కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వస్తున్న యంగ్ డైరెక్టర్..!

Update: 2021-03-30 10:30 GMT
'జ్ఞాపకం' 'స్నేహగీతం' 'ఇట్స్ మై లవ్ సస్టోరీ' వంటి చిత్రాల్లో నటించిన వెంకీ అట్లూరి.. 'తొలిప్రేమ' సినిమాతో డైరెక్టర్ అవతరమెత్తాడు. ఫస్ట్ సినిమా హిట్ అవడంతో వెంటనే 'మిస్టర్ మజ్ను' సినిమా చేశాడు. ఈ రెండు సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న వెంకీ.. ఇప్పుడు 'రంగ్ దే' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. యూత్ స్టార్ నితిన్‌ - కీర్తి సురేష్ జంట‌గా న‌టించిన ఈ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌ ను సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ నిర్మించారు. మార్చి 26న విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ తో మంచి వసూళ్ళు రాబడుతోంది. అయితే సినిమా హిట్ టాక్ తో నడుస్తున్నా దర్శకుడికి మాత్రం క్రెడిట్ దక్కడంలేదనే కామెంట్స్ వస్తున్నాయి.

'రంగ్ దే' సినిమాలో లీడ్ యాక్టర్స్ పెర్ఫార్మన్స్ - దేవిశ్రీప్రసాద్ సంగీతం - లెజెండరీ పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రఫీ - సితార ఎంటరైన్మెంట్స్ ప్రొడక్షన్ వాల్యూస్ విజయానికి కారణమయ్యాయని అంటున్నారు. కానీ డైరెక్టర్ విషయానికొచ్చే సరికి వెంకీ అట్లూరి 'తొలిప్రేమ' 'మిస్టర్ మజ్ను' చిత్రాలనే కొన్ని చేంజెస్ చేసి తెరకెక్కించడని.. ఇండియాలో విడిపోయి ఫారిన్ లో కలవడం అనే కాన్సెప్ట్ తోనే వెళ్తున్నాడని కామెంట్స్ వచ్చాయి. తన కంఫర్ట్ జోన్ లోనే సినిమాలు చేస్తూ కమర్షియల్ సినిమాకి కావలసిన స్ట్రాంగ్ స్క్రీన్ ప్లే - డైలాగ్స్ రాసుకోలేకపోతున్నాడనే విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో వెంకీ తన నాల్గవ సినిమాకి తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

మొదటిసారి తన జోన్ నుంచి బయటకు వచ్చి సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన వెంకీ అట్లూరి.. నెక్స్ట్ సినిమా సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ - దిల్ రాజు బ్యాన‌ర్ క‌లిసి నిర్మించ‌బోతున్నాయని.. అది ల‌వ్ స్టోరీ మాత్రం కాదని.. వేరే త‌ర‌హా సినిమా చేయబోతున్నానని చెప్పుకొచ్చాడు. మరి తదుపరి సినిమాతో ఈ యువ దర్శకుడు వేరే జోనర్ సినిమా చేసి కూడా మెప్పించగలనని నిరూపించుకుంటాడో లేదో చూడాలి.




Tags:    

Similar News