అలాంటి ఆఫర్లు వస్తే నే సినిమాలు చేస్తా!

సినీ ఇండ‌స్ట్రీలో ఒక్కొక్క‌రికీ ఒక్కో ప్యాష‌న్ ఉంటుంది. ఎవ‌రి ఇష్టాలు వారికి ఉంటాయి.;

Update: 2025-08-08 12:30 GMT

సినీ ఇండ‌స్ట్రీలో ఒక్కొక్క‌రికీ ఒక్కో ప్యాష‌న్ ఉంటుంది. ఎవ‌రి ఇష్టాలు వారికి ఉంటాయి. త‌మ ఇష్టాల‌ను ప‌క్క‌న పెట్టి డ‌బ్బు కోస‌మో క్రేజ్ కోస‌మో సినిమాలు చేసేవారు కొంద‌రైతే, ప‌రిస్థితులు ఎలా ఉన్నా తాము అనుకున్న‌దే చేయాల‌నుకునే వారు మ‌రికొంద‌రు. ఇంకొంద‌రు మాత్రం ఆల్రెడీ కెరీర్లో కోరుకున్న గుర్తింపు వ‌చ్చేసింది క‌దా ఇక‌నైనా మ‌న‌సుకి న‌చ్చింది చేద్దామ‌నుకుంటారు.

అలాంటి వారిలో విల‌క్ష‌ణ న‌టుడు ఆశిష్ విద్యార్థి కూడా ఒక‌రు. ఒక‌ప్పుడు వ‌రుస పెట్టి కెరీర్లో గ్యాప్ లేకుండా సినిమాలు చేసిన ఆయ‌న గ‌త కొన్నాళ్లుగా ఎక్కువ సినిమాల్లో న‌టిస్తుంది లేదు. అయితే ఆయ‌న‌కు అవ‌కాశాలు రావ‌డం లేదేమో అందుకే గ‌తంలో లాగా వ‌రుస‌ సినిమాల్లో యాక్ట్ చేయ‌డం లేద‌ని అనుకున్నారు. ఈ నేప‌థ్యంలో తాజాగా ఆశిష్ విద్యార్ధి త‌న యూట్యూబ్ ఛానెల్ లో ఓ వీడియోను రిలీజ్ చేశారు.

ఒకే త‌ర‌హా పాత్ర‌లొస్తున్నాయి

ఆ వీడియోలో త‌న కెరీర్ గురించి, అవ‌కాశాల గురించి మాట్లాడారు ఆశిష్. ఒక‌ప్ప‌టిలా తాను సినిమాలు చేయ‌డం లేద‌ని, ఆడియ‌న్స్ త‌న‌ను మిస్ అవుతున్నార‌నే విష‌యం కూడా త‌న‌కు అర్థ‌మ‌వుతుంద‌ని, త‌న కెరీర్లో ఎన్నో మంచి క్యారెక్ట‌ర్ల‌లో న‌టించి గొప్ప న‌టుడిని అనిపించుకున్నాన‌ని, కానీ త‌న‌కు అన్నీ ఒకే త‌రహా పాత్ర‌లొస్తున్నాయ‌ని, ఇక‌పై అలాంటివి చేయ‌కూడ‌ద‌ని డిసైడైన‌ట్టు చెప్పుకొచ్చారు.

11 భాష‌ల్లో 300 సినిమాలు

అందుకే ఇప్ప‌టివ‌ర‌కు త‌న కెరీర్లో చేయ‌ని కొత్త పాత్ర‌లు వ‌స్తేనే చేస్తాన‌ని, అలాంటి పాత్ర‌ల కోస‌మే వెయిట్ చేస్తున్నాన‌ని, క‌థ‌లో కీల‌కంగా ఉండే అవ‌కాశం ద‌క్కితే త‌ప్ప‌కుండా న‌టిస్తాన‌ని, ఈ విష‌యాన్నే తాను ద‌ర్శ‌క‌నిర్మాత‌ల‌కు కూడా చెప్పిన‌ట్టు తెలిపారు ఆశిష్ విద్యార్ధి. త‌న 30 ఏళ్ల కెరీర్లో 11 భాష‌ల్లో 300 వ‌ర‌కు సినిమాలు చేశాన‌ని, అది త‌న‌కు చాల‌ని, ఇక‌నైనా కొత్త‌ద‌నం చూపించాల‌నుకుంటున్న‌ట్టు ఆయ‌న తెలిపారు. కొంద‌రు ప్ర‌పంచానికి దూరంగా ఉంటూ ఇంట్లో ఉంటే ఒత్తిడికి లోన‌వుతార‌ని, కానీ తాను ఆ ర‌కం కాద‌ని చెప్పుకొచ్చారు ఆశిష్. కాగా ఆశిష్ విద్యార్ధి చివ‌రిగా కిల్, ఆవేశం అనే సినిమాల్లో న‌టించారు.

Tags:    

Similar News