అందంగా ఉంటే సరిపోదు.. గ్లోబల్ స్టార్ పై కొరియోగ్రాఫర్ ఫైర్!
మిస్ వరల్డ్ నుంచి హాలీవుడ్ స్టార్ వరకు ఎదిగిన ప్రియాంక చోప్రా ప్రయాణం అందరికీ స్ఫూర్తిదాయకం.;
మిస్ వరల్డ్ నుంచి హాలీవుడ్ స్టార్ వరకు ఎదిగిన ప్రియాంక చోప్రా ప్రయాణం అందరికీ స్ఫూర్తిదాయకం. ‘రామ్ చాహే లీలా’, ‘దేశీ గర్ల్’ వంటి పాటలతో స్టెప్పులేసి మెప్పించిన ఆమె, కెరీర్ ఆరంభంలో డ్యాన్స్ రాదని తీవ్ర అవమానాలు ఎదుర్కొన్నారు. ఒక కొరియోగ్రాఫర్ అందరి ముందు మైక్ విసిరేసి తిట్టిన ఘటన తనను ఎంతగానో బాధించిందని, ఆ తర్వాత కత్రినా కైఫ్‌తో కలిసి కఠిన సాధన చేసి గ్లోబల్ స్టార్‌గా ఎదిగానని ప్రియాంక తాజాగా వెల్లడించారు. వివరాలు చూద్దాం..
అందాల కిరీటం ఉన్నా తప్పని తిట్లు:
ప్రియాంక చోప్రా 2000 సంవత్సరంలో మిస్ వరల్డ్ కిరీటాన్ని గెలుచుకుని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. అందాల పోటీల్లో నెగ్గినంత మాత్రాన సినిమాల్లో రాణించడం అంత సులభం కాదని ఆమెకు త్వరగానే అర్థమైంది. ఒక సినిమా షూటింగ్ కోసం దక్షిణాఫ్రికా వెళ్ళినప్పుడు, కొరియోగ్రాఫర్ రాజు ఖాన్ చెప్పిన స్టెప్పులను ఆమె సరిగ్గా వేయలేకపోయారట. ఇక అప్పుడు ఆయన కోపంతో మైకును కింద పడేసి, "నువ్వు అందాల పోటీల నుంచి వచ్చి ఉండవచ్చు, కానీ నటి అయ్యే ముందు డ్యాన్స్ నేర్చుకో" అని అందరి ముందు అరిచేశారట.
నాకు అది పెద్ద సవాలు:
ఆ సమయంలో ప్రియాంక వయసు కేవలం 19 లేదా 20 ఏళ్లు. ఒకేసారి కెమెరా ముందు నటిస్తూ, డ్యాన్స్ స్టెప్పులు వేస్తూ, పక్కన ఉన్న నటుడితో సమె గా డాన్స్ చేసుకోవడం తనకి చాలా కష్టంగా అనిపించేదని ఆమె గుర్తు చేసుకున్నారు. అప్పట్లో డ్యాన్స్ అంటే తనకు అస్సలు వచ్చేది కాదని, కానీ ఆ అవమానం తర్వాత తనను తాను మెరుగుపరుచుకోవాలని గట్టిగా నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఇక ఇప్పుడు ఆ కొరియోగ్రాఫర్ రాజు ఖాన్, ప్రియాంక మంచి స్నేహితులు కావడం విశేషం.
కత్రినా కైఫ్‌తో కఠిన సాధన:
తన డ్యాన్స్‌లో ఉన్న బలహీనతను గమనించిన ప్రియాంక, పట్టుదలతో ప్రాక్టీస్ మొదలుపెట్టారు. ఆ సమయంలో మరో స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ ఆమెకు తోడయ్యారు. అప్పటికే కత్రినా మంచి డ్యాన్సర్‌గా పేరు తెచ్చుకోవడంతో, ప్రియాంక ఆమె దగ్గర మెళకువలు నేర్చుకునేవారట. వీరిద్దరూ కలిసి రోజుకు ఆరు గంటల పాటు డ్యాన్స్ ప్రాక్టీస్ చేసేవారట. అలా కష్టపడి తనను తాను మలచుకుని బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు తిరుగులేని నటిగా ఎదిగారు.
హాలీవుడ్ లో కూడా కష్టం తప్పదు:
ఒక దేశంలో సూపర్ స్టార్ అయినంత మాత్రాన, మరో దేశంలో కూడా అదే గౌరవం లభిస్తుందని అనుకోవడం పొరపాటని ప్రియాంక అభిప్రాయపడ్డారు. హాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకోవడానికి కూడా తాను సున్నా నుంచి మొదలుపెట్టానని, కష్టపడితేనే ప్రేక్షకుల ప్రేమను పొందగలమని అన్నారు. ఇక ఏ రంగంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా ప్రతిభకు కష్టం తోడైతేనే ఫలితం ఉంటుందని ఆమె హితబోధ చేశారు.
రాజమౌళి సినిమాతో గ్రాండ్ ఎంట్రీ:
ఇక దాదాపు 8 ఏళ్ల విరామం తర్వాత ప్రియాంక చోప్రా మళ్లీ ఇండియన్ స్క్రీన్ పై కనిపిస్తున్నారు. దర్శక ధీరుడు రాజమౌళి - మహేష్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న అడ్వెంచర్ మూవీలో ఆమె 'మందాకిని' అనే కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 7న విడుదల కానుంది. ఇక ఓటీటీలో ఆమె నటించిన 'ది బ్లఫ్' ట్రెండింగ్ లో ఉండగా, 'సిటాడెల్' సీజన్ 2 కూడా త్వరలోనే స్ట్రీమింగ్ కానుంది.
రాజమోళి ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమా లో మాస్ సాంగ్ నాటు నాటు ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనందరికీ తెలిసిందే. అదే తరహాలో ఈ సినిమాలో కూడా తన డ్యాన్స్ ట్యాలెంట్ చాటుకునేలా ఒక అదిరిపోయే మాస్ సాంగ్‌ను పెట్టాలని తాను రాజమౌళిని ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేసినట్లు ప్రియాంక గతం లోఓ ఇంటర్వ్యూలో తెలిపారు. మరి అదే నిజం ఐతే మహేశ్ - ప్రియాంకల స్టెప్పులతో థియేటర్లు దద్దరిల్లటం ఖాయం అంటున్నారు ఫాన్స్.
అవమానాలే మెట్లుగా మార్చుకుని గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన ప్రియాంక చోప్రా కథ నిజంగా స్ఫూర్తినిస్తుంది. "అందంగా ఉంటే సరిపోదు.. టాలెంట్ ఉండాలి" అని నాడు కొరియోగ్రాఫర్ అన్న మాటలే నేడు ఆమెను ఈ స్థాయిలో నిలబెట్టాయి. రాజమౌళి సినిమాతో ఆమె ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.