డ్యూయల్ రోల్ లో రవితేజ? ఆ మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
మాస్ మహారాజా రవితేజకు కెరీర్ లో ఇప్పుడు ఓ సాలిడ్ హిట్ అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.;
మాస్ మహారాజా రవితేజకు కెరీర్ లో ఇప్పుడు ఓ సాలిడ్ హిట్ అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వరుసగా సినిమాలు చేస్తున్నప్పటికీ, అభిమానులు ఆశించే స్థాయి బ్లాక్ బస్టర్ మాత్రం ఇటీవల కాలంలో రాలేదు. సంక్రాంతి సందర్భంగా విడుదలైన భర్త మహాశయులకు విజ్ఞప్తి చిత్రానికి మంచి టాక్ వచ్చినా, బాక్సాఫీస్ వద్ద ఆశించిన వసూళ్లు సాధించలేకపోయింది. దీంతో రవితేజ నుంచి ఓ స్ట్రాంగ్ కమ్ బ్యాక్ మూవీ రావాలని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.
ఇలాంటి సమయంలో ఆయన నటిస్తున్న తాజా చిత్రం ఇరుముడిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సెన్సిబుల్ కథలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు శివ నిర్వాణ ఆ సినిమాను తెరకెక్కిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఆ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ లో రవితేజ కొత్త లుక్ లో కనిపించడం సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది.
తాజా సమాచారం ప్రకారం, ఇరుముడిలో రవితేజ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నారని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. రెండు పాత్రలు పూర్తిగా భిన్నమైన షేడ్స్ తో డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. వాటిలో ఒక పాత్రలో ఆయన అయ్యప్ప మాల ధరించిన భక్తుడిగా కనిపించనున్నారు. ఆ రోల్ లో ఎమోషన్స్, డివోషనల్ టచ్ ప్రధానంగా ఉండబోతున్నాయని సమాచారం. మరో పాత్ర యాక్షన్, మాస్ ఎలిమెంట్స్ తో నిండుగా ఉంటుందని చెబుతున్నారు. రెండు వేరియేషన్స్ రవితేజ నటనకు మంచి స్కోప్ ఇస్తాయని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
అసలు రవితేజకు డ్యూయల్ రోల్స్ కొత్తేమీ కాదు. గతంలో కూడా ఇలాంటి పాత్రల్లో మెప్పించారు. ముఖ్యంగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన విక్రమార్కుడు చిత్రంలో అత్తిలి సత్తిబాబు, విక్రమ్ రాథోడ్ గా రెండు భిన్న పాత్రల్లో నటించి కెరీర్ లోనే అతిపెద్ద హిట్ అందుకున్నారు. అలాగే డిస్కో రాజాలో డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించారు. దరువులో కూడా వేర్వేరు గెటప్స్ లో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇక అమర్ అక్బర్ ఆంథోనీలో ట్రిపుల్ రోల్ చేసి తన వర్సటిలిటీని చాటుకున్నారు.
ఇప్పుడు ఇరుముడితో మరోసారి డ్యూయల్ రోల్ ప్రయోగం చేస్తున్న రవితేజ, ఈసారి మాత్రం బాక్సాఫీస్ వద్ద గట్టి హిట్ కొట్టాలని పట్టుదలగా ఉన్నారని తెలుస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ శరవేగంగా సాగుతోంది. బ్రేక్ లు లేకుండా స్పీడ్ గా జరుగుతోంది. భారీ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ చిత్రాన్ని నిర్మిస్తున్నందున ప్రొడక్షన్ విలువలు కూడా హై స్టాండర్డ్స్ లో ఉండనున్నాయి.
మొత్తానికి, మాస్ ఎంటర్టైన్మెంట్ కు తోడు డివోషనల్ టచ్, ఎమోషనల్ కంటెంట్ కలిసొస్తే ఇరుముడి మూవీ రవితేజ కెరీర్ కు టర్నింగ్ పాయింట్ అవుతుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. మరి డ్యూయల్ రోల్ మంత్రం మరోసారి పని చేసి మాస్ మహారాజాకు భారీ విజయాన్ని అందిస్తుందో లేదో వేచి చూడాలి.