీష్ ముత్యాల ఛాయాగ్రహణం బాగానే సాగింది. విజువల్స్ ఆకట్టుకుంటాయి. నిర్మాణ విలువలు ఓకే. రచయిత-దర్శకుడు సతీష్ జవ్వాజి.. ఈ కథతో అసలేం చెప్పదలుచుకున్నాడో అర్థం కాదు. మినిమం రైటింగ్ లేని.. ఫీచర్ ఫిలింకి అర్హం కాని స్క్రిప్టు ఇది. కోన వెంకట్ లాంటి పేరున్న రైటర్ ఈ స్క్రిప్టు ఎలా ఓకే చేసి సినిమాను ప్రొడ్యూస్ చేశాడన్నది అర్థం కాని విషయం.

చివరగా: బ్యాండ్ మేళం.. భరించలేని సౌండు

రేటింగ్- 1.5/5

Tags:    

Similar News