హైకోర్టులో అషురెడ్డి పిటిషన్.. ఏం జరిగిందంటే?
బిగ్ బాస్ ఫేమ్, సినీ నటి అషు రెడ్డిపై నమోదైన చీటింగ్ కేసు వ్యవహారం మరోసారి చర్చనీయాంశమైంది.;
బిగ్ బాస్ ఫేమ్, సినీ నటి అషు రెడ్డిపై నమోదైన చీటింగ్ కేసు వ్యవహారం మరోసారి చర్చనీయాంశమైంది. పెళ్లి పేరుతో భారీగా డబ్బులు తీసుకుని మోసం చేసిందంటూ వచ్చిన ఆరోపణల నేపథ్యంలో.. ఆమె తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. తాజాగా ఆ పిటిషన్ పై హైకోర్టు విచారణ చేపట్టి, కేసును మే 4వ తేదీకి వాయిదా వేసింది.
ఆ కేసులో ఎన్నారై సాఫ్ట్ వేర్ ఇంజనీర్ వైవీ ధర్మేంద్ర తండ్రి ఫిర్యాదు మేరకు హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. తన కుమారుడిని పెళ్లి పేరుతో నమ్మించి రూ.9.35 కోట్ల వరకు మోసం చేసిందని ఆయన ఆరోపించారు. ఈ నేపథ్యంలో నమోదైన ఎఫ్‌ఐఆర్ ను కొట్టివేయాలని అషు రెడ్డి హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. విచారణ సందర్భంగా అషు రెడ్డి తరఫు న్యాయవాది కీలక వాదనలు వినిపించారు.
పెళ్లి కోసం ఒప్పించాలన్న ఉద్దేశంతో ధర్మేంద్ర డబ్బులు ఖర్చు చేశారని తెలిపారు. ఇందులో ఎలాంటి మోసం జరగలేదని స్పష్టం చేశారు. మరోవైపు, ప్రభుత్వం తరఫున అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వివరణకు కొంత సమయం కావాలని కోరడంతో, హైకోర్టు విచారణను మే 4కి వాయిదా వేసింది. అషు రెడ్డి తన పిటిషన్ లో కీలక అంశాలను ప్రస్తావించారు.
సరైన ఆధారాలు లేకుండా తనపై కేసు నమోదు చేశారని, ఇది పూర్తిగా తప్పుడు ప్రచారం ఆధారంగా జరుగుతుందని పేర్కొన్నారు. తన వెర్షన్‌ను పోలీసులు తీసుకోకుండానే ఏకపక్షంగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారని ఆరోపించారు. ఈ కేసు ద్వారా తన ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా, కేసు విచారణపై తాత్కాలిక స్టే ఇవ్వాలని, తదుపరి చర్యల నుంచి రక్షణ కల్పించాలని కోర్టును కోరారు. పోలీసుల దర్యాప్తు తీరుపై కూడా అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ, న్యాయపరంగా ఇది సరైంది కాదని వాదించారు.
ఇక ఫిర్యాదు వివరాల ప్రకారం, హైదరాబాద్ షేక్ పేట్ కు చెందిన యెనుముల సత్యనారాయణ కుమారుడు ధర్మేంద్ర లండన్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీ ర్‌గా పనిచేస్తున్నారు. 2018లో భారత్ కు వచ్చిన సమయంలో అషు రెడ్డితో పరిచయం ఏర్పడిందని తెలిపారు. తాను అమెరికాలో చదువుకుని సినిమా అవకాశాల కోసం హైదరాబాద్ కు వచ్చానని చెప్పి అతనికి దగ్గరైందని ఫిర్యాదులో పేర్కొన్నారు.
తర్వాత ప్రేమ పేరుతో పెళ్లి చేస్తానని నమ్మించి, వివిధ అవసరాల పేరుతో డబ్బులు తీసుకుందని ఆరోపించారు. కారు, బంగారం, ఫ్లాట్లు తదితర ఆస్తులు కొనుగోలు చేయించి, వాటిని తన పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకుందని తెలిపారు.
అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి పెళ్లి జరగబోతోందని నమ్మించి, చివరికి వివాహాన్ని వాయిదా వేస్తూ వచ్చిందని పేర్కొన్నారు. 2025 వరకు మొత్తం రూ.9.35 కోట్ల నగదు, సుమారు ఐదు కిలోల బంగారం, ఫ్లాట్లు, వాహనాలు తీసుకుందని ఫిర్యాదులో ఉంది. అదనంగా అషు రెడ్డి సోదరి కూడా రూ.50 లక్షలు తీసుకుందని ఆరోపించారు. పలుమార్లు వివరణ కోరినా, చివరికి పెళ్లికి నిరాకరించిందని బాధితుడి కుటుంబం తెలిపింది. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు నాన్-బెయిలబుల్ కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం కేసు కోర్టు పరిధిలో ఉండటంతో.. తదుపరి విచారణలో ఏ నిర్ణయం తీసుకుంటుందో అన్నదానిపై ఆసక్తి నెలకొంది.