30 దాటినా మోక్షజ్ఞ డెబ్యూ లేదు.. ఈసారైనా పట్టాలెక్కిస్తారా?
నందమూరి బాలకృష్ణ కెరీర్ లో సూపర్ హిట్ సినిమాల్లో ఆదిత్య 369 ఓకటి. ఈ సినిమా 90ల్లోనే టైమ్ ట్రావెల్ నేపథ్యంలో తెరకెక్కి.. మంచి విజయం సాధించింది.;
నందమూరి బాలకృష్ణ కెరీర్ లో సూపర్ హిట్ సినిమాల్లో ఆదిత్య 369 ఓకటి. ఈ సినిమా 90ల్లోనే టైమ్ ట్రావెల్ నేపథ్యంలో తెరకెక్కి.. మంచి విజయం సాధించింది. దీనికి సీక్వెల్ తీయాలని రెండు, మూడేళ్లుగా ప్లాన్స్ చేస్తున్నా ఇప్పటికీ అధికారికంగా ప్రారంభం కాలేదు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సీక్వెల్ సెప్టెంబర్ లో మొదలుకానున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమా ఆదిత్య 999 మ్యాక్స్ గా రానున్నట్లు తెలిసిందే. అయితే దీనిని తొలుత బాలకృష్ణయే స్వయంగా దర్శకత్వం వహించాలని అనుకున్నారు. అలాగే తన తనయుడు మోక్షజ్ఞను కూడా ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాలనుకున్నారు. కాకపోతే, అటు దర్శకత్వం ఇటు నటన అంటే బ్యాలెన్స్ చేయడం కష్టమవుతుందని భావించిన బాలయ్య... ఈ బాధ్యతలు స్టార్ డైరెక్టర్ క్రిష్ కు అప్పగించారు. క్రిష్ తన నైపుణ్యంతో ఈ ప్రాజెక్ట్ స్థాయిని బాగా పెంచగలడని నమ్మిన బాలయ్య అతడికి ఇచ్చేశారు.
ఫాంటసీ సైన్స్ ఫిక్షన్ సాహసయాత్ర ద్వారా ప్రేక్షకులను టైమ్ ట్రావెల్ లోకి తీసుకెళ్లే విధంగా ఈ సినిమా రానున్నట్లు తెలుస్తోంది. భారీ సెట్టింగ్ లుతో సినిమాను ఊహించని విధంగా గ్రాండ్ గా, ఉత్కంఠభరితంగా రూపొందించనున్నారు. ఇందులో బాలయ్య మూడు ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారని టాక్. ఇందులో ఒకటి శ్రీ కృష్ణ దేవరాయ పాత్ర ఉండనుంది.
అయితే ఇదంతా బాగానే ఉన్నా.. బాలయ్య తనయుడి డెబ్యూ పై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. తొలుత మోక్షజ్ఞను పరిచయం చేసే బాధ్యతను హనుమాన్ మూవీ డైరెక్టర్ ప్రశాంత్ వర్మకు అప్పగించారు. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ప్రారంభం అయ్యాయి. అందులో భాగంగానే మోక్షజ్ఞ లుక్ కూడా రివీల్ చేశారు. అయితే తన తనయుడిని ఇలా సోలో మూవీతో కాకుండా ముందు, సహాయ పాత్రలో చూపించి ఇండస్ట్రీకి పరిచయం చేయాలని బాలయ్య తర్వాత భావించారు.
అందుకే ప్రశాంత్ సినిమాతో కాకుండా.. అంతకంటే ముందుగా ఆదిత్య 999 మ్యాక్స్ లో భాగం చేయాలని అనుకున్నారు. బాలయ్య విషయంలో కూడా ఆయన తండ్రి సీనియర్ ఎన్టీఆర్ ఇలాగే చేశారు. దీంతో ఆయన మోక్షజ్ఞ విషయంలో కూడా ఇదే ఫాలో అవుతున్నారు. అందుకే మోక్షజ్ఞ- ప్రశాంత్ ప్రాజెక్ట్ కు బ్రేక్ పడింది. ఇప్పటికే మోక్షజ్ఞ వయసు 30ఏళ్లు దాటింది. ఆయన ఇంకా అరంగేట్రం చేయలేదు. ఇదిగో, అదిగో అంటూ ఊరిస్తూ వస్తున్నారు. మరి సెప్టెంబర్ లో అయినా.. ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కుంతుందా? చూడాలి!