#హీరోయిన్ ఆఫ‌ర్ .. ముఖ్య‌మంత్రి కూతురికి 4కోట్లు టోక‌రా

నిరంత‌రం సైబ‌ర్ నేరాలు, దోపిడీలు, ఘ‌రానా మోసాల గురించి తెలుసుకుని నివ్వెర‌పోవాల్సిన ప‌రిస్థితి నేటి కాలంలో ఉంది.;

Update: 2025-02-09 05:39 GMT

నిరంత‌రం సైబ‌ర్ నేరాలు, దోపిడీలు, ఘ‌రానా మోసాల గురించి తెలుసుకుని నివ్వెర‌పోవాల్సిన ప‌రిస్థితి నేటి కాలంలో ఉంది. మోస‌పూరిత‌మైన ఆఫ‌ర్ల పేరుతో న‌మ్మ‌బ‌లికి కోట్ల‌కు కోట్లు దోచేస్తున్న కేటుగాళ్ల గురించి పోలీసులు ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేస్తుంటే విస్తుపోతున్నాం. ఇటీవ‌ల కోఆప‌రేటివ్ బ్యాంక్ ఆఫ‌ర్ల‌ పేరుతో కొంద‌రు మోస‌గాళ్లు అయిన సినీ న‌టులు ప్ర‌జ‌ల నుంచి కోట్లకు కోట్లు దోచుకున్న వైనంపై క‌థ‌నాలు ఆశ్చ‌ర్య‌ప‌రిచాయి.

ఇప్పుడు హీరోయిన్ ని చేస్తానంటూ మాజీ ముఖ్య‌మంత్రి కుమార్తెకు 4 కోట్ల మేర టోక‌రా వేసాడు ఒక ఘ‌రానా మోస‌గాడు. అత‌డి లీల‌లు వినే కొద్దీ విస్తుగొలిపేలా ఉన్నాయి. నా సినిమాలో హీరోయిన్ గా న‌టించండి. 5 కోట్లు పెట్టుబ‌డి పెడితే స‌రిపోతుంది.. సినిమాని అమ్మ‌డం ద్వారా నాకు 15 కోట్లు ద‌క్కుతుంది. మీకు ఆఫ‌ర్ చేసిన పాత్ర న‌చ్చ‌క‌పోతే, తిరిగి సొమ్ముల్ని వెన‌క్కి ఇచ్చేస్తాన‌ని అత‌డు న‌మ్మించ‌డంతో మాజీ ముఖ్య‌మంత్రి కుమార్తె మోస‌పోయారు. ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి రమేష్ పోఖ్రియాల్ నిషాంక్ కుమార్తె ఆరుషి నిషాంక్ నకిలీ హీరోయిన్ ఆఫర్ కార‌ణంగా మోస‌పోయారు. సినిమా తీసాక మూడు రెట్లు సంపాదిస్తాన‌ని డ‌బ్బు వెన‌క్కి ఇస్తాన‌ని న‌మ్మ‌బ‌ల‌క‌డంతో ఆమె మోస‌గాడి చేతికి చిక్కారు.

ఆరుషి వెల్ల‌డించిన వివ‌రాలు ఇలా ఉన్నాయి. స్క్రిప్ట్ రెడీ చేసి త‌న‌కు న‌చ్చిన పాత్ర‌ను ఆఫ‌ర్ చేస్తాన‌ని, ఆ పాత్రతో సంతోషంగా లేకుంటే త‌న‌ డబ్బును 15 శాతం వార్షిక వడ్డీతో తిరిగి చెల్లించేస్తానని కూడా ద‌ర్శ‌క‌నిర్మాత‌లు హామీ ఇచ్చారు. అయితే ఆశ్చర్యకరంగా ఆరుషికి ఆశించిన‌ పాత్ర ద‌క్క‌లేదు.. డబ్బు కూడా తిరిగి చెల్లించ‌లేదు. చాలా కాలం వేచి చూసినా ప్ర‌యోజ‌నం లేక‌పోవ‌డంతో బాధితురాలు మోస‌పోయాన‌ని గ్ర‌హించారు.

చివ‌రి క్ష‌ణంలో ఆరుషి డెహ్రాడూన్‌లోని కొత్వాలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసారు. ముంబై నివాసితులు మానసి వరుణ్, వరుణ్ ప్రమోద్‌లపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మినీ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అధికారిక పేజీలో చిత్ర బృందం నకిలీ ఫోటోలను ఉంచి, మోసపూరిత ఉద్దేశ్యంతో ఆరుషి ఫోటోల‌ను తొలగించారని కూడా పోలీసులు ద‌ర్యాప్తులో తేల్చారు. ఆరుషి త‌న డబ్బు తిరిగి ఇవ్వాల్సిందిగా వారిని కోర‌గా, ఆమెను చంపుతామని, కుటుంబ ప్రతిష్టను దెబ్బతీస్తామని వారు బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మోసం చూసాక సామాన్య ప్ర‌జ‌ల‌కే కాదు, వీవీఐపీల‌కు ముప్పు తిప్పలు త‌ప్ప‌డం లేద‌ని, ఆర్థికంగా వారి స్థాయిని బ‌ట్టి మోసం స్థాయి బ‌య‌ట‌ప‌డుతోంద‌ని గ్ర‌హించాల్సి ఉంటుంది.

Tags:    

Similar News