అవతార్ 3 ట్రైలర్: కామెరూన్ మార్క్ విజువల్ మాయాజాలం
జేమ్స్ కామెరూన్ అవతార్ ఫ్రాంఛైజీకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్ గురించి చెప్పాల్సిన పని లేదు.;
జేమ్స్ కామెరూన్ అవతార్ ఫ్రాంఛైజీకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్ గురించి చెప్పాల్సిన పని లేదు. ఈ ఫ్రాంఛైజీలో ఇప్పటికే రెండు సినిమాలు విడుదలై సంచలన విజయాలు సాధించాయి. ప్రపంచవ్యాప్తంగా బిలియన్ డాలర్ వసూళ్లను సాధించడం ఈ ఫ్రాంఛైజీకే చెల్లింది. అవతార్ 2 చిత్రానికి సమీక్షలు ప్రతికూలంగా వచ్చినా వసూళ్లలో ఎక్కడా తగ్గలేదు.
ఇప్పుడు కామెరూన్ నుంచి అవతార్ 3 (ఫైర్ అండ్ యాష్) విడుదలకు సిద్ధమవుతోంది. ఈ ఏడాది డిసెంబర్ లో ఈ మూడో భాగం ప్రేక్షకాభిమానులకు ట్రీటివ్వనుంది. ఇప్పటికే కామెరూన్ ఈ సినిమాకి సంబంధించిన చాలా అప్ డేట్స్ ఇచ్చారు. ఇంతకుముందు 2024 D23 ఎక్స్‌పోలో అవతార్ 3 ప్రీగ్లింప్స్ ని విడుదల చేయగా దానికి అద్భుత స్పందన వచ్చింది.
ఇప్పుడు అవతార్ 3 పూర్తి ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్ ఆద్యంతం ఎప్పటిలానే మెరుపులు కనిపించాయి. కామెరూన్ మార్క్ విజువల్ మాయాజాలం విస్మయపరిచింది. ముఖ్యంగా అవతార్ - ది వే ఆఫ్ వాటర్స్ తో పోలిస్తే ఈసారి మూడో భాగం విజువల్స్ ని మరింత గ్రిప్పింగ్ గా చూపిస్తున్నారని అర్థమవుతోంది. ట్రైలర్ ఆరంభమే ఆకాశంలో తేలియాడే, ప్రయాణించే అద్భుత జీవులు లేదా ఆకాశ నావలతో ఆశ్చర్యపరిచారు.
ట్రైలర్‌లో జేక్ సుల్లీ కుటుంబం విలన్ వరంగ్ తాలూకా సైన్యంతో పోరాడటానికి దళాలను సంసిద్ధం చేస్తూ కనిపించాడు. సుల్లీ ఫ్యామిలీ తమ ముందు ఉన్న శత్రువును ఢీ కొట్టడానికి క్వారిచ్ (స్టీఫెన్ లాంగ్)తో పొత్తు పెట్టుకుంటారు. పండోర అడవులలోని కొన్ని భాగాలు వరంగ్ (అగ్ని దేవత) మంటల కారణంగా కాలిపోతూ కనిపిస్తాయి. సుల్లీ ఫ్యామిలీ నిప్పుతో చెలగాటమాడటాన్ని చూపించారు కామెరూన్. అతడు అతడి తెగను నాశనం చేసే వరంగ్ (విలన్) `మీ దేవతకు ఇక్కడ ఆధిపత్యం లేదు` అంటూ హుంకరించడం కనిపిస్తుంది. విలన్ తో పోరాటంలే జేక్ సుల్లీ- నితాయిరే తమ కుమారుడిని కోల్పోవడాన్ని కూడా ట్రైలర్ లో చూపించారు. కొడుకును కోల్పోయిన కోపంతో సుల్లీ సేన ఎలాంటి ప్రతిదాడికి దిగిందో సినిమాలో చూడాల్సి ఉంటుంది.
అవతార్ 3 చిత్రం 'ఫైర్ అండ్ యాష్ ది వే ఆఫ్ వాటర్' కంటే కొంత పెద్దదిగా ఉంటుందని కామెరూన్ గతంలో అన్నారు. ఈ చివరి చిత్రం 3 గంటల 12 నిమిషాల నిడివితో సాగుతుంది. 'అవతార్: ఫైర్ అండ్ ఆష్' 19 డిసెంబర్ 2025న థియేటర్లలోకి రానుంది. ఇది మొదటి రెండు భాగాల కంటే పెద్ద విజయం సాధిస్తుందని కామెరూన్ చెబుతున్నారు. 2009లో విడుదలైన మొదటి అవతార్ ప్రపంచవ్యాప్తంగా 2.9 బిలియన్ డాలర్లను వసూలు చేయగా, 2022లో వచ్చిన సీక్వెల్ 'ది వే ఆఫ్ వాటర్' 2.3 బిలియన్ డాలర్లు వసూలు చేసింది. అవతార్ 3 ఇప్పుడు ఏ స్థాయిలో వసూలు చేయనుందో వేచి చూడాలి. అవతార్4 చిత్రం 2029 డిసెంబర్ 21న విడులవుతుంది. అవతార్ 5 చిత్రం 19 డిసెంబర్ 2031న వస్తుంది.