లాస్ట్ మినిట్ ట్విస్ట్‌లు.. 'అఖండ' ఇచ్చిన వార్నింగ్ బెల్!
కానీ బాలయ్య లాంటి సీనియర్ స్టార్ హీరో, అందులోనూ 'అఖండ' లాంటి భారీ బడ్జెట్ సినిమాకు ఇలాంటి పరిస్థితి రావడం నిజంగా ఊహించని పరిణామం.;
సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడూ ఒక మాట బలంగా వినిపిస్తుంటుంది. "సినిమా తీయడం ఒక ఎత్తు, దాన్ని థియేటర్లో రిలీజ్ చేయడం మరొక ఎత్తు". ఈ మాట అక్షరాలా నిజం అని మరోసారి రుజువైంది. భారీ అంచనాల మధ్య వస్తున్న బాలకృష్ణ 'అఖండ 2' విడుదల చివరి నిమిషంలో వాయిదా పడటం ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తాన్ని ఆలోచనలో పడేసింది. కేవలం డబ్బు, క్రేజ్ ఉంటే సరిపోదు.. పర్ఫెక్ట్ ప్లానింగ్ లేకపోతే ఎంతటి స్టార్ హీరో సినిమా అయినా బ్రేకులు పడాల్సిందే అని ఈ సంఘటన ఒక గట్టి హెచ్చరికలా నిలిచింది.
గతాన్ని ఒక్కసారి పరిశీలిస్తే ఇలాంటి ఘటనలు కొత్తేమీ కాదు. రవితేజ బ్లాక్ బస్టర్ హిట్ 'క్రాక్' సినిమా సమయంలోనూ సరిగ్గా ఇలాంటి డ్రామానే జరిగింది. మార్నింగ్ షోలు పడాల్సిన టైమ్ కి ఆర్థిక లావాదేవీల గొడవలు రావడంతో షోలు ఆగిపోయాయి. చివరికి హీరో చొరవతో, సమస్య పరిష్కారమై లేట్ గా షోలు పడ్డాయి. అలాగే పవన్ కళ్యాణ్ 'హరిహర వీరమల్లు' విషయంలోనూ నిర్మాతలకు ఆర్థికపరమైన ఇబ్బందులు తలెత్తినప్పుడు, పవన్ స్వయంగా జోక్యం చేసుకుని రిలీజ్ కు ఇబ్బంది లేకుండా చూసుకున్న సందర్భాలు ఉన్నాయి.
సాధారణంగా చిన్న, మీడియం రేంజ్ సినిమాలకు ఫైనాన్షియల్ ఇష్యూస్ రావడం కామన్. కానీ బాలయ్య లాంటి సీనియర్ స్టార్ హీరో, అందులోనూ 'అఖండ' లాంటి భారీ బడ్జెట్ సినిమాకు ఇలాంటి పరిస్థితి రావడం నిజంగా ఊహించని పరిణామం. బాలయ్య కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా, కేవలం కొన్ని పాత బకాయిల కారణంగా ఆగిపోవడం అనేది హీరో ఇమేజ్ మీద, మార్కెట్ మీద కూడా ప్రభావం చూపిస్తుంది.
అందుకే పెద్ద హీరోలు ఇప్పుడు కేవలం రెమ్యునరేషన్ చూసుకోవడమే కాదు, నిర్మాతల ట్రాక్ రికార్డ్ కూడా చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. నిర్మాతలు పాత అప్పులను క్లియర్ చేయకుండా, కొత్త ప్రాజెక్టులు మొదలుపెట్టినప్పుడు ఇలాంటి లీగల్ చిక్కులు వస్తుంటాయి. ఈ 'అఖండ 2' ఎపిసోడ్ రాబోయే రోజుల్లో మిగతా నిర్మాతలకు ఒక 'అలెర్ట్ బెల్' లాంటిది.
హీరోల డేట్స్ తీసుకునే ముందే ఫైనాన్షియల్ క్లియరెన్స్ లు పక్కాగా ఉండాలి. లేదంటే రిలీజ్ రోజున ఫ్యాన్స్ కు నిరాశ, బయ్యర్లకు టెన్షన్ తప్పదు. సినిమా అనేది వందల కోట్ల బిజినెస్. అక్కడ ఎమోషన్స్ కంటే లెక్కలే ముఖ్యం. ఫైనల్ గా.. తెర మీద హీరోలు విలన్లను ఎంత ఈజీగా కొట్టేసినా, తెర వెనుక ఇలాంటి 'ఆర్థిక' విలన్లను ఎదుర్కోవడం మాత్రం చాలా కష్టంగా మారింది. ఈ చేదు అనుభవం నుంచి ఇండస్ట్రీ పాఠాలు నేర్చుకుని, భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకుంటేనే సినిమా మనుగడ సాఫీగా సాగుతుంది. 'అఖండ' రాక ఆలస్యమైనా, ఈ ఉదంతం మాత్రం ఇండస్ట్రీకి ఒక కనువిప్పు లాంటిది.