ప్రపంచంలోనే ఖరీదైన సినిమాగా అవెంజర్స్: డూమ్స్‌డే.. బడ్జెట్ ఎంతంటే
హాలీవుడ్ లో మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ లో రాబోతున్న క్రాస్ ఓవర్ ఈవెంట్ మూవీ అవెంజర్స్: డూమ్స్‌డే.;
హాలీవుడ్ లో మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ లో రాబోతున్న క్రాస్ ఓవర్ ఈవెంట్ మూవీ అవెంజర్స్: డూమ్స్‌డే. ఈ సినిమా కోసం మార్వెల్ స్టూడియోస్ భారీ బడ్జెట్ ను ఖర్చు పెట్టనున్నట్టు తెలుస్తోంది. దీని కోసం నిర్మాతలు అక్షరాలా ఒక బిలియన్ డాలర్లను ఖర్చు పెట్టబోతున్నట్టు అంచనా. ఈ భారీ మొత్తాన్ని స్టార్ క్యాస్ట్ కోసం మరియు విజువల్ ఎఫెక్ట్స్ కోసమే ఖర్చు పెడుతున్నారట.
కేవలం నటీనటుల రెమ్యూనరేషనే 250 మిలియన్ డాలర్లకు మించి ఉంటుందని అంటున్నారు. అంతేకాదు, ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ కోసమే మార్వెల్ ఏకంగా 8 మిలియన్ డాలర్లు ఖర్చు చేశాడట. ఇది యాంట్‌మ్యాన్ అండ్ ది వాస్ప్: క్వాంటుమేనియాకి ఖర్చు చేసిన దాని కంటే మూడు రెట్లు ఎక్కువని తెలుస్తోంది. హాలీవుడ్ లో ఇప్పటివరకు భారీ బడ్జెట్ తో నిర్మితమైన సినిమా అంటే స్టార్ వార్స్: ది ఫోర్స్ అవేకెన్స్.
ఈ సినిమా కోసం మేకర్స్ 447 మిలియన్ డాలర్లను ఖర్చు చేశారు. ఇక రెండో అత్యంత ఖరీదైన సినిమాగా అవతార్: ది వే ఆఫ్ వాటర్ ను 350 నుంచి 460 మిలియన్ డాలర్లతో నిర్మించారు. ఆ తర్వాత పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్: ఆన్ స్ట్రేంజర్స్ టైడ్స్ అనే సినిమాను సుమారు 379 మిలియన్ డాలర్ల ఖర్చుతో నిర్మించారు.
ఫోర్బ్స్ మ్యాగజైన్ నివేదిక ప్రకారం, అవెంజర్స్: డూమ్స్‌డే సినిమా ప్రొడక్షన్ కు అయ్యే ఖర్చు క్వాంటుమేనియా కంటే రెండు రెట్లు ఎక్కువ అని సూచిస్తుంది. మొత్తం మీద ఈ సినిమాకు మార్వెల్ స్టూడియోస్ కు 500 నుంచి 600 మిలయన్ డాలర్ల మధ్య వరకు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. అంటే హాలీవుడ్ లో అత్యంత ఖర్చు తో తీసిన సినిమాగా ఇకపై అవెంజర్స్: డూమ్స్‌డే సినిమానే నిలుస్తుందన్నమాట.