ఆ ఇద్ద‌రిపై రూమ‌ర్స్ తేల్చేసిన బిగ్ బాస్ స్టార్!

రీల్ జోడీలు రియ‌ల్ లైఫ్ లోనూ ప్రేమ‌లో ప‌డ‌టం అప్పుడ‌ప్పుడు క‌నిపిస్తుంటుంది. ఇది నిజ‌మే అయితే సోష‌ల్ మీడియాలో ఎలాంటి ప్ర‌చారాలు తెర‌పైకి వ‌చ్చినా? ప‌ర్వాలేదు.

Update: 2026-06-08 18:30 GMT

రీల్ జోడీలు రియ‌ల్ లైఫ్ లోనూ ప్రేమ‌లో ప‌డ‌టం అప్పుడ‌ప్పుడు క‌నిపిస్తుంటుంది. ఇది నిజ‌మే అయితే సోష‌ల్ మీడియాలో ఎలాంటి ప్ర‌చారాలు తెర‌పైకి వ‌చ్చినా? ప‌ర్వాలేదు. కానీ స్నేహాన్ని ప్రేమ‌గా త‌ప్పుగా భావించి ర‌క‌ర‌కాల క‌థ‌నాలు అల్లేస్తేనే ఇబ్బంది. ఒక్కోసారి వృత్తిపరమైన సాన్నిహిత్యాన్ని కూడా అభిమానులు, సోషల్ మీడియా వేదికలు ప్రేమగానో? పెళ్లిగానో? చిత్రీకరించేస్తుంటాయి. రియాలిటీ షో బిగ్ బాస్ 18 ద్వారా ప్రేక్షకులకు దగ్గరైన నటుడు అవినాష్ మిశ్రా- నటి ఈషా సింగ్ విషయంలో కూడా సరిగ్గా ఇదే జరిగింది. ఇద్ద‌రి మధ్య ఏదో నడుస్తోందని, త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారంటూ కొన్ని రోజులుగా జోరుగా ప్రచారం సాగుతోంది.

ఈ ఊహాగానాలకు బలం చేకూరుస్తూ ఇటీవల సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. వాటిని చూసిన కొందరు అభిమానులు నిశ్చితార్థం కూడా అయిపోయిందని భావించారు. అయితే ఈ రూమర్లపై తాజాగా అవినాష్ మిశ్రా పూర్తి స్పష్టతనిచ్చారు. తామిద్దరం కేవలం మంచి స్నేహితులం మాత్రమేనని, అంతకు మించి తమ మధ్య ఎలాంటి సంబంధం లేదని ప్ర‌చారానికి చెక్ పెట్టారు. అలాగే వైరల్ అయిన పెళ్లి- నిశ్చితార్థపు ఫోటోల వెనుక ఉన్న అసలు రహస్యాన్ని కూడా వెల్లడించారు. తాము ఇటీవల ఒక మ్యూజిక్ వీడియో కోసం కలిసి పనిచేశామని, అది పెళ్లి నేపథ్యంలో సాగే పాట కావడంతో మెహందీ, సంగీత్, ఫేరాస్ వంటి సన్నివేశాలను చిత్రీకరించామన్నారు.

ఆ షూటింగ్ సమయంలో సరదాగా దిగిన ఫోటోలే సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారానికి కారణమయ్యాయని, అంతేకానీ నిజంగా తమకు నిశ్చితార్థం జరగలేదని అవినాష్ వెల్ల‌డించారు. ప్రస్తుతం తాను ఒంటరిగానే ఉన్నానని, ఈషా సింగ్‌తోనే కాకుండా పరిశ్రమలో చాలా మంది స్నేహితులు ఉన్నారని తెలిపారు. వారితో కలిసి బయటకు వెళ్లినప్పుడు ఇలాంటి ప్రచారాలు చేయడం సరికాదన్నారు. భవిష్యత్తులో తాను ఎవరిని పెళ్లి చేసుకోవాలనేది పూర్తిగా తన తల్లి నిర్ణయిస్తుందని అమ్మ చూసిన అమ్మాయినే వివాహం చేసుకుంటానని అవినాష్‌ స్పష్టం చేశారు.

`బిగ్ బాస్ 18` షో ముగిసిన తర్వాత కూడా అవినాష్, ఈషా సింగ్ కలిసి పలు ప్రాజెక్టులలో నటించారు. `బర్సాత్ హో రహి`, `కాలా షా కాలా`, `హీరియే`, `శుక్రియా`, వంటి వరుస మ్యూజిక్ వీడియోలలో ఇద్ద‌రి స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ ఆన్-స్క్రీన్ జోడీని చూసి నిజ జీవితంలో కూడా వీరి జంట అయితే బాగుంటుందని అభిమానులు కోరుకోవడం, దానికి తోడు సోషల్ మీడియా ప్రచారాలు తోడవడంతో ఈ రూమర్స్ మరింతగా వ్యాపించాయి. ప్రస్తుతం ఇద్ద‌రు వృత్తిపరమైన జీవితంలో బిజీగా ఉన్నారు. ఈషా సింగ్ ఇటీవల నిర్మాత ఏక్తా కపూర్ నిర్మించిన `నాగిన్ 7` సీరియల్‌తో పాటు ఒక చిత్రంలో కూడా న‌టించింది. అవినాష్ మిశ్రా ప్రస్తుతం రోహిత్ శెట్టి యాక్షన్ రియాలిటీ షో `ఖత్రోన్ కే ఖిలాడీ 15`లో కంటెస్టెంట్‌గా పాల్గొంటున్నాడు.

Tags:    

Similar News